ఊపిరాడని ఓరుగల్లు

ABN , First Publish Date - 2021-05-10T05:56:51+05:30 IST

కరోనా విలయకాలంలో ఊపిరి అందక ఓరుగల్లు విలవిలలాడుతోంది.. కరోనా బారిన పడి శ్వాస కోసం అల్లాడుతున్న రోగులకు ప్రాణవాయువు కొరత జీవన్మరణ సమస్యగా మారింది. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న రోగులకు బెడ్‌ దొరకడం గండంగా మారుతోంది.

ఊపిరాడని ఓరుగల్లు

ఆక్సిజన్‌ బెడ్స్‌ దొరకక అల్లాడుతున్న కొవిడ్‌ బాధితులు

సకాలంలో శ్వాస అందక రాలుతున్న ప్రాణాలు

బెడ్స్‌ లభ్యతపై ఎంజీఎం అధికారుల పొంతన లేని లెక్కలు

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి

ఎంజీఎంలో 570, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 250 ఆక్సిజన్‌ బెడ్స్‌

పెరుగుతున్న రోగుల సంఖ్యకు ఏ మూలకూ సరిపోని వైనం

బ్లాక్‌మార్కెట్‌లో అడ్డగోలు ధరలకు సిలిండర్లు


ఆంధ్రజ్యోతి, హన్మకొండ

కరోనా విలయకాలంలో ఊపిరి అందక ఓరుగల్లు విలవిలలాడుతోంది.. కరోనా బారిన పడి శ్వాస కోసం అల్లాడుతున్న రోగులకు ప్రాణవాయువు కొరత జీవన్మరణ సమస్యగా మారింది. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న రోగులకు బెడ్‌ దొరకడం గండంగా మారుతోంది. సకాలంలో ఆక్సిజన్‌ బెడ్‌ దొరకక కళ్లముందే మరణిస్తున్న వారు కొందరైతే, ఆక్సిజన్‌ బెడ్‌ దొరికినా ఆస్పత్రుల దోపిడీకి లోనై జీవచ్ఛవంలా మారుతున్న వారు మరికొందరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్‌ బెడ్‌ల కొరత ఇప్పుడు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంలో ఆక్సిజన్‌ బెడ్‌లకు కొరత లేదని అధికారులు చెబుతున్నా, అది ఆచరణలో కనిపించడం లేదు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ‘ఆక్సిజన్‌ బెడ్స్‌ లేవు’ అనే సమాధానం నిత్య కృత్యమై కనిపిస్తోంది. ఈ సంక్షోభం ఆక్సిజన్‌ డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, దళారులకు కాసుల పంట పండిస్తుండగా, కరోనా రోగుల కుటుంబాలకు పుట్టెడు అప్పుల్ని మిగుల్చుతోంది. 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరతతో కరోనా బాధితుల  మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.  ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్స్‌ దొరక్క రోగులు  ఆర్తనాదాలు చేస్తున్నారు. తమవారిని ఎలాగైనా బతికించుకునేందుకు రోగుల కుటుంబ సభ్యులు ఎంత డబ్బయినా పెట్టి కొనేందుకు సిద్ధ పడుతున్నారు. అయినా ఆక్సిజన్‌ దొరకడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న స్టాక్‌ సరిపోవడం లేదు. కొత్త స్టాక్‌ రావడం లేదు. ఇదే అవకాశంగా తీసుకొని ఆక్సిజన్‌ డీలర్లు చీకటి వ్యాపారానికి తెరతీసారు. 


ఉమ్మడి జిల్లాలో ఎంజీఎంతో సహా వివిధ ప్రభుత్వ ఆ స్పత్రులకు, ప్రైవేటు ఆస్పత్రులకు పది మంది డీలర్లు ఆ క్సిజన్‌ సరఫరా చేస్తారు. ప్రస్తుత పరిస్థితిని ఆసరా చేసుకొని వారు సిలిండర్లను పంపడం తగ్గించారు. దీనితో ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది. పరిస్థితి విషమంగా ఉన్న కరోనా రోగికి 10 లీటర్లకు తగ్గకుండా ఆక్సిజన్‌ను అం దుబాటులో ఉంచాలి. రోగి పరిస్థితిని బట్టి 15 లీటర్లు కూడా అవసరమవుతుంది. ఒక్క ఎంజీఎం ఆస్పత్రిలో సా ధారణ రోజుల్లోనే రోజుకు 700 లీటర్ల ఆక్సిజన్‌ అవసర మయ్యేది. ఆక్సిజన్‌ అవసరం ఇప్పుడు పదింతలు  పెరి గింది. కానీ లభ్యతే లేదు. ఎంజీఎం ఆవరణలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా రోగుల అవసరాలకు సరిపోవడం లేదు. 


ఆక్సిజన్‌ ఎందుకంటే..

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాల్లో శ్వాస అందకపోవడం,  లేదంటే ఆక్సిజన్‌ తీసుకోవడంలో ఇబ్బంది పడడం. ఇలాంటి సమయాల్లో రోగులకు ఆక్సిజన్‌ థెరపీ అవసరమవుతుంది. సెకండ్‌ వేవ్‌లో కరోనా నేరుగా ఊపిరి తిత్తులపై ప్రభావం  చూపుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. ఇది ఎక్కువగా రోగి శ్వాసను దెబ్బతీస్తోంది. రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలను తగ్గిస్తోంది. దీంతో చాలా మంది రోగులు వ్యాధి సోకిన మూడు నాలుగు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో రోగులకు అందించే చికిత్సలో ఆక్సిజన్‌ కీలకంగా మారింది.


బ్లాక్‌లో ప్రాణవాయువు

కరోనా సోకిన వారికి ఊపిరి అందించడమే మార్గం కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో లేక మరణాల సంఖ్య పెరుగుతోంది.  ఉత్పత్తి, సరఫరా సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమైన మేరకు కోవిడ్‌ రోగులకు అందుబాటులో ఉండడం లేదు. ఇదే అకాశం తీసుకొని దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌        సిలిండర్లు దొడ్డిదారిన చీకటి బజారులోకి తరలిపోతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఉన్నా లేవని చెప్పి కరోనా రోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నాయి. సాధారణంగా ఒక సిలిండర్‌ ధర రూ.300. కానీ ప్రస్తుత సంక్షుభిత          కాలంలో వాటిని రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు చీకటి బజారులో విక్రయిస్తున్నారు. అవి కూడా సకాలంలో దొరకక రోగుల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. ఆక్సిజన్‌ దొరక్క గౌసియా బేగం అనే మహిళ  మృతి చెందింది. గౌసియా బేగం (65) కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు దాదాపు 30 ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఆక్సిజన్‌ బెడ్స్‌ ఒక్కటీ కూడా దొరకలేదు. అన్ని నిండి ఉన్నాయనీ ప్రైవేటు ఆస్పత్రులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. సకాలంలో ఆక్సిజన్‌ అందక గౌసియా బేగం రాత్రి తుది శ్వాస విడిచింది. వరంగల్‌లో ఆక్సిజన్‌ కొరత ఎంత తీవ్రంగా ఉందో, కరోనా రోగులు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.


ఫ్లో మీటర్ల కొరత

కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ సిలిండర్ల ఫ్లోమీటర్లు లేనందు వల్ల రోగులకు ఎక్కించలేకపోతున్నారు. వీటి కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ఫ్లోమీటర్లను ఎవరికి వారు కొనుక్కోనిరావలసిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. డిమాండ్‌ దృష్ట్యా దళారులు వీటితో కూడా చీకటి వ్యాపారం చేస్తున్నారు. అధిక ధరలకు అమ్ముతున్నారు. ఆక్సిజన్‌ ఫ్లోమీటర్ల కొరత కూడా కొవిడ్‌ రోగుల ప్రాణాలను తీస్తున్నది. ఆక్సిజన్‌ నిర్వహణలో ఆస్పత్రి సిబ్బందిలో చాలా మందికి తగిన శిక్షణ లేదు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగానికి అదనంగా కావల్సిన పరికరాలు, నియమాలు కూడా ఉన్నాయి. వీటిల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ కావల్సిన వ్యక్తి డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌  కలిగి ఉండడం కూడా ఒకటి.


వరంగల్‌ నగరంలో 45 ప్రైవేటు ఆస్పత్రుల్లో 1650 కొవిడ్‌ బెడ్స్‌ ఉన్నాయి. వీటిలో 250 మాత్రమే ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్‌ 85 వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో కరోనా ఆక్సిజన్‌ బెడ్స్‌ సుమారు 60 నుంచి 80 వరకు ఖాళీ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.  కానీ ఈ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ బెడ్స్‌ దొరకడం లేదు. హౌజ్‌పుల్‌ అని బోర్డులు పెడుతున్నారు. బెడ్స్‌ దొరికినవారి నుంచి రోజుకు రూ. 40 వేల చొప్పున వసూలు  చేస్తున్నారు. ఒక్క ఆక్సిజన్‌ వెంటిలేటర్‌కే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్‌ తెచ్చుకోమని చెబుతున్నారు. లేకుంటే రోగులను బయటకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఆక్సిజన్‌ ఉన్నా లేవని చెప్పి రోగులను బెదరగొడుతున్నారు. దళారులను రంగంలోకి దింపి వారి ద్వారా సిలిండర్లను రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఇప్పిస్తున్నారు. ఇంత మొత్తం భరించ లేని నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాల వారు అప్పులపాలై ఆగం అవుతున్నారు. 


వరంగల్‌ నగరంలోని పరిస్థితే విభజిత జిల్లాల్లోనూ కనిపిస్తోంది.  వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో 30 కరోనా ఆక్సిజన్‌ బెడ్స్‌  ఉన్నాయి. కరోనా రోగుల్లో ఎక్కువ మంది వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి,  ప్రైవేటు ఆస్పత్రులకు వస్తుండడంతో ఇక్కడ రద్దీ అంతగా లేదు. పైగా ఈ ఆస్పత్రిలో ఐసీయూ (వెంటిలేటర్స్‌/సీఏపీఏ) లేనందు వల్ల 90 శాతం కన్నా ఆక్సిజన్‌ తక్కువగా ఉన్నవారందరిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. రూరల్‌ జిల్లా పరిధిలోని పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 10 కోవిడ్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఇవన్నీ నిండి పోయాయి. 


మహబూబాబాద్‌ జిల్లాలో కూడా ఆక్సిజన్‌ కొరత తీవ్రమవుతోంది. దళారులు ఒక్కో సిలిండర్‌కు రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అవి కూడా సకాలంలో దొరికే పరిస్థితి లేదు. మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 28 కోవిడ్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా అన్నీ భర్తీ అయిపోయాయి. 13 ఐసీయూ (వెంటిలేటర్స్‌/సీపీఏపీ) బెడ్స్‌ కూడా పూర్తిగా నిండిపోయాయి.  ఇక్కడి రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో  23 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా అవి భర్తీ అయ్యాయి. ఐసీయూ(వెంటిలేటర్స్‌/సీపీఏపీ) 14 బెడ్స్‌లో 4 నిండాయి. 8 ఖాళీ ఉన్నాయి.  


ఇక  భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 60 కోవిడ్‌ బెడ్స్‌లో 32 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 200 కోవిడ్‌ బెడ్స్‌లో 126 మంది ఉన్నారు.   ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 160 బెడ్స్‌ ఉండగా వీటిలో కరోనా రోగుల కోసం 60 ఆక్సిజన్‌ బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 40 బెడ్స్‌ నిండాయి.  జనగామ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి 71 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో 46, మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లో 25 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఇవన్నీ కోవిడ్‌ రోగులతో దాదాపుగా నిండిపోయాయి. కొత్తగా వచ్చేవారికి బెడ్స్‌ దొరకని పరిస్థితి. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో 20 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.


ఎంజీఎం అధికారుల దాగుడుమూతలు

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. కేఎంసీలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోకి జనరల్‌ విభాగాలను తరలించారు. ఎంజీఎం పరిస్థితిపై మంత్రులు, అధికారులు తరుచూ సమీక్షలు జరుపుతున్నారు. అంతా బాగానే ఉందని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంజీఎంతో పాటు కరోనా చికిత్స చేస్తున్న ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ చాలినంత ఉందని, కొరత లేదని, రోగులు భయపడాల్సిన అవసరం లేదని అభయం ఇస్తున్నారు. ఎంజీఎం ఆధికారులు ఆదివారం అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం ఆస్పత్రిలో  కోవిడ్‌ బెడ్స్‌ మొత్తం 800 ఉండగా, వాటిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ 570.  వీటిలో ఐసీయూ బెడ్స్‌ 80. ఆక్సిజన్‌ లేని సాధారణ బెడ్స్‌ 150.  ప్రస్తుతం ఎంజీఎంలో 105 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని అధికారులు సెలవిస్తున్నారు. కానీ వాస్తవస్థితిలో మాత్రం ఎంజీఎంలో ఆక్సిజన్‌ బెడ్స్‌ దొరకక రోగులు అల్లాడుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు చెప్పే లెక్కలకు, కొవిడ్‌ వార్డు ముందు బారులు తీరి ఉన్న అంబులెన్సుల్లోని రోగులకు పొంతన కుదరడం లేదు.

Updated Date - 2021-05-10T05:56:51+05:30 IST