బడ్జెట్‌ లేదు..బకాయిలెలా?

ABN , First Publish Date - 2022-08-08T04:58:33+05:30 IST

విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో బడ్జెట్‌ లేదు. దీంతో ఏళ్ల తరబడి బకాయిలు తడిసిమోపెడయ్యాయి. విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం బకాయిలు చెల్లించండి సర్‌చార్జీ లేకుండా చూస్తామని నోటీసులు జారీ చేశారు. పదిరోజులు గడువిచ్చారు. ఈలోపే చాలా కార్యాలయాలకు కనెక్షన్లు కట్‌ చేశారు. ఎక్కువ బకాయి ఉన్న కార్యాలయాలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు, రక్షిత మంచినీటి పఽథకాలకు మూడు రోజుల నుంచి సరఫరా నిలిపివేయడం ప్రారంభించారు. దీంతో వివిధ శాఖల అధికారులు అయోమయానికి గురవుతున్నారు.

బడ్జెట్‌ లేదు..బకాయిలెలా?
పొదిలిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన రక్షిత నీటి పథకం (ఇన్‌సెట్లో) కురిచేడులో నీటి పథకానికి కనెక్షన్‌ కట్‌ చేస్తున్న విద్యుత్‌ సిబ్బంది

 విద్యుత్‌ శాఖ పవర్‌ కట్‌పై 

అధికారుల మల్లగుల్లాలు

బడ్జెట్‌ ఇవ్వని ప్రభుత్వం 

ప్రజలు గొంతెండుతోంది అన్నా 

కనికరించని ట్రాన్స్‌కో 

విధిలేక చేతెలెత్తేస్తున్న వైనం


ఒంగోలు (క్రైం), ఆగస్టు 7 :

ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయిల బకాయిల వసూలుకు విద్యుత్‌ శాఖ ఉపక్రమించింది. ప్రత్యక్ష చర్యలకు దిగింది. ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాలు, రక్షిత నీరు, ఎత్తిపోతల పథకాలకు సరఫరా నిలిపివేస్తోంది. మూడు రోజులుగా ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. ప్రజల గొంతెండుతోంది అన్నా ససేమిరా అంటోంది. దీంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.270 కోట్ల మేర విద్యుత్‌ శాఖకు బిల్లుల బకాయిలున్నాయి. వీటిని చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు తన ఆధీనంలోనే ఉన్న విద్యుత్‌శాఖతో సరఫరా నిలిపివేయించడం విమర్శలకు తావిస్తోంది. 


 విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో బడ్జెట్‌ లేదు. దీంతో ఏళ్ల తరబడి బకాయిలు తడిసిమోపెడయ్యాయి. విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం బకాయిలు చెల్లించండి సర్‌చార్జీ లేకుండా చూస్తామని నోటీసులు జారీ చేశారు. పదిరోజులు గడువిచ్చారు. ఈలోపే చాలా కార్యాలయాలకు కనెక్షన్లు కట్‌ చేశారు. ఎక్కువ బకాయి ఉన్న కార్యాలయాలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు, రక్షిత మంచినీటి పఽథకాలకు మూడు రోజుల నుంచి సరఫరా నిలిపివేయడం ప్రారంభించారు. దీంతో వివిధ శాఖల అధికారులు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదు.. అంతా పైనుంచి ఆదేశాలు అంటూ తేల్చిచెబుతున్నారు. అసలు ప్రభుత్వం బడ్జెట్‌ ఇవ్వకుండా బిల్లులు ఎలా చెల్లించాలని విఽవిధ శాఖల అధికారులు వాపోతున్నారు. అయితే ఇరిగేషన్‌, రక్షిత మంచినీటి పథకాల వరకైనా కనికరించండి అంటూ సంబంధిత శాఖల అధికారులు విద్యుత్‌ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా స్పందన లేదు. కాగా జిల్లాలో మొత్తం బకాయిలు రూ.380 కోట్లు ఉండగా అందులో రూ.270 కోట్లు ప్రభుత్వ శాఖలవే కావడం గమనార్హం. దీంతో విద్యుత్‌ శాఖ బకాయిల వసూలుకు కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివిధ శాఖల బకాయిలు ఇవీ..

విద్యుత్‌ బకాయిల్లో గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ముందుంది. ఆ విభాగం నుంచి రూ.110 కోట్లు చెల్లించాల్సి ఉంది. అనంతరం గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లకు సంబంధించి రూ.88కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ రూ.104 కోట్లు,  లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలకు సంబంధించి రూ.36.60 కోట్లు, రెవెన్యూ శాఖ రూ.16 కోట్లు, విద్యా శాఖ రూ.3.80 కోట్లు, వైద్యారోగ్య శాఖ రూ.3.80 కోట్లు, మున్సిపల్‌ శాఖ రూ.13.60కోట్లు, ఇంకా ఇతర శాఖలు ఎంతో కొంత బకాయిలు ఉన్నాయి. బడ్జెట్‌ లేకపోవడంతోనే బిల్లులు చెల్లించలేకపోతున్నామని అధికారులు బాహాటంగా చెబుతున్నారు. అదే సమయంలో విద్యుత్‌ శాఖ అఽధికారులు తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ తీరుతో విమర్శలు 

ప్రభుత్వ కార్యాలయాలకు బకాయిలు చెల్లించేందుకు ఒకపక్క బడ్జెట్‌ ఇవ్వని ప్రభుత్వం మరోవైపు తన ఆధీనంలోనే ఉన్న విద్యుత్‌శాఖతో సరఫరా నిలిపివేయించడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రక్షిత మంచినీటి పఽథకాలు, ప్రభుత్వ కార్యాలయాలకు  సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వివిధ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు ఆగిపోతున్నాయి. 

మా స్థాయి కాదంటున్న ఎస్‌ఈ 

బకాయిలు చెల్లించకుండా సరఫరాను పునరుద్ధరించడం, లేదా నిలిపివేయకుండా ఉండటం తమ చేతుల్లో లేదని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కేవీవీ సత్యనారయణ తెలిపారు. తాగునీటి పథకాలైనా, ఇరిగేషన్‌ ప్రాజెక్టులైనా ఎలాంటి సడలింపు లేదన్నారు. ఏదైనా సీఎండీ స్థాయిలో మాట్లాడుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు తెలియజేశారు. ఏస్థాయి అధికారులు వెళ్లినా ఇదే సమాధానం చెబుతున్నారు.  


Updated Date - 2022-08-08T04:58:33+05:30 IST