దీనావస్థలో కొత్త జడ్పీలు..

ABN , First Publish Date - 2022-08-08T05:47:44+05:30 IST

పేరుకు జిల్లా స్థాయి హోదా కలిగి ఉన్నప్పటికీ కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయాల పరిస్థితి గ్రామ పంచాయతీల కన్నా అధ్వానంగా తయారైంది. సొంతభవనాలు లేక మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఆశ్రయం పొందాల్సిన దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికి అధికారాలు, నిధులే కాదు.. కార్యాలయాలకు సరైన భవనాలు కూడా కరువయ్యాయి. గతంలో జిల్లా పరిషత్‌లంటే ఒక స్థాయి, హోదా, గౌరవం ఉండేది. ఇప్పుడు అవి ఉన్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు మరిచిపోతున్నారు. కనీసం గ్రామ పంచాయతీలకైనా సొంత భవనాలు ఉన్నాయి. జడ్పీలకు అవి కూడా లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. సొంత భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మూడేళ్లయినా ఇప్పటి వరకు వాటి గురించే పట్టించుకోవడం లేదు.

దీనావస్థలో కొత్త జడ్పీలు..

జిల్లా పరిషత్‌లకు సొంత భవనాలు కరువు
ఎంపీడీవో కార్యాలయాల్లో ఆశ్రయం
అరకొర వసతులు, అధ్వాన గదులు
సమావేశాల నిర్వహణకు ఇబ్బందులు
మూడేళ్లవుతున్నా మారని దుస్థితి


పేరుకు జిల్లా స్థాయి హోదా కలిగి ఉన్నప్పటికీ కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయాల పరిస్థితి గ్రామ పంచాయతీల కన్నా అధ్వానంగా తయారైంది. సొంతభవనాలు లేక మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఆశ్రయం పొందాల్సిన దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికి అధికారాలు, నిధులే కాదు.. కార్యాలయాలకు సరైన భవనాలు కూడా కరువయ్యాయి. గతంలో   జిల్లా పరిషత్‌లంటే ఒక స్థాయి, హోదా, గౌరవం ఉండేది. ఇప్పుడు అవి  ఉన్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు మరిచిపోతున్నారు. కనీసం గ్రామ పంచాయతీలకైనా సొంత భవనాలు ఉన్నాయి. జడ్పీలకు అవి కూడా లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. సొంత భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మూడేళ్లయినా ఇప్పటి వరకు వాటి గురించే పట్టించుకోవడం లేదు.



హనుమకొండ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : కొత్త జిల్లాల ఆవిర్భావం నేపథ్యంలో 2019 జూలై 5న కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు  జడ్పీలకు సొంత భవనాలు లేవు. ఎంపీడీవో కార్యాలయాలే దిక్కయ్యాయి. వాటి భవనాల్లోనే అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల మధ్య జడ్పీ చైర్‌పర్సన్లు, అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా పరిషత్‌ కార్యాలయాలు పేరుకు జిల్లా స్థాయి హోదా కలిగి ఉన్నప్పటికీ వాటి పరిస్థితి పంచాయతీ కార్యాలయాల కన్నా అధ్వానంగా ఉంది.  అధికారాలు, నిధులు లేక కార్యాలయాలకు సరైన భవనాలు లేక వాటి ఉనికి నామమాత్రంగా మారిపోయింది.   

విభజనతో సరి
జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆరు జిల్లాలుగా విడిపోయింది తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగా ఉన్న జిల్లా పరిషత్‌ను సైతం ప్రభు త్వం విభజించి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. దీంతో ఒక జిల్లా పరిషత్‌ స్థానంలో ఆరు జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. కొత్త జిల్లా పరిషత్‌లను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఆ మేరకు అవసరమైన ఉద్యోగులను నియమించలేదు. కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించలేదు. కనీసం అన్ని వసతులున్న వేరే విశాలమైన భవనాల్లోనైనా ఏర్పాటు చేయలేదు.  ఎంపీడీవో కార్యాలయాల్లోనే పై అంతస్తుల్లో వాటికి ఆశ్రయం కల్పించింది. ఇది తాత్కాలికమేనని త్వరలో వాటికి సొంత భవనాల నిర్మాణం జరుగుతుందని హామీ ఇచ్చిన ప్రభుత్వం మూడేళ్లయినా ఇప్పటి వరకు వాటి గురించే పట్టించుకోవడం లేదు.

సగం సగం..
హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి జిల్లా పరిషత్‌ కార్యాలయానికి మొదటి నుంచి విశాలమైన సొంత భవనం ఉంది. అన్ని హంగులతో కూడిన సమావేశం హాల్‌ ఉంది.  ఇందులోనే ఉమ్మడి జిల్లా జడ్పీ అయిదు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగింది. పునర్విభజన ఫలితంగా  ఆరు జిల్లా పరిషత్‌లుగా విడిపోవడంతో వరంగల్‌, హనుమకొండ జిల్లా పరిషత్‌ కార్యాలయాలు ఈ భనవంలోనే కొనసాగుతున్నాయి. భవనాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక పక్క వరంగల్‌, మరో పక్క హనుమకొండ జడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సమావేశం హాల్‌ను మాత్రం రెండు జడ్పీలు ఉమ్మడిగా వాడుకుంటున్నాయి. కాకపోతే రెండూ ఒకే సారి కాకుండా వీలునుబట్టి సమావేశాల తేదీలను సర్దుబాటు చేసుకుంటున్నాయి.  

అరకొర వసతుల మధ్య నిర్వహణ

జనగామ జడ్పీ కార్యాలయానికి ఇప్పటి వరకు సొంత భవనం లేదు. గత మూడేళ్లుగా మండల పరిషత్‌ కార్యాలయం  భవనంపై అంతస్తులో అరకొరవసతుల మధ్య పని చేస్తోంది. మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువైన సమావేశ హాల్‌లేదు. సమావేశాలకు జడ్పీచైర్‌పర్సన్‌, సీఈవో, జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు 48 శాఖలకు చెందిన అధికారులు హాజరుకావలసి ఉంటుంది. వారంతా కూర్చోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడ్సాలిన పరిస్థితి ఉంది.

ఎంపీడీవో భవనంలో...
మహబూబాబాద్‌ జడ్పీ కార్యాలయానికి కూడా ఇప్పటి వరకు సొంత భవనం లేదు. దీనిని కూడా ఎంపీడీవో కార్యాలయం భవనంలోనే పై అంతస్తులో సర్దుబాటు చేశారు. కార్యాలయంలో కనీస వసతులు లేక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమావేశం హాల్‌ సరిగా లేక సర్వసభ్య, స్థాయి సంఘ, ఇతరత్రా అధికారిక సమావేశాల నిర్వహణ కష్టమవుతోంది.

అటు ఇటూగా...

భూపాలపల్లి జడ్పీ కార్యాలయాన్ని ఎంపీడీవో కార్యాలయానికి కూడా సొంత భవనం లేదు. ఈ కార్యాలయానికి వసతి సమకూర్చడానికి ఇతర కా ర్యాలయాలను అటుఇటూగా మార్చారు.  జడ్పీ కార్యాలయాన్ని ఎంపీడీవో కార్యాలయ భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడి ఎంపీడీవో కార్యాలయాన్ని ఎంఈవో కార్యాలయం భవనంలోకి మార్చారు. ఎంఈవో ఆఫీసును ది వ్యాంగుల భవిత కేంద్రం భవనంలో సర్దుబాటు చేశారు. చివరికి భవిత కేంద్రానికి స్థలం లేకుండా చేశారు.

అయ్యో పాపం !
ములుగు జడ్పీ కార్యాలయం రాకతో పాపం ఎంపీడీవో ఉద్యోగులకు అన్యాయం జరిగింది. వారి కార్యాలయ భవనం పాత పడడంతో ఇదే ఆవరణలో అన్ని హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు. ఇంకా కొద్ది రోజుల్లో ఎంపీడీవో కార్యాలయం అందులోకి మారాల్సి ఉంది. కొత్త భవనంలోకి వెళ్తున్నందుకు ఉద్యోగులు కూడా సంతోషించారు. 2019లో ములుగు జిల్లా ఏర్పాటయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్‌ను విడదీసి 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో ములుగు జిల్లా పరిషత్‌ కార్యాలయానికి భవనం కావాల్సి వచ్చింది. అప్పటికే నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న  ఎంపీడీవో కార్యాలయం భవనంపై దృష్టి పడింది. దీంతో జడ్పీ కార్యాలయాన్ని అందులోనే ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కార్యాలయం పాతభవనంలోనే కొనసాగుతోంది.

ప్రతిపాదనలేవి ?
జడ్పీ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతూ సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. అధికారులు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించారు. స్థలాలు అందుబాటులో ఉన్నట్లయితే భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వన్నుట్టు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఏ జడ్పీకి నిధులు రాలేదు. కనీసం భవనాల నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వలేదు. జడ్పీలు కూడా మంజూరయ్యే నిధులు జడ్పీటీసీల అభివృద్ధి పనుల కేటాయింపులకే సరిపోతున్నాయి. జడ్పీ భవనాలకు, వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాగా జడ్పీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేయడం లేదు. కేంద్రం పంచాయతీలకే నేరుగా నిధులను మంజూరు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులేమి ఇవ్వడం లేదు. దీంతో జడ్పీల ఉనికి నామావశిష్టంగా మారింది.

Updated Date - 2022-08-08T05:47:44+05:30 IST