పంచాయతీల్లో పైసల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-09-15T06:23:27+05:30 IST

నిధుల సమస్యతో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఏపనీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

పంచాయతీల్లో పైసల్లేవ్‌!
త్రిపురాంతకం మండలం లేళ్లపల్లిల్లో రోడ్డుపై చేరిన మురుగు

గ్రామాల్లో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

వెంటాడుతున్న సీజనల్‌ వ్యాధులు 

పనుల కోసం కార్యదర్శులపై ఒత్తిడి

 కేంద్రం ఇచ్చిన నిధులు వస్తాయో లేదోనని ఆందోళన

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 14: నిధుల సమస్యతో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఏపనీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు పడుతుండటంతో గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలి ప్రజానీకం వణికిపోతోంది. ఈ క్లిష్ట సమయంలో వైద్యారోగ్య, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా అందుకు భిన్నమైన పరిస్థితి  నెలకొంది. జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో నిధుల కొరత కారణంగా సర్పంచ్‌లు చేతులెత్తేస్తున్నారు. ఆభారం పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది. ఇప్పటికే పంచాయతీ   సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాల్లో పలు రకాల పనులు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు ఏపనులు చేయాలన్నా సర్పంచ్‌లు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగుకాల్వలు పొంగిపొర్లుతున్నాయి. మురుగు రోడ్లపైకి చేరి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దోమల బెడద ఎక్కువైంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా లక్షలాది మంది జ్వరం, జలుపు, దగ్గు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అయినా గ్రామాల్లో కనీస పారిశుధ్య చర్యలు చేపట్టని దుస్థితి నెలకొంది. 


ఉన్న కొద్ది నిధులూ ఇవ్వడం లేదు

విభజన అనంతరం జిల్లాలో ఉన్న 650 గ్రామపంచాయతీల్లో 300చోట్ల కొంతమేర సాధారణ నిధులు ఉండగా వాటిని ఇప్పటికే చేసిన పను లకు డ్రా చేసుకునేందుకు బిల్లులను ట్రెజరీలకు పంపారు. అవి ట్రెజరీలో ఆమోదం పొందాయి. కానీ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఎప్పుడు బ్యాంకు ఖాతాల్లో పడతాయో తెలియని పరిస్థితి. సాధారణ నిధుల పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం వారం క్రితం జిల్లాకు రూ.22కోట్లు  మంజూరు చేసింది. ఆ నిధులను పంచాయతీ ఖాతాల్లో వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆపివేసింది.  దీంతో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఇబ్బందిపడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో జిల్లా అధికారులు వారిపై ఒత్తిడి పెంచుతున్నా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఆ ప్రభావం పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో పారిశుధ్యం కోసం సత్వరచర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తుండటంతో వారు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. 


Updated Date - 2022-09-15T06:23:27+05:30 IST