గుజరాత్‌లో బీజేపీని ఎదిరించే శక్తి ఏదీ లేదు : సీఎం పటేల్

Published: Tue, 29 Mar 2022 14:02:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గుజరాత్‌లో బీజేపీని ఎదిరించే శక్తి ఏదీ లేదు : సీఎం పటేల్

గాంధీ నగర్ : గుజరాత్‌లో వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దోహదపడతాయని భావిస్తోంది. అంతేకాకుండా తనను సవాల్ చేసే శక్తి లేదని విశ్వసిస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలగడంతో చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది.


బీజేపీ నేత, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రశ్నించినపుడు పటేల్ స్పందిస్తూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎటువంటి సవాళ్లు లేవని తెలిపారు. తాము చేసిన అభివృద్ధే మాట్లాడుతుందని, ఈ విషయం ప్రజలకు బాగా తెలుసునని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనైనా, మరొక తీవ్రమైన సమస్యా కాలంలోనైనా ప్రజలతో కలిసి, ప్రజలకు మద్దతుగా ఉన్నది బీజేపీ మాత్రమేనని చెప్పారు. తమకు ఎటువంటి సవాల్ లేదనేది వాస్తవమని చెప్పారు. తాము అభివృద్ధి కోసం కృషి చేస్తున్నపుడు ఎన్నికల ఫలితాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. 


‘గుజరాత్ మోడల్’ అనే అభివృద్ధి మోడల్‌ను బీజేపీ అమలు చేస్తోందని, దీనికి విస్తృత స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. తాను 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, అప్పట్లో జరిగిన గాంధీ నగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చాలా మంది ఊహించారని, కానీ 44 స్థానాల్లో 41 స్థానాలను బీజేపీ గెలుచుకుందని చెప్పారు. ప్రజలకు తాము చేసిన మంచి పనుల ఫలితంగా ఈ విజయం దక్కిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని తెలిపారు. ప్రజల సమష్టి వివేకం ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుందని తెలిపారు. గుజరాత్ ప్రజల సమష్టి వివేకం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. 


తాయిలాలతో కూడిన పథకాలను ప్రవేశపెడతామని ఇతర పార్టీలు ప్రజలను ఊరిస్తున్నాయని, దీనివల్ల బీజేపీకి సవాల్ ఎదురవుతుందని భావిస్తున్నారా? అని అడిగినపుడు పటేల్ సమాధానమిస్తూ, తాను సకారాత్మకంగా ఆలోచిస్తానని చెప్పారు. తాను ఫలానావారిని ఓడించాలనే లక్ష్యంతో పని చేయబోనని చెప్పారు. ప్రజల కోసం పని చేసి, విజయం సాధిస్తామని తెలిపారు. తాము కూడా ఉచిత తాయిలాలను ప్రకటించగలమని, అయితే తాము సుపరిపాలనను అందిస్తామని, బడ్జెట్ సంతులనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక దూరదృష్టితో వ్యవహరిస్తామని చెప్పారు. ఉచిత తాయిలాల రాజకీయాలు చేస్తే, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మాదిరిగా రాష్ట్ర బడ్జెట్ లోటు పెరుగుతుందని వివరించారు. 


182 స్థానాలున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతాయి.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.