వారసుల ఆశలపై నీళ్లు

ABN , First Publish Date - 2022-10-04T04:57:13+05:30 IST

అధికారం ఉన్నప్పుడే వారసుల రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. వారసులకు టిక్కెట్‌ ఇచ్చేదిలేదని.. ఇప్పుడున్నవారే పోటీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో వారసులను పోటీకి దించాలనుకున్న అధికారపార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. రాజకీయ కార్యక్రమాల్లో ఇప్పటివరకు చురుగ్గా ఉన్న వారసులు.. ఏమిచేయాలో తెలియక సతమతమవుతున్నారు.

వారసుల ఆశలపై నీళ్లు

- రానున్న ఎన్నికల్లో కొడుకులకు నో చాన్స్‌
- సర్వేలు అనుకూలంగా లేకపోవడమే కారణం
- అధికార పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన సీఎం
- ఆ మూడు చోట్ల అంతర్మథనం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)  

అధికారం ఉన్నప్పుడే వారసుల రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. వారసులకు టిక్కెట్‌ ఇచ్చేదిలేదని.. ఇప్పుడున్నవారే పోటీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో వారసులను పోటీకి దించాలనుకున్న అధికారపార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. రాజకీయ కార్యక్రమాల్లో ఇప్పటివరకు చురుగ్గా ఉన్న వారసులు.. ఏమిచేయాలో తెలియక సతమతమవుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. మూడున్నరేళ్ల ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రాకు ఏకైక రాజధాని అమరావతికి టీడీపీ కట్టుబడి ఉంది. వైసీపీ మాత్రం మూడు రాజధానుల పేరిట కాలయాపన చేస్తోంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తోందంటూ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ తీరుపై టీడీపీ ‘బాదుడే బాదుడు’ పేరిట నిత్యం ఆందోళనలు చేస్తోంది. ప్రజలను చైతన్య పరుస్తోంది. ఈక్రమంలో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ పేరిట వైసీపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తుండగా.. నిలదీతలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు వైసీపీ, టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. వైసీపీకి ఈసారి గెలుపు కష్టమేనని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారసులకు టిక్కెట్‌ ఇచ్చి బరిలో దింపితే.. అసలుకే ఎసరు వస్తుందని సీఎం జగన్‌ భావించారు. ప్రస్తుతం ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తామని.. వారసులకు అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వారసులు.. ద్వితీయ నాయకత్వానికే పరిమితం కానున్నారు. వైసీపీ వ్యూహకర్త.. ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో ఐపాక్‌ ద్వారా అంతటా సర్వే  పూర్తయిందని సమాచారం. ఐపాక్‌ కాకుండా.. ఇతర సంస్థల ద్వారా సర్వే చేశాక.. సీఎం టిక్కెట్ల మార్పుపై నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

ఆ మూడు చోట్ల.. నిరాశే
రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు తమ వారసులను రంగంలోకి దింపడం పరిపాటే. ఆ రీతిలోనే నాయకుల కుమారులు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు.. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
- మాజీమంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కొన్ని నెలల కిందట తను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.
తన కుమారుడు కృష్ణచైతన్యను ఎన్నికల బరిలో దింపుతానని పేర్కొన్నారు. కృష్ణ చైతన్య జడ్పీటీసీగా గెలుపొందారు. చురుగ్గా వ్యవహరిస్తూ.. రానున్న ఎన్నికల్లో సీటు కోసం వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు.

- ఆమదాలవలస ఎమ్మెల్యే, స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవినాగ్‌ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

- శ్రీకాకుళంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడు కూడా.. నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ధర్మాన ప్రసదారావు పలుసందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ.. తాను చిన్నవయసులోనే కీలక పదవులను చేపట్టానని.. విశ్రాంతి తీసుకోవాలని ఉందని వెల్లడించారు. అయితే ఇటీవల సీఎం వ్యాఖ్యలతో జిల్లాలో ఈ మూడుచోట్ల వారసుల ఆశలపై నీళ్లు పోసినట్లయింది. అధికారపార్టీ.. ఆపై తండ్రుల అండతో ధీమాగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావించినవారికి ఏడాదిన్న ముందే నిరాశ ఎదురైంది.
 

Updated Date - 2022-10-04T04:57:13+05:30 IST