పిల్లలు లేరు.. టీచర్లూ లేరు

ABN , First Publish Date - 2022-07-03T08:26:49+05:30 IST

పిల్లలు లేరు.. టీచర్లూ లేరు

పిల్లలు లేరు.. టీచర్లూ లేరు

సెకండరీ స్థాయి దాటని 2 లక్షల మంది

భారీగా తగ్గిన ఎన్‌రోల్‌మెంట్‌ రేటు

కొత్త నమోదులో 2.8 లక్షల తగ్గుదల

50,896 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

సెకండరీ విద్య తీరుపై కేంద్రం సీరియస్‌

డ్రాపవుట్లపై ఏపీలో డేంజర్‌ బెల్‌


న్యూఢిల్లీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీస్థాయి పాఠశాలల పనితీరుపై కేంద్రప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అత్యధికంగా 2.8 లక్షల ఎన్‌రోల్‌మెంట్‌ ఈ పాఠశాలల్లో తగ్గినట్టు గుర్తించింది. అతి భారీగా 50,896 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చింది. సమగ్ర శిక్ష పథకానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖలోని ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ)....2022-23 బడ్జెట్‌ను ఆమోదించే సమయంలో దిగ్ర్భాంతిగొలిపే ఈ వాస్తవాలను బయటపెట్టింది. రాష్ట్రంలో ఎన్‌రోల్‌మెంట్‌ బాగా తగ్గి.. వార్షిక డ్రాపవుట్లు భారీగా పెరిగినట్టు బోర్డు పేర్కొంది. 10వ తరగతి డ్రాపవుట్‌ రేటు 31.3 శాతం, 11వ తరగతి డ్రాపవుట్‌ రేటు 7.9 శాతం ఉండడం ఆందోళనకరమని తెలిపింది. 2021లో మొత్తంగా డ్రాపవుట్‌ రేటు రాష్ట్రంలో 16.7 శాతంగా ఉందని స్పష్టం చేసింది. డ్రాపవుట్లను తగ్గించడానికి ఎన్‌రోల్‌మెంట్‌ను మెరుగుపర్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలో 39,008 పోస్టులు, సెకండరీ స్థాయిలో 11,888 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పోస్టులను ప్రాధాన్యత కింద తీసుకొని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇవి కాకుండా డైట్‌ కాలేజీల్లో, ఎస్‌సీఈఆర్‌టీ సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సూచించింది. 


రూ.1,641.84 కోట్లకు ఆమోదం 

ఆంధ్ర ప్రదేశ్‌లో 2022-23లో సమగ్ర శిక్ష పథకం అమలుకు రూ. 1,641.84 కోట్లను కేంద్రం ఆమోదించింది. ఎలిమెంటరీ స్థాయికి రూ. 1,295.46 కోట్లు, సెకండరీ, సీనియర్‌ సెకండరీ స్థాయికి రూ. 338.22 కోట్లు, ఉపాధ్యాయ శిక్షణకు 8.14 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 1,094 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ అందించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. 


కేంద్రం గుర్తించిన అంశాలివీ..

కొన్ని జిల్లాల్లో సెకండరీ విద్యాస్థాయి దగ్గరే రెండు లక్షల మంది ఆగిపోతున్నారు. వారు పైతరగతులకు వెళ్లడంలేదు. పశ్చిమ గోదావరి, కడప, అనంతపూర్‌, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 

ఎలిమెంటరీ స్థాయిలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. అప్పర్‌ ప్రైమరీ స్థాయిలో వారికి బాగా కొరత ఉంది. 

డ్రాపవుట్‌లను తగ్గించాలి. ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి. 

ప్రాథమిక స్థాయిలో పాఠశాలల హేతుబద్ధీకరణకు నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు రావాలి. 

డైట్‌ కాలేజీల్లో ఖాళీలను ప్రాధాన్యత ఇచ్చి భర్తీచేయాలి.

Updated Date - 2022-07-03T08:26:49+05:30 IST