ప్రభుత్వ అధికారులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు: బాంబే హైకోర్టు

ABN , First Publish Date - 2022-06-03T23:33:52+05:30 IST

మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) అధికారులపై దాడిచేసిన వ్యక్తికి మధ్యంత బెయిలు

ప్రభుత్వ అధికారులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు: బాంబే హైకోర్టు

ముంబై: మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) అధికారులపై దాడిచేసిన వ్యక్తికి మధ్యంతర బెయిలు మంజూరు చేసిన బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారులతో ఎవరూ అనుచితంగా, అమర్యాదకరంగా ప్రవర్తించకూడదని చెబుతూ రూ. 25 వేలు చెల్లించాలని ఆదేశించింది. దానిని గ్రామ పంచాయతీ సంక్షేమానికి ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ ఘటన పూర్వపరాల్లోకి వెళ్తే.. పూణె జిల్లాకు చెందిన ప్రవీణ్ సాహేబ్రావో భోగవాడేపై ఎంఎస్ఈడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. భోగవాడే తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బెదిరించాడంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ భోగవాడే బాంబే హైకోర్టును ఆశ్రయిస్తూ ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన చర్యకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.


పిటిషన్‌ను విచారించిన జస్టిస్ భారతి హెచ్ డంగ్రే బోగవాడేకు మధ్యంతర బెయిలు మంజూరు చేశారు. తన ఫిర్యాదు ఎంత తీవ్రమైనది అయినా అధికారులతో ఎవరూ అనుచితంగా ప్రవర్తించ కూడదని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చి చెప్పారు. అలాగే, సిరూర్ తాలూకాలోని గానేగావ్ ఖల్సా గ్రామ పంచాయతీకి 8 వారాల్లోపు రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించారు. ఆ సొమ్మును గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-06-03T23:33:52+05:30 IST