ముంబైలో Omicron Variant ఎవరికీ సోకలేదు...మేయర్ ప్రకటన

ABN , First Publish Date - 2021-11-30T13:36:43+05:30 IST

ముంబై నగరంలో కొత్త కొవిడ్-19 వేరియంట్ ఓమైక్రాన్ కేసు ముంబైలో నమోదు కాలేదని స్థానిక మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు....

ముంబైలో Omicron Variant ఎవరికీ సోకలేదు...మేయర్ ప్రకటన

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలో కొత్త కొవిడ్-19 వేరియంట్ ఓమైక్రాన్ కేసు ముంబైలో నమోదు కాలేదని స్థానిక మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు. కొత్త వేరియెంట్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశామని పెడ్నేకర్ పేర్కొన్నారు. ‘‘ముంబైలో ఓమైక్రాన్ వైరస్ సోకిన ఒక్క రోగి కూడా లేడు. దక్షిణాఫ్రికా నుంచి 100 మంది వ్యక్తులు ముంబై,  చుట్టుపక్కల నగరాలకు వచ్చారు. వారిలో ఒకరికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అతని మెడికల్ రిపోర్టులను ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచనల మేర ఈ కొత్త వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం’’ అని మేయర్ వివరించారు. 


విదేశాల నుంచి ముంబై వచ్చే పౌరులను ఎయిర్‌పోర్టులో క్వారంటైన్ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మేయర్ తెలిపారు. ముంబైలోని అన్ని ఆసుపత్రుల్లో తగిన ఆక్సిజన్ నిల్వలు, పడకలు, ఐసీయూ పడకలు కూడా పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. నవంబర్ 24 వతేదీన ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి ముంబైలోని డోంబివిలికి   రాగానే పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దక్షిణాఫ్రికా వ్యక్తికి ఓమైక్రాన్ వేరియంట్‌ సంక్రమించిందో లేదో ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా నిర్ధారించలేదు.దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి నమూనాలను జన్యుశ్రేణి కోసం పంపించామని ఆరోగ్య అధికారిణి డాక్టర్ ప్రతిభాపాన్ పాటిల్ చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి ఢిల్లీ మీదుగా ముంబైకు వచ్చిన వ్యక్తిని మున్సిపల్ కార్పొరేషన్ ఐసోలేషన్ గదిలో ఉంచామని డాక్టర్ తెలిపారు.


Updated Date - 2021-11-30T13:36:43+05:30 IST