కరోనా కాటేస్తున్నా కాస్తయినా మార్పు రాదే!

ABN , First Publish Date - 2021-04-23T05:02:53+05:30 IST

కరోనా రెండో దశలో వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల రేటు పెరుగుతోంది. అయినా ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద, బార్లలో కొవిడ్‌ను పట్టించుకునే వారు కనిపించడం లేదు.

కరోనా కాటేస్తున్నా కాస్తయినా మార్పు రాదే!
గుడిపల్లిపాడు సెంటర్‌లో మద్యం దుకాణం వద్ద రద్దీ

మద్యం దుకాణాల వద్ద తోపులాట

భౌతిక దూరం, మాస్కుల మాటే మరిచారు

బార్లలో అమలుకాని నిబంధనలు 

పాజిటివిటీ పెరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగం



నెల్లూరు(క్రైం), ఏప్రిల్‌ 22:

కరోనా రెండో దశలో వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల రేటు పెరుగుతోంది. అయినా ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద, బార్లలో కొవిడ్‌ను పట్టించుకునే వారు కనిపించడం లేదు. కరోనా కాటేస్తోందని తెలిసినా కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ఫలితంగా ప్రమాదాన్ని మరింత పెంచుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి రకరకాల ఆంక్షలు విధిస్తున్న అధికారులు మద్యం వ్యాపారానికి మాత్రం ఆ ఆంక్షలను వర్తింపజేయడం లేదు. ఎక్సైజ్‌ అధికారులేమో మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో మందుబాబు లు రోజురోజుకు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంటున్నారు. 


జాగ్రత్తలేవి?

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు, జాగ్రత్తలు ఏ మాత్రం కనిపించడం లేదు. మందుబాబులు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయడం, మాస్క్‌లు ధరిస్తేనే మద్యం విక్రయాలు చేస్తామని చెప్పడం... ఇలా ఏ ఒక్కటీ అనుసరించకపోవడంతో మందుబాబులు తోసుకుంటూ, ఒకరిపై ఒకరు పడుతూ మద్యం కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా లేని సమయంలో మద్యం అమ్మకాలు జరగడం లేదు. అలాంటప్పుడు కరెంటు వచ్చిన వెంటనే వందల మంది మద్యం కోసం పోటీపడుతున్నారు. ఇక చీప్‌ లిక్కర్‌ అమ్మేందుకు ప్రత్యేకంగా వేళలు నిర్ణయించడంతో ఆ సమయంలో అధిక సంఖ్యలో మందుబాబులు దుకాణాల వద్దకు వస్తున్నారు. వైన్‌ షాపుల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వడం లేదు. సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు దుకాణాల్లోని సిబ్బంది కొవిడ్‌ బారిన పడిఉన్నారు. ఇప్పటికైనా మిగిలిన వారిలో మార్పు రాకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.


బార్లలో గుంపులు గుంపులుగా...

మనకు కరోకా ఎందుకు వస్తుంది? అన్నట్లుగా బార్లలో మందుబాబులు గుంపులు గుంపులుగా కూర్చొని మద్యం సేవిస్తున్నారు. కూర్చున్నచోటే తింటూ, అక్కడే ఉమ్మేస్తూ ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. బార్ల యజమానులు కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదు. రోజూ శానిటైజ్‌ చేయడం, సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించడం వంటివి కనిపించడం లేదు. మొత్తంగా అటు ప్రభుత్వం లిక్కర్‌ షాపుల్లో, ఇటు ప్రైవేటు బార్లలో ఎవరికివారు అజాగ్రత్తతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.

Updated Date - 2021-04-23T05:02:53+05:30 IST