జమ్మూ కశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు లేవు: కేంద్రం

ABN , First Publish Date - 2022-04-08T19:04:27+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో మీడియా పరిస్థితిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎఫ్ఎఫ్‌సీ ఒక నివేదికను విడుదల చేసిందని, దాని గురించి ప్రభుత్వానికి తెలుసా అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అబిర్ రంజన్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు..

జమ్మూ కశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు లేవు: కేంద్రం

న్యూఢిల్లీ: పరిపాలనా విభాగం విధించిన విస్తృతమైన ఆంక్షల కారణంగా జమ్మూ కశ్మీర్‌లోని మీడియా సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ) పేర్కొంది. అయితే జమ్మూ కశ్మీర్‌లో మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని అనేక మంది జర్నలిస్టులపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయన్న అంశాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు. జర్నలిస్టులపై పాలనా విభాగం నుంచి ఎలాంటి ఒత్తిడులు లేవని, వారిపై ఎలాంటి దాడులు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు.


జమ్మూ కశ్మీర్‌లో మీడియా పరిస్థితిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎఫ్ఎఫ్‌సీ ఒక నివేదికను విడుదల చేసిందని, దాని గురించి ప్రభుత్వానికి తెలుసా అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అబిర్ రంజన్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు. మార్చి 8న విడుదల చేసిన ఎఫ్ఎఫ్‌సీ నివేదిక ప్రకారం.. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని ముఖ్యంగా కశ్మీర్ లోయలోని ప్రాంతంలో ఉన్న మీడియాపై అనేక ఆంక్షలు అమలులో ఉన్నాయట. 2017 నుంచి మీడియాపై ఆంక్షలు, జర్నలిస్టులపై దాడులు పెరిగాయట. వ్యక్తిగతంగా కూడా జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.


అయితే రాజ్యసభలో ఈ విషయమై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘‘2017 నుంచి జమ్మూ కశ్మీర్‌లో మీడియాను జర్నలిస్టులను అధికారులు వేధించిన సందర్భాలు లేవని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే, దేశం భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఏ కార్యకలాపంలో పాల్గొన్నట్లు గుర్తిస్తే ఎవరిపై అయినా వారి వృత్తితో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటారు’’ అని అన్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లోని అనేక పనుల్లో పోలీసుల జోక్యం ఉందని వస్తున్న ఆరోపణలు అనురాగ్ ఠాకూర్ ఖండించారు.

Updated Date - 2022-04-08T19:04:27+05:30 IST