నితీష్‌ను కలిసిన మాజీ డీజీపీ... రాజకీయ ఎంట్రీపై ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2020-09-26T20:44:17+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసులో బీహార్ పోలీసులపై ముంబై పోలీసుల..

నితీష్‌ను కలిసిన మాజీ డీజీపీ... రాజకీయ ఎంట్రీపై ఏమన్నారంటే..!

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసులో బీహార్ పోలీసులపై ముంబై పోలీసుల చర్యను నిరసిస్తూ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలచిన బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను శనివారంనాడు కలుసుకున్నారు. ఇటీవలే తన ఉద్యోగానికి పాండే రాజీనామా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన రాజీనామా చేయడంతో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్‌ను ఆయన కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మీడియాతో పాండే మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.




'డీజీపీగా విధుల నిర్వహణలో పూర్తి స్వేచ్ఛనిచ్చిన ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు ఇక్కడకు వచ్చాను. రాజకీయాల్లో చేరే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని పాండే చెప్పారు. తన సొంత జిల్లా బక్సర్‌ ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి రావచ్చంటూ గత బుధవారంనాడు ఆయన సంకేతాలిచ్చారు. బెగుసరాయ్, సీతామర్హి, షాపూర్, ఇతర జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తనకు కలుసుకున్నారని, రాజకీయాల్లోకి రావాలనుకుంటే తమ జిల్లా నుంచి పోటీ చేయాలని కోరారని ఆయన తెలిపారు. బక్సర్‌లో తాను పుట్టి పెరిగినందున నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని చెప్పారు. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి రావచ్చని సూచనప్రాయంగా తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణకు పాండే చేసుకున్న అభ్యర్థనను బీహార్  ప్రభుత్వం గత మంగళవారంనాడు ఆమోదించింది.


కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2020-09-26T20:44:17+05:30 IST