పనుల్లో జాప్యం, నాణ్యతలో రాజీ వద్దు

ABN , First Publish Date - 2022-08-18T09:34:42+05:30 IST

నిర్మాణ పనుల్లో జాప్యం, నాణ్యతలో రాజీ లేకుండా నూతన సచివాలయం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్తగా నిర్మితమవుతున్న సచివాలయంలోని అన్ని విభాగాలను అద్భుతంగా, సుందరం

పనుల్లో జాప్యం, నాణ్యతలో రాజీ వద్దు

అనుకున్న టైమ్‌కే సచివాలయం సిద్ధం కావాలి

మంత్రి వేముల, అధికారులకు సీఎం ఆదేశం

నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ పనుల్లో జాప్యం, నాణ్యతలో రాజీ లేకుండా నూతన సచివాలయం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. కొత్తగా నిర్మితమవుతున్న సచివాలయంలోని అన్ని విభాగాలను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మేరకు నూతన సచివాలయం నిర్మాణ పనులను బుధవారం స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ సెక్రటేరియట్‌ నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేదా అని మంత్రి వేములతోపాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు ఏకకాలంలో పూర్తి అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణ పనుల్లో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. స్లాబుల నిర్మాణం, భవనంపై భాగంలో పెట్టే డోమ్స్‌, ఇంటీరియర్‌, ఫర్నిచర్‌ అంశాల్లో ఆధునిక మోడల్స్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, యాంటీ రూమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలోని సుమారు రెండు ఎకరాల ఖాళీ స్థలం, సెక్రటేరియట్‌ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. గ్రిల్స్‌, రెడ్‌ స్టోన్‌, డ్రైనేజీ నిర్మాణం తదితర పనుల గురించి ఆరా తీశారు. విజిటర్స్‌ లాంజ్‌ నిర్మాణంతోపాటు, సెక్రటేరియట్‌ ప్రహరీ వెంబడి మట్టి ఫిల్లింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెక్రటేరియట్‌కు వచ్చే అన్ని వర్గాల వారికి సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్‌  ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేకాక జిల్లాల నుంచి సెక్రటేరియట్‌కు వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది తమ విధులను సజావుగా నిర్వహించుకునేందుకు వీలుగా చాంబర్ల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. వీటితోపాటు నిర్మాణ పనులకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. పనులకు సంబంధించిన ఆల్బమ్‌ను పరిశీలిస్తూ, ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-08-18T09:34:42+05:30 IST