పురో‘గతి’లేని పునరావాసం

ABN , First Publish Date - 2021-01-17T05:23:20+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు పనులు 2005 అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతోపాటు నెల్లూరు, కడప జిల్లాలోని కొద్దిప్రాంతాలు కలిపి మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే దశాబ్దం పాటు అనేక అవాంతరాల మధ్య పనులు ఆగుతూ సాగుతూ జరిగాయి. గత టీడీపీ హయాంలో వేగం పుంజుకున్నాయి.

పురో‘గతి’లేని పునరావాసం
పెద్దారవీడు మండలం కలనూతల నిర్వాసితులకు ఎంపిక చేసిన స్థలం

వెలిగొండ నిర్వాసితుల సమస్యలు ఎక్కడివక్కడే

పునరావాస కాలనీల్లో ఇంకా

ప్రారంభంకాని ఇళ్ల నిర్మాణం

తరలింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం

గుండంచర్ల వాసులకు ఇంకా

కొలిక్కిరాని స్థల సేకరణ

వెలిగొండ తొలి టన్నెల్‌ తవ్వకం

పూర్తయినా నీరు తీసుకోలేని పరిస్థితి

మార్కాపురం, జనవరి 16 : వెలిగొండ ప్రాజెక్టు తొలి దశలో కీలకమైన మొదటి టన్నెల్‌ తవ్వకం పూర్తయింది. హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణం కూడా జరిగింది. అక్కడ గేట్లు ఎత్తితే సొరంగం ద్వారా రోజుకు 3వేల క్యూసెక్కులు నీటిని తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అందుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పునరావాస ప్రక్రియలో పురోగతి లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే గ్రామాల వారికి ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం సమస్యగా మారింది. దీంతో అధికారులు మూడు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు.  అందులో ఒన్‌టైం సెటిల్మెంట్‌కు నిర్వాసితులను ఒప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. కొందరిచేత బలవంతంగా సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే నిర్వాసితుల్లో అధిక శాతం మంది దాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కొన్ని గ్రామాలకు సంబంధించి పునరావాస చర్యలు నేటికీ ప్రారంభం కాలేదు.  దీంతో ప్రభుత్వం చెప్తున్నట్లు ఆగస్టు ఆఖరులోపు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఎంత వరకు సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


   వెలిగొండ ప్రాజెక్టు పనులు 2005 అక్టోబర్‌లో   ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతోపాటు నెల్లూరు, కడప జిల్లాలోని కొద్దిప్రాంతాలు కలిపి మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే దశాబ్దం పాటు అనేక అవాంతరాల మధ్య పనులు ఆగుతూ సాగుతూ జరిగాయి. గత టీడీపీ హయాంలో వేగం పుంజుకున్నాయి. ఎట్టకేలకు  ప్రాజెక్టులో కీలకమైన తొలి సొరంగం తవ్వకం గురువారంతో పూర్తయింది. అయితే వివిధ ఆటంకాలు ఉండటంతో ఇప్పట్లో ప్రాజెక్టుకు నీరు తీసుకునే అవకాశం కన్పించడం లేదు. అందులో ప్రధానంగా ముంపు గ్రామాల సమస్య కన్పిస్తోంది. 


ముంపు గ్రామాలివే..

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం సుంకేసుల, అర్ధవీడు మండలం కాకర్ల వద్ద ఆనకట్టలు నిర్మించారు. గొట్టిపడియ ఆనకట్ట కింద మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తండా, సుంకేసుల కింద పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల, చింతలముడిపి, కాటంరాజుతండా ముంపు గ్రామాలుగా గుర్తించారు. కాకర్ల ఆనకట్ట కింద అర్ధవీడు మండలంలోని సాయిరామ్‌నగర్‌, రామలింగేశ్వరపురం, లక్ష్మీపురం, కృష్ణానగర్‌ ముంపు గ్రామాలుగా ఉన్నాయి. 


ప్రస్తుత పరిస్థితి ఇదీ..

గొట్టిపడియ డ్యాం ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం వేములకోట సమీపంలో 83 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు గ్రామాలకు చెందిన 1408 కుటుంబాలకు అక్కడ ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అందుకోసం అధికారులు సిద్ధం చేసిన ప్లాన్‌ను గ్రామస్థులు నిరాకరించారు. దీంతో ఇటీవల నూతన ప్రణాళికను తయారు చేసి గ్రామస్థుల అంగీకారంతో ప్లాట్ల బౌండరీలు ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

సుంకేసుల డ్యాం ముంపు గ్రామమైన కలనూతలకు మార్కాపురం మండలం ఇడుపూరు పరిధిలో రెండు కాలనీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కాలనీలో 80 కుటుంబాల చొప్పున రెండు కాలనీలలో 160 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండు కాలనీలలో రోడ్లు, గుడి, పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, వైద్యశాల వంటి మౌలిక వసతులు కల్పించారు. కానీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. కలనూతల-2 కాలనీలో చేపట్టిన హైస్కూల్‌ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. 


ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

సుంకేసుల డ్యాం ముంపు గ్రామాలైన సుంకేసుల, చింతలముడిపి నిర్వాసితులకు పెద్దారవీడు మండలం తోకపల్లి, మార్కాపురం మండలం గోగులదిన్నె సమీపంలో నిర్వాసిత కాలనీలను కేటాయించారు. రెండు కాలనీలలో మౌలిక వసతుల అభివృద్ధి జరిగింది. ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. 


గుండంచర్ల నిర్వాసితులకు స్థల సేకరణ సమస్య

గుండంచర్ల నిర్వాసితులకు స్థల సేకరణ సమస్య వెంటాడుతోంది. మార్కాపురం మండలం ఇడుపూరు ఇలాకాలో ప్రభుత్వం స్థలం సేకరించేందుకు నిర్ణయించింది. అయితే నిర్వాసితులలో ఒక వర్గం పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద స్థలాలు ఇవ్వాలని కోరుతుండగా, మరో వర్గం ఇడుపూరు వద్ద కావాలని కోరుతోంది. దీంతో గుండంచర్ల నిర్వాసితులకు నేటికీ స్థల సేకరణ జరగలేదు. 


కాకర్ల గ్యాప్‌ నిర్వాసితులకు ప్రారంభంకాని పునరావాస చర్యలు

కాకర్ల గ్యాప్‌ నిర్వాసిత గ్రామాలైన సాయిరాంనగర్‌, రామలింగేశ్వరపురం, కృష్ణానగర్‌, లక్ష్మీపురం గ్రామాలలో 279 మంది నిర్వాసితులకు ఎటువంటి పునరావాస చర్యలు ప్రారంభం కాలేదు. 


ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని కాంట్రాక్టర్లు

వెలిగొండ జలాశయానికి నీరివ్వాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. అందుకోసం ఆర్‌అండ్‌ఆర్‌, ఒన్‌టైం సెటిల్‌మెంట్‌లను అమలు చేస్తోంది. ప్రాజెక్ట్‌ పరిధిలోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా చేపట్టనున్న పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను ఏడు ప్యాకేజీలుగా విభజించింది. అందులో భాగంగా వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసిత  11 గ్రామాలలో 3153 ఇళ్లు నిర్మించాలని ప్రాఽథమికంగా నిర్ణయించింది. అందుకోసం మూడు సార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాకర్ల గ్యాప్‌ కింద ఉన్న ముంపు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. మిగిలిన వాటికి రాలేదు. 


  వన్‌టైం సెటిల్‌మెంట్‌ కోసం ఒత్తిళ్లు

వెలిగొండ నిర్వాసితులకు నష్టపరిహారంగా ప్రభుత్వం మూడు విధానాలను ప్రకటించింది. అందులో మొదటిది వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఫారం-1). మేము ఇల్లు కట్టిస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం.. అవి మేము పూర్తి చేసినప్పుడే తీసుకోండి (ఫారం)-2 ఇది రెండోది. మీకు డబ్బులు ఇస్తాం తీసుకెళ్లండి మేము ఇళ్లు కట్టించినప్పుడు రండి (ఫారం-3) ఇది మూడో ప్యాకేజీ. వీటిలో ఎక్కువ మందిని వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరింపజేసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలు గ్రామాల ప్రజల చేత బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నారు. అయితే నిర్వాసితుల్లో అధిక శాతం మంది దాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆగస్టు నెలాఖరుకు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని రెండు నెలల క్రితం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రకటించారు. ప్రస్తుతం మొదటి టన్నెల్‌, హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణం పూర్తయ్యాయి. కానీ పునరావాస ప్రక్రియలో పురోగతి లేకపోవడంతో రిజర్వాయర్‌లోకి ఇప్పట్లో నీరు తీసుకునే పరిస్థితి కన్పించడం లేదు. దీనికితోడు టన్నెల్‌ వెలుపల నుంచి ఫీడర్‌ కాలువను ఆనుసంధానం చేయడం, పలుచోట్ల కాలువల మరమ్మతులకు గురికావడం కూడా ఆటంకంగా మారింది. దీంతో కలెక్టర్‌ ప్రకటించిన నాటికి నీటి విడుదల జరగడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.  

Updated Date - 2021-01-17T05:23:20+05:30 IST