అభివృద్ధిలో తడబాటు

Published: Thu, 23 Jun 2022 00:09:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అభివృద్ధిలో తడబాటు

ముఖ్యరంగాల్లో వెనుకబడిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా
తలసరి, స్థూల ఉత్పత్తిలో నిరాశజనకం
పరిశ్రమల ఏర్పాటులో కాస్త హనుమకొండ మెరుగు
ఉపాధి అవకాశాల కల్పనలో వరంగల్‌ జిల్లా ఫస్ట్‌
మహబూబాబాద్‌ జిల్లాలో విరివిగా    పెరిగిన ఎరువుల వాడకం
సాగు విస్తీర్ణంలో జనగామ జిల్లా ముందడుగు
అన్నింట్లో అట్టడుగున ములుగు జిల్లా
రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రంలో వెల్లడి


వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్‌, విద్య, తదితర రంగాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇప్పటికీ వెనుకబడే ఉంది. స్థల ఉత్పత్తి, తలసరి ఆదాయంలోనూ ఉమ్మడి జిల్లా వెనుకబడే ఉంది.  ప్రభుత్వం యేటా జిల్లాలవారీగా విడుదల చేసే రాష్ట్ర సామాజిక, ఆర్ధిక ముఖచిత్రాన్ని విడుదల చేస్తుంది. 2022 సంవత్సరానికిగాను ఇటీవల విడుల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అభివృద్ధిలో అంతరాలను నివేదిక స్పష్టంగా పేర్కొన్నది. జిల్లాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై సూచలను, సలహాలను ఈ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖ సమాచారం ఆధారంగా రూపొందించిన తెలంగాణ సామాజిక, ఆర్ధిక ముఖచిత్రం - 2022లో పలు రంగాల్లో ఉమ్మడి జిల్లా ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియచెప్పింది.


హనుమకొండ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) :
స్థూల ఉత్పత్తి (జీడీపీ), తలసరి ఆదాయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో హనుమకొండ జిల్లా 16, వరంగల్‌ జిల్లా 22, మహబూబాబాద్‌ జిల్లా 25, జనగామ జిల్లా 26, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 27 స్థానంలో ఉండగా, ములుగు జిల్లా అట్టడుగున 33వ స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం (పీసీఐ)లో రాష్ట్రంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 8వ, వరంగల్‌ జిల్లా  16, జనగామ 18, ములుగు 20, మహబూబాబాద్‌ 26, హనుమకొండ 31వ స్థానంలో ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఎరువులు వినియోగం మరీ దారుణంగా పెరిగింది. ఈ జిల్లాలో ఆందోళనకర స్థాయిలో 143.6 శాతం మేరకు పెరిగి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

పరిశ్రమలు
పరిశ్రమల స్థాపనకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అన్ని వనరులు, అవసరమైన ముడిసరుకు అందుబాటులో ఉన్నప్పటికీ పారిశ్రామికంగా ఆశించిన ప్రగతి సాధించలేదు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలోని జిల్లాల వారిగా చూస్తే హనుమకొండ జిల్లా 650 పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేవలం 123 పరిశ్రమల స్థాపనతో 28వ స్థానంలో ఉంది. మహబూబాబాద్‌ జిల్లా 361 పరిశ్రమల ఏర్పాటుతో 14వ స్థానంలో వరంగల్‌ జిల్లా 360 పరిశ్రమల స్థాపనతో 15వ స్థానంలో జనగామ జిల్లా 274 పరిశ్రమలతో 22వ స్థానంలో ములుగు జిల్లా 57 సరిశ్రమలతో అట్టడుగున 31వ స్థానంలో నిలిచింది. పెట్టుబడుల్లో జనగామ జిల్లా ముందున్నది. ఈ జిల్లాలో రూ.3,562కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలవగా, హనుమకొండ జిల్లా రూ.670కోట్లతో 22వ స్థానంలో వరంగల్‌ జిల్లా రూ.586కోట్లతో 26, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రూ. 90 కోట్లతో 31 స్థానంలో మహబూబాబాద్‌ జిల్లా రూ.551 కోట్లతో 27వ స్థానంలో నిలవగా ములుగు జిల్లా  కేవలం రూ.11కోట్ల పెట్టుబడులతో అట్టడుగున నిలిచింది.

ఉపాధి అవకాశాల కల్పనలో వరంగల్‌ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మెగాటెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతో ఈ జిల్లాలో ఉపాధి కల్పనకు మెండుగా అవకాశాలు ఏర్పడ్డాయి. 1,90,884 మందికి ఉపాధికి అవకాశాలున్నాయి. హనుమకొండ జిల్లాలో 7615 మందికి ఉపాధి కల్పనతో 14వ, జనగామ జిల్లా 4033 మందికి ఉపాధి కల్పనతో 22వ, మహబూబాబాద్‌ జిల్లా 3496 మందికి ఉపాధితో 23వ, జయశంకర్‌  భూపాలపల్లి జిల్లా 1834 మందికి ఉపాధితో 25వ స్థానంలో ఉండగా ములుగు జిల్లా కేవలం 466 మందికి ఉపాధితో రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) స్థాపనలో హనుమకొండ జిల్లా అగ్ర స్థానం లో ఉంది. 2022 జనవరి నెలాఖరు నాటికి యూడీవైఏంలో నమోదైన సమాచారం ప్రకారం ఈ జిల్లాలో అత్యధికంగా 7972 ఎంఎ్‌సఎంఈలు ఏర్పాటయి రాష్ట్రలో 7వ స్థానం దక్కించుకున్నది. ములుగు జిల్లా పూర్తిగా వెనుకబడింది. ఈ జిల్లా లో కేవలం 497 పరిశ్రమలే ఏర్పాటై అన్ని జిల్లాల కన్నా అడుగున నిలిచింది. వరంగల్‌ జిల్లాలో 3099 యూనిట్ల ఏర్పాటుతో 16వ, మహబూబాబాద్‌ జిల్లా 2463 యూనిట్ల స్థాపనతో 22 వ,  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 1352 పరిశ్రమలతో 30వ, జనగామ జిల్లా 1730 యూనిట్లతో 26 వ స్థానంలో నిలిచాయి.

రహదారులు
ఉమ్మడి జిల్లాలో రవాణా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరీ వెనుకబడి ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర రోడ్ల సాఽంద్రత 95.42 శాతం కన్నా తక్కువగా ఉంది. ప్రతీ వంద చదరపు కిలోమీటర్లకు కిలోమీటరు చొప్పున రోడ్డు సౌకర్యం ప్రకారం వరంగల్‌ జిల్లా 130 శాతంతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉండగా జనగామ జిల్లా 112 శాతంతో 5వ, హనుమకొండ జిల్లా 104 శాతంతో 10వ, మహబూబాబాద్‌ జిల్లా 95 శాతంతో 17వ స్థానంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 70 శాతంతో 27వ స్థానంలో ములుగు జిల్లా కేవలం 38 శాతంతో చివరగా 33వ స్థానంలో ఉంది.

ఎరువుల వాడకం

ఎరువుల వినియోగంలో రాష్ట్రంలోనే మహబూబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2019-20, 2021-22 మధ్య కాలంలో ఎరువుల వాడకంపై సేకరించిన గణాంకాల ప్రకారం మహబూబాబాద్‌ జిల్లాలోఎరువుల వినియోగం 143.6 శాతం పెరిగింది. హనుమకొండ జిల్లా 51.7 శాతం మాత్రమే ఎరువుల వినియోగం పెరిగి రాష్ట్రంలో చివరన 32వ స్థానంలో నిలిచింది. అత్యధిక ఎరువుల వినియోగంలో తర్వాత స్థానం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు దక్కుతుంది. ఈ జిల్లాలో 89 శాతం పెరిగి రాష్ట్రంలో 5వ, వరంగల్‌ జిల్లా 75.8 శాతం వినియోగంతో 6వ, జనగామ జిల్లా 60.5 శాతం వాడకంతో8వ స్థానంలో నిలవగా ములుగు కేవలం 22.5 శాతం వినియోగంతో 29వ స్థానంలో నిలిచింది.

సాగు విస్తీర్ణం
2019-20 నుంచి 2020-21 మధ్య స్థూల సాగు విస్తీర్ణంలో ములుగు జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. యేడా దిలో ఒకే వ్యవసాయ క్షేత్రం నుంచి పలు రకాల పంట లు పండించడాన్ని సాగు సాంద్రతను తెలుపుతుంది. అధిక పంటల సాంద్రత అంటే నికర సాగు విస్తీర్ణంలో ఒకే సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు పంట పండించటం. అలా రాష్ట్ర స్థూల సాగు  విస్తీర్ణంలో పెరుగుదల శాతం పరిశీలిస్తే హైదరాబాద్‌ మినహాయించి మిగతా 32 జిల్లాల్లో వరంగల్‌ జిల్లా  కేవలం 5.1 శాతం తో చివరన 29వ స్థానంలో ఉందిరి స్థానంలో ఉంది. జనగామ 30.4 శాతం విస్తీర్ణం పెరుగుదలతో 4వస్థానంలో నిలిచింది. మహబూబాబాద్‌ జిల్లా 15 శాతంతో 13వ స్థానంలో, హనుమకొండ జిల్లా 12.8 శాతంతో 17వ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 8.4 శాతంతో 24వ, ములుగు 6 శాతంతో 27వ స్థానంలో నిలిచింది.

విద్య
2020-21 సంవత్సంలో సేకరించిన గణాంకాలను బట్టి చేస్తే ప్రతీ లక్ష మంది జనాభకు స్కూళ్ల అందుబాటు విషయంలో ములుగు జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. ఈ జిల్లాలో లక్ష జనాభాకు 133 ప్రభుత్వ, పంచాయతీ పాఠశాలలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 720 స్కూళ్లు ఉన్నాయి మహబూబాబాద్‌ జిల్లాలో ప్రతీ లక్ష జనాభకు 129 (898 పాఠశాలలు), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రతీ లక్ష జనాభకు 114 (430 పాఠశాలలు), వరంగల్‌ జిల్లాలో పత్రీ లక్ష జనాభాకు 99 (645 పాఠశాలలు), హనుమకొండ జిల్లాలో ప్రతీ లక్ష జనాభకు 50 ( 492 పాఠశాలలు), జనగామ జిల్లాలో ప్రతీ లక్ష జనాభాకు 105 ( 508 పాఠశాలలు) ఉన్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.