ltrScrptTheme3

కలగా కోస్టల్‌ కారిడార్‌

Oct 24 2021 @ 23:41PM
తీర ప్రాంతం

నేతల హామీలు.. నీటి మూటలు

తూర్పు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతానికి నరసాపురం నడిబొడ్డున ఉంది. జిల్లాలో 19 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. సరిహద్దునున్న రెండు జిల్లాలు కలుపుకుంటే 90 కిలోమీటర్లు. వసతులు, వనరులు ఉన్నప్పటికీ కోస్టల్‌ కారిడార్‌గా అభివృద్ధికి నోచుకోలేదు. గడిచిన 30 ఏళ్లగా నేతలు పలు పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. తీర ప్రాంత అభివృద్ధికి ఏడేళ్ళ క్రితం చేపట్టిన 216 జాతీయ రహదారి కూడా ముందుకు సాగడం లేదు.


నరసాపురం, అక్టోబరు 24: కారిడార్‌ ఏర్పాటుకు నరసాపురం ప్రాంతంలో అన్ని వనరులు, వసతులు పుష్కలంగా ఉన్నాయి. పరిశ్రమలు ఉత్పత్తిల్ని తరలించేందుకు రైల్వే, 216 జాతీయ రహదారి అనుసంధానమై ఉంది. 1977లోనే ఈప్రాంతంలో ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ఇతర ప్రాంతాలకు తరలించారే తప్ప ఇక్కడ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయలేదు. అలాగే ఆయిల్‌ శుద్ధికర్మగారం తూర్పు గోదావరిలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. నిడదవోలు పంట కాల్వ ఈ ప్రాంతంలోనే సముద్రంలో కలుస్తుంది. ఈకారణంగా తాగునీటి కొరత కూడా ఉండదు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కాకినాడ పోర్టు దూరం కేవలం 60 కిలోమీటర్లు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా.... ఇక్కడ మాత్రం ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు.

 కారిడార్‌ అయితే..

ఒక ప్రాంతం కారిడార్‌గా అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య ఉండదు. క్లస్టర్‌గా విభజించి అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే కారిడార్‌గా గుర్తింపు పొందుతుంది. రహదార్లు విస్తరిస్తాయి. భూమి విలువలు పెరుగుతాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండటం వల్ల ఇక్కడ యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ర్టాలకు, ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి  ఏర్పడింది. ఇదే సమయంలో నష్టాలు లేకపోలేదు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల నది జలాలు, వాతావరణం కలుషితంగా మారే ప్రమాదం ఉంది. 

 నెరవేరని నేతల హామీలు

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సముద్ర తీర ప్రాంతాన్ని కారిడార్‌ అంటారు. జిల్లాలోని నరసాపురం ప్రాంతాన్ని కారిడార్‌గా మార్చేందుకు గడిచిన 40ఏళ్ళ నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. 20ఏళ్ళ క్రితం అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న యూవీ కృష్ణంరాజు పేరుపాలెం ప్రాంతంలో ఆయిల్‌ శుద్ధికార్మగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పట్లో దీనిపై సర్వే కూడా సాగింది. అయితే ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ తరువాత కేంద్ర మంత్రిగా వచ్చిన దాసరి నారాయణరావు జిందాల్‌ సహకారంతో పేరుపాలెం ప్రాంతంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇండోనేషియ నుంచి సముద్రమార్గం గుండా బొగ్గును తీసుకొచ్చి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. 2006లో కొవ్వూరు ప్రాంతానికి గ్రీన్‌ఫీల్డ్‌ యాజమాన్యం థర్మల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సర్వే కూడా చేపట్టారు. అయితే ఇది కూడా ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నరసాపురం తీరంలో పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు. సర్వే, భూసేకరణ కూడా జరిగింది. అయితే 40కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం ప్రతిపాదన ఉండటంతో ఇది పెండింగ్‌ పడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ఉలుకుపలుకు లేదు.

ముందుకు సాగని జాతీయ రహదారి

తీర ప్రాంత అభివృద్ధికి ఏడేళ్ళ క్రితం నిర్మాణం ప్రారంభించిన 216 జాతీయ రహదారి కూడా ముందుకు సాగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వద్ద 7నెంబర్‌ జాతీయ రహదారిని కలుపుతూ ప్రతిపాదించిన ఈ రహదారి నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. పనులు పూర్తయితే తీర ప్రాంతాల వెంబడి రాకపోకలు పెరుగుతాయి. 


జగన్నాథపురంలో నిలిచిన వంతెన పనులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.