మందులివ్వరు.. మానవత్వం చూపరు!

ABN , First Publish Date - 2021-05-07T05:00:54+05:30 IST

కనీసం మంచి నీరు ఇవ్వరు.. అడిగేదాకా భోజనం పెట్టరు.. ఇచ్చిన ఆహారం కూడా పాచిపోయి కంపుకొడుతుంది.. మందుల ఊసేలేదు.. డ్యూటీ డాక్టర్లు అసలు కనిపించరు.. ఇదీ సూక్ష్మంగా జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు అనుభవిస్తున్న వేదన. లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరిన కరోనా బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ అందుతున్న చికిత్స నుంచి సౌకర్యాల వరకూ అంతా బూటకమే. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో బాధితులు సెల్ఫీ వీడియోల్లో తమ వేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల బండారం బయటపడుతోంది.

మందులివ్వరు.. మానవత్వం చూపరు!
సూర్యముఖి ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ బృందం

 కరోనా బాధితులను పట్టించుకోని ప్రైవేట్‌ ఆస్పత్రులు

 లక్షలు చెల్లిస్తున్నా, కానరాని చికిత్స

 చేసేదే వైద్యం.. పెట్టేదే భోజనమన్నట్లు వైఖరి

 సెల్ఫీ వీడియోల్లో బాధితులు కన్నీరుమున్నీరు

 కొరవడిన అధికారుల పర్యవేక్షణ  

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కనీసం మంచి నీరు ఇవ్వరు.. అడిగేదాకా భోజనం పెట్టరు.. ఇచ్చిన ఆహారం కూడా పాచిపోయి కంపుకొడుతుంది.. మందుల ఊసేలేదు.. డ్యూటీ డాక్టర్లు అసలు కనిపించరు.. ఇదీ సూక్ష్మంగా జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు అనుభవిస్తున్న వేదన. లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరిన కరోనా బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ అందుతున్న చికిత్స నుంచి సౌకర్యాల వరకూ అంతా బూటకమే. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో బాధితులు సెల్ఫీ వీడియోల్లో తమ వేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రైవేట్‌ ఆస్పత్రుల బండారం బయటపడుతోంది. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ కూడా.. శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో తనకు ఎదురైన ఇబ్బందులను వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇటువంటి దారుణాలు అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. వైద్యులు చెప్పిందే తప్ప రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ఇలాంటివి కొన్ని మాత్రమే విద్యావంతులు, ఉద్యోగుల సెల్ఫీ వీడియోలు, పోస్టుల ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తమకు అందిస్తున్న వైద్యంపై ప్రతిరోజూ అధికారులు ఆరా తీయాలని కరోనా బాధితులు కోరుతున్నారు. 


 రెమ్‌డెసివర్‌ కోసం బేరసారాలు 

- నరస్నపేటకు చెందిన ఓ వ్యక్తి కొన్నిరోజుల కిందట కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. అతని వైద్యం కోసం రూ.7లక్షలకుపైగా ఖర్చయింది. ఒక్కో రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్‌ కోసం రూ.65వేలు వరకు చెల్లించామని వారి బంధువు ఒకరు వెల్లడించారు. 

- శ్రీకాకుళం డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో అనుమతి లేకుండా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరఘట్టం మండలానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రూ.40వేలు చొప్పున నాలుగు రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్‌లు రోగికి అందించారు. ఇంకా  తక్కువ ధరకు ఎవరి ద్వారానైనా ఈ ఇంజెక్షన్లు లభ్యమవుతాయా అని రోగి బంధువులు పలువురిని సంప్రదించగా.. ఈ విషయం బయటకు పొక్కింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చివరి వైద్యంగా రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల కోసం వైద్యులు సిఫారసు చేస్తున్నారు. దీంతో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల ద్వారా వేలాది రూపాయలు చెల్లించి బ్లాక్‌లో ఆ ఇంజక్షన్లను బాధితులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా  రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్ల కోసం బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. 


సూర్యముఖి ఆసుపత్రిపై కేసు నమోదు

 వైద్యఆరోగ్యశాఖకు సమాచారం లేకుండా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు వినియోగిస్తున్న శ్రీకాకుళంలోని సూర్యముఖి ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి వరదరాజు ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై విజిలెన్స్‌ అధికారులు గురువారం దాడులు చేశారు. సూర్యముఖి ఆసుపత్రిలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐ అశోక్‌ చక్రవర్తి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లావణ్య, వైద్యాధికారి ప్రకాష్‌రావులు కలసి సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు  వినియోగిస్తున్నట్లుగుర్తించారు. దీనిపై రెండోపట్టణ పోలీసు స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు.  దీంతో సూర్యముఖి ఆసుపత్రిపై క్రిమినల్‌ కేసు నమోదైంది.  



పర్యవేక్షిస్తున్నాం

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న వైద్యంపై పర్యవేక్షణ ఉంటుంది. రెమిడెసివర్‌ ఇంజక్షన్ల అవసరం, ఏ రోగికి ఎన్ని ఇచ్చారన్నది ఆరా తీస్తున్నాం. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే రోగి బంధువులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

 - డా. చంద్రనాయక్‌, డీఎంహెచ్‌వో

Updated Date - 2021-05-07T05:00:54+05:30 IST