‘ప్రైవేటు’లో నో ఈహెచ్‌ఎస్‌!

ABN , First Publish Date - 2021-04-23T09:51:47+05:30 IST

కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు లభించడం దుర్భరంగా మారుతోంది.

‘ప్రైవేటు’లో నో ఈహెచ్‌ఎస్‌!

కరోనా సోకిన ఉద్యోగులకు బెడ్లు లేవు

వెనక్కు పంపేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు 

ఎక్కువ డబ్బు గుంజడానికే అని ఆరోపణలు 

ఈహెచ్‌ఎస్‌లో నిబంధనల ప్రకారమే ఫీజులు 

ఆర్టీసీ సిబ్బందికి నగదురహిత వైద్య సేవల్లేవు!


విజయవాడ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు లభించడం దుర్భరంగా మారుతోంది. లక్షణాలతో బాధపడేవారు ఆస్పత్రికి వెళ్తే బెడ్లు లేవన్న సమాధానం వస్తోంది. పైస్థాయిలో పలుకుబడి ఉన్నవారు ఒత్తిళ్లు తీసుకొచ్చి బెడ్లు దక్కించుకుంటుండగా.. సాధారణ ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో అధిక ఫీజులు వసూలు చేసినా, బెడ్లు అందుబాటులో ఉండి ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆరోపణలపై కృష్ణాజిల్లాలో కొద్దిరోజుల కిందట జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ నేతృత్వంలో రెండు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేసి, చర్యలు తీసుకున్నారు.


అయినా కూడా ఆస్పత్రుల యాజమాన్యాలు ఏమాత్రం భయపడటం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) వర్తిస్తుంది. కరోనా సోకితే ఈహెచ్‌ఎస్‌ కార్డులతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చు. అయితే బెడ్లు ఉన్నా కొన్ని ఆస్పత్రులు లేవని చెబుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగులకు వైద్యసేవలు అందించడం కంటే ప్రైవేటు వ్యక్తులను చేర్చుకోవడం ద్వారానే ఎక్కువగా ఆదాయం సంపాదిస్తున్నారని చెబుతున్నారు. ఇతరుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షలు వసూలు చేసుకోవచ్చని, ఉద్యోగుల నుంచి ఈహెచ్‌ఎస్‌ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాల్సి ఉండటంతో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర కేసులకే బెడ్లు ఇస్తున్నారని, ప్రైవేటులో ఉద్యోగులమన్న కారణంతో తిప్పి పంపుతున్నారని, ఇక తామెక్కడ వైద్యం చేయించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పెద్దగా లక్షణాలు లేకపోతే హోం ఐసొలేషన్‌లోనే ఉంటున్నా, కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో బెడ్లు దొరక్కపోవడం ఇబ్బందికరంగా ఉంటోందని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఆరోగ్యశ్రీ సీఈఓకు ఫిర్యాదు 

ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్‌ వైద్యసేవలు అందించడం లేదని గురువారం ఆరోగ్యశ్రీ సీఈఓ అన్నం మల్లికార్జునకు ఏపీ పీటీడీ ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజా రవాణా సంస్థలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ఈహెచ్‌ఎస్‌ కింద గత మార్చి 21 నుంచి చందాలు రికవరీ చేసినా.. గుర్తింపు కార్డులు జారీ కాలేదన్నారు. గుర్తింపు కార్డులు లేవన్న సాకుతో ఆర్టీసీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించడానికి ప్రైవేటు ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదన్నారు. తక్షణం అన్ని ఆస్పత్రుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-04-23T09:51:47+05:30 IST