నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ABN , First Publish Date - 2022-07-03T09:11:32+05:30 IST

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌

అరగంట ముందుగా రావాలి.. మాస్క్‌ తప్పనిసరి

ఉన్నత విద్యామండలి వెల్లడి


అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-2022 పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి ఉండదని ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. జాతీయస్థాయి పరీక్షల్లోనూ ఇలాంటి నిర్దిష్ట ప్రమాణాలే ఉన్నాయని, వాటినే ఇక్కడా అమలు చేస్తున్నామని తెలిపింది. విద్యార్థులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లి చూసుకోవాలని, పరీక్ష రోజు కనీసం అరగంట ముందే కేంద్రానికి రావాలని సూచించింది. సెట్‌ నిర్వహణ ఏర్పాట్ల వివరాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి శనివారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఇంజినీరింగ్‌ పరీక్షలు 4నుంచి 8వరకు, అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు 11, 12 తేదీల్లో జరుగుతాయన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12గంటల వరకు మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఒక్కో సెషన్‌లో 22 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. ఏపీలో 120, తెలంగాణలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని, మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలుంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల రూట్‌ మ్యాప్‌ కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎంపీసీలో 206569 మంది, బైపీసీలో 93515 మంది మొత్తం 300084 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈఏపీ సెట్‌కు ఇన్ని దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. హాల్‌ టికెట్‌, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు విద్యార్థులు తీసుకురావాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు తేవాలని స్పష్టంచేశారు. నలుపు లేదా నీలం బాల్‌ పాయింట్‌ పెన్‌ మాత్రమే అనుమతిస్తామని, ఎలాంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలు అనుమతించబోమని తెలిపారు. పరీక్షా హాలులో ఎవరి వద్ద అయినా ఎలక్ర్టానిక్‌ పరికాలు దొరికినా, ఒక విద్యార్థి బదులు మరొకరు పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసులు తప్పవని హెచ్చరించారు. రఫ్‌ పేపరు కూడా పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారని చెప్పారు. విద్యార్థులు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, చిన్న శానిటైజర్‌ సీసాలు తెచ్చుకుంటే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేస్తున్నామని, వైద్య సదుపాయాలు, అంతరాయం లేని విద్యుత్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Updated Date - 2022-07-03T09:11:32+05:30 IST