1000 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ అసలే లేదు.. కానీ..!

Published: Mon, 06 Dec 2021 11:45:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
1000 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ అసలే లేదు.. కానీ..!

అమ్మకానికి ఉద్యోగాలు!

కేజీబీవీలో రిక్రూట్‌మెంట్‌ వ్యవహారం

1000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

ఇప్పటికే ఒక్కో పోస్టుకు లక్షల్లో బేరాలు

రాతపరీక్ష పెట్టాలని నిరుద్యోగుల డిమాండ్‌


(అమరావతి- ఆంధ్రజ్యోతి): రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ అసలే లేదు. ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. అవి కూడా భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత గల ఉపాధ్యాయ ఉద్యోగాలు. ప్రతిభ ఉన్నవారికే దక్కాల్సిన ఉద్యోగాలను అవినీతికి ఆస్కారం కలిగించేలా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. కేజీబీవీ పాఠశాలల్లో రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో ఇప్పటికే బేరాలు జరుగుతున్నట్టు సమాచారం. 


గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం కేజీబీవీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా జిల్లా స్థాయిలో కమిటీలు వేసి భర్తీ చేసేందుకు సిద్ధమైంది. చదువుకు, అనుభవానికి ఇన్నేసి మార్కులు.. అంటూ కొన్ని నిబంధనలు పెట్టింది. అయితే.. ‘వడ్డించేవాడు మనవాడైతే’ అన్నట్లుగా ఈ నిబంధనలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా, అవినీతికి అవకాశం కల్పించేలా భర్తీ ప్రక్రియ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దళారులు రంగంలోకి దిగి బేరాలు పెట్టేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రిన్సిపాల్‌ ఉద్యోగం అయితే ఇంత, కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్‌ ఉద్యోగం అయితే ఇంత అని బేరాలు కుదిర్చేస్తున్నారు. ఒక్కోపోస్టు లక్షలు పలుకుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవే కేజీబీవీల్లో గతంలోను పలుసార్లు ఉద్యోగాల భర్తీ చేశారు. ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసినా రాతపరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైనవారికి, ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు దక్కాయి. కానీ ఇప్పుడు రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభ ఉన్నవారికి న్యాయం జరగదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


958 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 

కేజీబీవీ విద్యాలయాల పథకం ప్రత్యేకంగా ఉన్నా సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రిన్సిపాల్‌, సీఆర్‌టీ, పీజీటీ, ఇతర ఉపాధ్యాయ ఖాళీలు కలిపి మొత్తం 958 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2న నోటిఫికేషన్‌ ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ దీనికి సంబంధించి ఒక మెమోను జారీ చేశారు. జిల్లాస్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా, సర్వశిక్ష అభియాన్‌ అదనపు పీడీ మెంబర్‌ సెక్రటరీగా, జిల్లా విద్యాశాఖాధికారి, ఏపీఎంఎస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. 


గతంలో పరీక్షలు ఇలా..

2014లో కేజీబీవీల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రిన్సిపాల్‌, సీఆర్‌టీ, పీజీటీ, ఇతర పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ ఎఫైర్స్‌కు 10 మార్కులు, ప్రొస్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌కు 10 మార్కులు, మెథడాలజీకి 15 మార్కులు, సర్వశిక్ష అభియాన్‌, కేజీబీవీ, సమాచార హక్కు చట్టాలపై అవగాహనకు 15 మార్కులు, సంబంధిత సబ్జెక్టు అంశాలకు 50 మార్కులు కేటాయించారు. రెండున్నర గంటల పాటు పరీక్ష నిర్వహించి ప్రతిభ ఉన్నవారిని ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు భర్తీ ప్రక్రియను మార్చేశారు. రాతపరీక్షే లేకుండా చేశారు. ప్రిన్సిపాల్‌ ఉద్యోగానికి నిర్దేశించిన విద్యార్హతకు సంబంధించిన డిగ్రీలో వచ్చిన మార్కులకు 40 శాతం, ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌కు 40 శాతం, అనుభవానికి 10 శాతం, ఉన్నత విద్యకు 5 శాతం, ప్రొఫెషనల్‌ ఉన్నత విద్యకు 5శాతం మార్కులు కేటాయించారు.


సీఆర్‌టీ(కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్స్‌) ఉద్యోగాలకు కూడా ఇలానే ఇంతింత శాతం మార్కులుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలకు అయితే అనుభవానికి 20 శాతం మార్కులు కేటాయించారు. అంటే అన్నీ ఆయా సర్టిఫికెట్ల ఆధారంగా జరిగేవే. ఇక్కడే ప్రతిభను పక్కన పెట్టేసి సిఫార్సులకు పెద్దపీట వేసేందుకు, అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అనుభవానికి సంబంధించిన మార్కులను ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా గతంలో చేసిన ఉద్యోగాల్లో అభ్యర్థుల ప్రవర్తనకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలోనూ వివక్ష జరిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఎవరి అర్హత ఏంటన్నది ఆయా అభ్యర్థులకే తెలుస్తుంది కానీ.. మిగతా వారందరికీ తెలిసే అవకాశం లేదంటున్నారు.


రాతపరీక్ష లేకుండా ఈ పద్ధతిలో భర్తీ చేస్తే పారదర్శకత ఉండదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇన్ని ఉద్యోగాలకు ఈ నెల 2న నోటిఫికేషన్‌ ఇచ్చి, కొన్నిరోజుల వ్యవధిలోనే అంటే ఈ నెల 20లోపే భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇంత హడావుడిగా, అదీ రాతపరీక్ష లేకుండా భర్తీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలకు చోటు లేకుండా, గతంలో మాదిరిగా రాతపరీక్ష ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేయాలని, అప్పుడే ప్రతిభ ఉన్నవారికి న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. 


ఉద్యోగాలకు డిమాండ్‌ 

బాలికల విద్యను ప్రోత్సహించేందుకు చాలా ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించింది. బాలికల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్‌ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల జీతాల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం ఇస్తాయి. ప్రిన్సిపాల్‌కు రూ.27,755, కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్‌(సీఆర్‌టీ)కు రూ.21,755, పీఈటీకి రూ.21,755, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.12వేలు జీతంగా ఇస్తారు. వీరందరికీ మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో ఒక జీవో కూడా జారీ చేశారు. అది అమలైతే వీరి జీతాలు కొంతమేర పెరుగుతాయి. పేరుకు కాంట్రాక్టు ఉద్యోగాలే అయినా కేజీబీవీ పాఠశాలలు ఉన్నంతకాలం ఈ పోస్టులు ఉంటాయి. దీంతో వీటికి డిమాండ్‌ బాగా ఉంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.