ఉపాధి పనుల్లో వసతులు కరువు

ABN , First Publish Date - 2021-04-21T05:38:44+05:30 IST

మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలు మండుటెండలో అల్లాడిపోతున్నారు.

ఉపాధి పనుల్లో వసతులు కరువు
గొడిగనూరులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

  1. మండుటెండలో కూలీలు  
  2. తాగునీరు, మజ్జిగ పంపిణీ ఊసే లేదు 
  3. కనిపించని టెంట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు 


చాగలమర్రి, ఏప్రిల్‌ 20: మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలు మండుటెండలో అల్లాడిపోతున్నారు. చట్టం ప్రకారం వేసవిలో ఉపాధి కూలీలకు  పని చేసే చోట కనీస వసతులు కల్పించాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఎండలో పనులు చేసేవారు కాసేపు సేద తీరడానికి టెండ్లు ఏర్పాటు చేయాలి. కూలీలకు మజ్జిగ, మంచినీరు అందించాలి. కానీ ఇవేవీ లేవు. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రమవుతు న్నాయి. అయినా అధికారులు కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అనుకోవడం లేదు. మండలంలో ప్రస్తుతం 615 గ్రూపులు ఉన్నాయి. 2400 మందికి పైగా ఉపాధి కూలీలు ప్రతి రోజూ పని చేస్తున్నారు.  2016లో ఉపాధి కూలీలకు నీడ కోసం పట్టలు పంపిణీ చేశారు. కానీ వాటిని ఎక్కడా ఉపయోగించడం లేదు. కొత్తగా  ఏర్పడ్డ గ్రూపుల్లో పని చేస్తున్నవారికి కూడా పట్టలు ఇవ్వలేదు.  


మెడికల్‌ కిట్లు లేవు 

ఉపాధి కూలీలకు అనారోగ్య సమస్యలు తలెత్తినా, వడదెబ్బ తగిలినా  ఉపయోగించడానికి అధికారులు మెడికల్‌కిట్లు ఇవ్వాలి. ఎండ తీవ్రత  పెరుగుతున్నందు వల్ల  అనేక మంది అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోతున్నారు.  కానీ పని ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా లేవు. కూలీలకు మజ్జిగ, మంచి నీరు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు ఇంటి నుంచే బాటిళ్లతో నీరు తీసుకెళ్తున్నారు. ఆ నీరు అయిపోతే దాహంతో ఇబ్బందిపడాల్సి వస్తోంది. 

 ఈ విషయం గురించి ఏపీవో నర్సిరెడ్డిని వివరణ కోరగా మంచి నీరు తీసుకెళ్లినందుకు రూ.6 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు. నీడనిచ్చేందుకు టార్పాలిన్‌ పట్టలు, మెడికల్‌ కిట్లు మంజూరు కాలేదన్నారు. కూలీలు సగటు వేతనం రూ.48 పని చేస్తేనే మజ్జిగ డబ్బులు వస్తాయని,  లేకుంటే  రావని అన్నారు.   

Updated Date - 2021-04-21T05:38:44+05:30 IST