
పడావు భూముల్లో గడ్డి పెంపకం పథకం ఎక్కడ..?
లబ్ధిదారులకు అందని సబ్సిడీ
ట్రెజరీ అధికారుల తీరుతో నీరుగారిన లక్ష్యం
బిల్లులు ఉంటేనే విడుదలంటూ మెలిక
మురిగిపోయిన రూ.4కోట్ల నిధులు
మేత లేక అల్లాడుతున్న మూగజీవాలు
హనుమకొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : పశుపోషణకు పడావు భూముల్లో పశుగ్రాసం పెంచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం రెవెన్యూ, ట్రెజరీ అధికారుల తీరు వల్ల అమలుకు నోచుకోవడం లేదు. మూడేళ్ల కిందట ఈ పథకం అమలులోకి వచ్చింది. కేంద్రం నిధులు ఇస్తున్నా పథకం మాత్రం అమలు కావడం లేదు. దీంతో రైతులు పశుగ్రాసం కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
పశుగ్రాసం కొరత
ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరవువుతోంది. కాడెద్దులకు పశుగ్రాసం దొరకకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరు ఆర్థిక భారమైన వేలకు వేలు ఖర్చుపెట్టి గడ్డిని కొని పశువులను సాకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పశువులకు సంపదకు సరిపడా పశుగ్రాసం దొరకడం లేదు. ఉన్న కొద్దిపాటి మేత ప్రియమైంది. గతంలో సాగునీరు అందుబాటులో లేక ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల భూములు పడావు పడి ఉండేవి. అక్కడ గడ్డి విస్తారంగా పెరిగేది. పశువులకు కావలసినంత మేత లభించేంది. పశువులతో పాటు గొర్రెలు, మేకలకు సైతం గడ్డి దొరికేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సాగునీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాగునీరు పుష్కలంగా అందుబాటులో వచ్చింది. క్రమంగా పడావు భూములు సైతం పచ్చని పొలాలుగా మారిపోయాయి. దీనితో పశువులకు మేయడానికి పచ్చగడ్డి దొరకని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ అధికారులు పడావా భూములు చూపలేకపోతున్నారు.
రూ.లక్ష సబ్సిడీ
పశువులకు గ్రాసం కొరత రాకుండా భవిష్యత్తులో మేతను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కేంద్రం పడావు భూముల్లో పశుగ్రాసం పెంపకానికి ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రామాల్లో పడావు భూములను అభివృద్ధి చేసుకొని కావలసిన గ్రాసం పెంచుకునేందుకు రైతులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 400 యూనిట్లు మంజూరు అయ్యాయి. అవసరమైన రాయితీని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి ఇస్తారు. పశువులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో జీవాలు పెద్ద సంఖ్యలో ఉంటే ఆహారం సరిపోక వలసలు వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ద్వారా దీనిని నివారించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పడావు భూములు సు మారు 42 వేల ఎకరాల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ఇటీవల నీటి వనరులు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటితో పాటు గుట్టలు, రాళ్లు, రప్ప లు ఉన్నచోట కూడా సాగులోకి తెస్తున్నారు. ఒక దశలో పశువులు మేత కోసం సంచరించేందుకు ఖాళీ స్థలాలు లేకుండా పోయాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పడావు భూముల్లో గ్రాసం పెంచినట్లయితే ఈ పథకం ద్వారా పశువులకు ప్రయోజనం చేకూరుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
పథకం ఇలా..
పడావు భూముల అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం వంద శాతం రాయితీ అందిస్తోంది. మూడేళ్లపాటు నిరంతరాయంగా గ్రాసం అందేలా విత్తనం ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు జాతి, పప్పుజాతి, గడ్డి జాతి పశుగ్రాసాలతో పాటు లూసర్న్, అవిశ, గంగరావి వంటి మొక్కలు నాటు కోవచ్చు. గుర్తించిన భూమిలో నీటి లభ్యత లేనట్లయితే బోరు వేసుకోవాలి. పెంచుతున్న గ్రాసాన్ని సంరిక్షించుకునేందుకు చుట్టూ బయోఫెన్సింగ్ వేసుకోవాలి. లబ్దిదారుల ఎంపికలో ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 8 శాతం మందికి అవకాశం కల్పిస్తారు.
మురిగిపోయిన నిధులు
పథకం లక్ష్యం బాగానే ఉంది కానీ ఎటొచ్చి అమలులోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలకు ఈ పథకం కింద కిందటేడు రూ.4కోట్లు మం జూరయ్యాయి. నిధులు కూడా విడుదలయ్యాయి. లబ్ధిదారులను ఎంపిక చేసే ముందు పడావు భూములు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసుకోవడమే కాకుండా పశుగ్రాసం పెంచడానికి ఆ నేలలు ఎంత మేరకు అనువైనవో జిల్లా పశు సంవరఽ్ధక శాఖ అధికారులు నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులకు లేఖలు రాశారు. హనుమకొండ జిల్లాలో అసలు పడావు భూములు లేవనే సమాధానం అధికారుల నుంచి వచ్చింది. దీనితో ఈ జిల్లాలో పథకం అమలే కాలేదు.
ట్రెజరీ మెలిక
మిగతా వరంగల్,. జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ పథకం అమలుకు ప్రయత్నాలు చేశారు. కానీ లబ్ధిదారులు ముందుగా తమ సొంతఖర్చుతో పశుగ్రాసం చేపట్టి బిల్లులు పెట్టిన తర్వాతనే బిల్లులు పాస్ చేస్తామని ట్రెజరీ అధికారులు మెలికపెట్టడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పడావు భూముల్లో ఒక హెక్టారులో పశుగ్రాసం పెంచుకోవడానికి ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో రూ. లక్ష ఇస్తుంది. పశుగ్రాసం పెంచడానికి చాలా మంది ముందుకు వచ్చినా ఖర్చు పెట్టిన తర్వాతే బిల్లులు అనే సరికి వెనక్కితగ్గారు. ట్రెజరీ అధికారులు సహకరించిన ఇతర కొన్నిజిల్లాలో మాత్రం ఈ పథకం అమలైంది. లబ్ధిదారులకు నిధుల మంజూరు కూడా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడేళ్లుగా ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పడావు భూమిలో గడ్డిని పెంచేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది.
అటకెక్కిన పథకం
పడావు భూముల్లో పశుగ్రాసం పారదర్శకంగా పెంచేందుకు పరిరక్షణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. కానీ అసలు పథకమే అమలు కాకపోవడంతో ఈ కమిటీల ఏర్పాటు కూడా జరగలేదు. ఈ యేడు కూడా ఇప్పటి వరకు పథకం అమలుకు సంబంధించిన రీవాలిడేషన్ రాకపోవడంవల్ల అమలు అవకాశాలు కనిపించడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిధుల విడుదల విషయంలో చేసిన కొన్ని మార్పుల వల్ల భవిష్యత్తులో ఈ పథకం అమలులో ఇబ్బందులు తొలగవచ్చునని తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయా పథకాల కింద లబ్దిదారులకు సబ్సిడీని నేరుగా పీఎ్ఫఎంఎస్ విధానంలో నేరుగా వారి ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ట్రెజరీ అడ్డంకులు ఉండకపోవచ్చునని తెలుస్తోంది.