‘ఉపాధి’లో అక్రమాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-08-09T05:31:29+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తప్పుడు మస్టర్లు, పనుల్లో అక్రమాలు, వేతనాల్లో కోత వంటి వాటికి ఉపాధి హామీ పథకం చిరునామాగా ఉండేది. సామాజిక తనిఖీలు, ప్రజావేదిక విచారణల్లో రూ. లక్షల్లో అవినీతి చోటుచేసుకునేది. వీటికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎ్‌స) అమలు చేయాలని ఆదేశించడంతో పారదర్శకత పెరిగింది.

‘ఉపాధి’లో అక్రమాలకు చెక్‌

ఎన్‌ఎంఎంఎ్‌స యాప్‌తో పారదర్శకత
ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో కొత్త మలుపు
మూడు దశల్లో పనుల నమోదు
పబ్లిక్‌ డొమైన్‌లో పనుల ఫొటోల అప్‌లోడ్‌
దేశంలో ఎక్కడి నుంచైనా పర్యవేక్షణ
మారుమూల గ్రామాల్లో సర్వర్‌ సమస్యలు


హనుమకొండ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) :
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తప్పుడు  మస్టర్లు, పనుల్లో అక్రమాలు, వేతనాల్లో కోత వంటి వాటికి ఉపాధి హామీ పథకం చిరునామాగా ఉండేది. సామాజిక తనిఖీలు, ప్రజావేదిక విచారణల్లో రూ. లక్షల్లో అవినీతి చోటుచేసుకునేది. వీటికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎ్‌స) అమలు చేయాలని ఆదేశించడంతో పారదర్శకత పెరిగింది.

దీంతో గత కొద్ది నెలలుగా  అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఉపాధి హామీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తున్న రాగా సాప్ట్‌వేర్‌ వినియోగాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్‌ఫార్మటిక్‌ సెంటర్‌) సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసింది. అప్పటి నుంచి  క్షేత్ర స్థాయిలో నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సి వస్తుండడంతో కూలీలకు న్యాయం జరుగుతోంది. కూలీల వేతనాలు ప్రతీ వారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి.

చేయకున్నా చేసినట్టు..
గతంలో చేసిన పనులనే కొత్తగా చేసినట్టు రికార్డుల్లో చూపి అవకతవకలకు పాల్పడడం వంటి  సంఘటనలు వెలుగు చూశాయి. ఉపాధి కూలీల హాజరు, పనుల వివరాల నమోదులో ఉన్న లొసుగులు అనేక అక్రమాలకు తావిచ్చాయి. తక్కువ మంది పనులు చేసినా ఎక్కువ మందికి మస్టర్లు వేసి వేతనాలు పక్కదారి పట్టించారు.  పెద్ద మొత్తంగా నిధులు దండుకున్నారు. గతేడాది జిల్లాల్లో పర్యటించిన కేంద్ర నిఘా బృందాలు క్షేత్ర స్థాయి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి.

మూడు దశల్లో..
ఈ ఏడాది మార్చి నుంచి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఉపాధి హామీ పథకం అమలు చేయటంతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. నాలుగు నెలలుగా ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి. పనులు చేయాల్సిన ప్రాంతానికి కూలీలు వెళ్లిన వెంటనే వారిని వరుసలో నిలబెట్టి మేట్లు, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు తమ చరవాణిలోని నేషన్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎ్‌స) యాప్‌ ద్వారా బృంద చిత్రం తీస్తారు. తర్వాత ఒక్కో కూలీ పేరుతో హాజరు నమోదు చేసి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌కు ఆన్‌లైన్‌లో మస్టర్లు పంపిస్తారు.

రెండో దశలో కూలీలు చేయబోయే ప్రాంతాన్ని పనిని, అందుల్లో భాగస్వాములవుతున్న కూలీల చిత్రాలను యాప్‌లో ఫొటో తీసి పంపిస్తారు. మూడవ దశలో పూర్తి చేసిన పనిని యాప్‌ ద్వారా ఫోటో తీసి పంపిస్తారు, ఈ మూడు దశల సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే కూలీల ఒక రోజు మస్టర్‌ ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో నమోదవుతుంది. ఈ కారణంగా అక్రమాలకు తావు ఉండటం లేదు. ఎక్కడైనా మేట్ల అవసరం ఉంటే వారి వివరాలు రిజిస్టర్‌ చేయాలి. కొత్తగా విధుల్లో చేరిన మేట్లకు ఎన్‌ఎంఎంఎ్‌స అప్‌లోడ్‌పై ట్రేనింగ్‌ ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి.

యాప్‌ ద్వారా వర్క్‌సైట్‌ ఫొటో క్యాప్చర్‌ చేయడంలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సాఫ్ట్‌వేర్‌లో మాన్యువల్‌గా అటెండెన్స్‌ నమోదు చేసే సదుపాయం ఉంది. అక్రమాల కట్టడికి గతేడాదే ఎన్‌ఎంఎంఎ్‌స యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అన్ని వర్క్‌సైట్స్‌లో అటెండెన్స్‌ ఎన్‌ఎంఎంఎ్‌స యాప్‌ ద్వారా క్యాప్చర్‌ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం 20 మంది కంటే అధికంగా కూలీలు పని చేస్తున్న ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

పలుకొత్త ఆప్షన్లు
అయితే ఇంత కాలం అది నామమాత్రంగానే అమలైంది. దీంతో ఈ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర గ్రా మీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌  రాష్ట్రాలకు ఆదేశాలు జా రీ చేశారు. దీంతో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ అన్ని జిల్లాల ఆర్డీవోలకు ఉత్తర్వులు ఇవ్వడంతో మే 16  నుంచి ఎన్‌ఎంఎంఎ్‌సను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో పనుల గుర్తింపు, బిల్లుల మంజూరు, వేతనదారుల కూలీల చెల్లింపులు తదితర పనులు నిర్వహించేవారు. తాజగా దాని స్థానంలో ప్రవేశపెట్టిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఎన్నో రకాల కొత్త ఆప్షన్లు ఉన్నాయి. పథకానికి సంబంధించి డ్వామా అనుబంధ శాఖలైన పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, అటవీశాఖ సిబ్బందికి కూడా కొత్త సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇచ్చారు.

ఉపాధి ఉద్యోగుల రిజిస్ట్రేషన్‌ పూర్తికాగా ఎంపీడీవోలు, ఏపీవోలకు కొత్త లాగిన్‌ ఐడీలు అందచేశారు. పాత సాఫ్ట్‌వేర్‌లో 160 రకాల పనులకు మాత్రమే అవకాశం ఉండేది.   కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 264 రకాల పనులు చేసుకోవచ్చు. రైతుల పొలాల్లో మట్టి, రాళ్లతో గట్లు వేయడం, కాలువల పూడిక తీత, సామాజిక బీడు భూముల అభివృద్ధి, సిమెంట్‌, కాంక్రీటులతో చెక్‌డ్యాంలు నిర్మించడం, చెత్త కేంద్రాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ విధానం లాంటి పనులను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి పనులు చేపట్టవచ్చు. ఉపాధి హామీ స్కీం కింద గ్రామాల్లో చేపట్టే పనులకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స వెబ్‌సైట్‌లోని పబ్లిక్‌ డొమైన్‌లో అప్‌లోడ్‌ చేయడం వల్ల దేశ వ్యాప్తంగా ఏ గ్రామం వారైనా తమ ఊరిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల గురించి  తెలుసుకునే అవకాశం ఉంటుంది.

సర్వర్‌ సమస్యలు
అయితే ఈ విధానం కొత్త కావడంతో ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో చిన్న చిన్న సమస్యలు వచ్చి కూలీలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌ పనితీరును ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. సర్వర్‌ తరుచూ సమస్యలు వస్తున్న కారణంగా వివరాల ఆప్‌లోడ్‌లో జాప్యం జరుగుతోంది. సిబ్బందికి కూడా పూర్తిస్థాయిలో అవగాహన రాలేదు. అలాగే మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కూడా సమస్యలు వస్తున్నాయి. ఇందువల్ల అన్ని గ్రామాల్లో కొత్త విధానం అమల్లోకి రాలేదు.

Updated Date - 2022-08-09T05:31:29+05:30 IST