డ్రెయిన్ల అభివృద్ధికి నిధులేవీ!

ABN , First Publish Date - 2022-06-29T06:14:43+05:30 IST

రైతుల వ్యధలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏళ్ల తరబడి మురుగునీటి డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్కలను తొలగించేందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించలేని నిస్సహాయ స్థితిలో ఉంది.

డ్రెయిన్ల అభివృద్ధికి నిధులేవీ!
బండారులంక అప్పర్‌ కౌశిక డ్రెయినలో కలుపు తొలగింపునకు డ్రోన ప్రయోగం నిర్వహించింది ఇక్కడే

  • 47 డ్రెయిన్ల అభివృద్ధి పనులకు గాను ఇరవైకే అనుమతి
  • అవీ మంత్రులు ప్రాతినిధ్యం వహించే సబ్‌ డివిజన్లకే పరిమితం
  • డ్రెయిన్లు బాగు చేస్తాం... ఖరీఫ్‌ సాగుచేయమన్నారు: రైతులు
  • ఇంకా ప్రారంభం కాని కలుపు తొలగింపు పనులు
  • డ్రెయిన్లలో పెరుగుతున్న ముంపు తీవ్రత
  • డ్రోన్ల ప్రయోగం విఫలమేనా?

రైతుల వ్యధలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏళ్ల తరబడి మురుగునీటి డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్కలను తొలగించేందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించలేని నిస్సహాయ స్థితిలో ఉంది. వర్షాకాలం వస్తే చాలు కొద్దిపాటి వర్షానికే ఆయా ప్రాంతాల్లోని డ్రెయిన్లు పొంగి ప్రవహించి సమీప పొలాలను ముంచెత్తడం కోనసీమ జిల్లాలో పరిపాటిగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతీఏటా డ్రెయిన్లలో కలుపు తొలగింపుతో పాటు మట్టి తవ్వకాలకు భారీగా నిధులు మంజూరు చేసేవి. జగన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రెయిన్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంవల్ల ఏర్పడుతున్న ముంపు సమస్యలను తట్టుకోలేని కోనసీమ జిల్లా రైతులు పంట విరామానికి సిద్ధమయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వంలో కనీస చలనం లేదు. తూడు, గుర్రపుడెక్క తొలగించడానికి కూడా నిధులు మంజూరు చేయించలేని నిస్సహాయ స్థితిలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారులు ఏవో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నప్పటికీ అ  ఆచరణ సాధ్యం కావట్లేదు. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమ జిల్లాలో 280 కిలోమీటర్ల పొడవున 16 మేజర్‌ డ్రెయిన్లు, 243 కిలోమీటర్ల మేర 30 మీడియం డ్రెయిన్లు, 572 కిలోమీటర్ల మేర 201 మైనరు డ్రెయిన్లు ఉన్నాయి. ప్రతీఏటా వీటి అభివృద్ధికి జలవనరుల శాఖ నిధులు మంజూరు చేస్తుంది. కానీ జగన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కనుమరుగయ్యాయి. అయితే ఇటీవల రైతులు పంట విరామానికి సిద్ధమవుతూ ఉద్యమాలు చేస్తుండడంతో అతికష్టంపై కోనసీమ జిల్లాలో 20 డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగించడానికి రూ.2.50 కోట్లు డ్రెయినేజీ శాఖకు మంజూరు లభించింది. ఈ నిధులతో చేపట్టే పనులు మంత్రులు ప్రాతినిథ్యం వహించే రామచంద్రపురం, అమలాపురం నియోజకవర్గాలకే పరిమితమయ్యాయి. అయితే రూ.3 కోట్ల  అంచనా వ్యయంతో మరో 27 పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. అవి కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్నాయి. కనీసం జిల్లావ్యాప్తంగా మొత్తం పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపకుండా కేవలం అటు మంత్రి చెల్లుబోయిన వేణు, ఇటు పినిపే విశ్వరూప్‌ ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాలకే పరిమితం చేశారు. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండే మండలాలను పూర్తిగా విస్మరించారు. మంజూరైన 20 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి డ్రెయిన్లలో కలుపు తొలగింపు పనులకు ప్రభుత్వం ఏప్రిల్‌ నెలలో ఆమోదముద్ర వేసి టెండర్ల  ప్రక్రియ పూర్తిచేసి మే నెలలో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో చేపట్టాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ఇచ్చిన 20 పనులకు ఆలస్యంగా అనుమతులు లభించడంతో వర్షాల సీజనలో డ్రెయినలో తూడు, గుర్రపుడెక్క పనులకు శ్రీకారం చుడుతున్నారు.  అయితే మందు పిచికారీ చేసే సమయంలో వర్షాలు వస్తే ఫలితం ఉండదనేది రైతుల అభిప్రాయం. 

మరోవైపు జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల రైతులు పంట విరామానికి  సిద్ధమయ్యారు. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు యంత్రాంగం ముంపు బెడద లేకుండా డ్రెయిన్ల అభివృద్ధి పనులు చేస్తామంటూ రైతులకు ఇస్తున్న భరోసా ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కోనసీమకు చెందిన ప్రజాప్రతినిధులు సమైక్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంలో వైఫల్యం చెందుతున్నారనడానికి  ఈ తరహా ఉదాహరణలెన్నో కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడం, డ్రెయిన్లలో ముంపు నీరు పెరుగుతుండడంతో రైతులు ఖరీఫ్‌ సాగుకు దూరంగా ఉంటున్నారు. డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క నిర్మూలన చేపట్టలేని ప్రభుత్వం తమను ఏవిధంగా ఆదుకుంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

ఇదిలా ఉండగా అమలాపురం రూరల్‌ మండలం ఇందుపల్లి ఎనకౌంటర్‌ బ్రిడ్జి వద్ద కలెక్టర్‌  హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో అప్పర్‌ కౌశిక డ్రెయినలో డ్రోన్ల సహాయంలో తూడు, గుర్రపుడెక్క నిర్మూలనకు చేపట్టిన ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనేది అధికారుల అభిప్రాయం. ఒక డ్రెయినలో పూర్తిగా డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేస్తే ఫలితాలు ఏవిధంగా ఉంటాయో చూడాలని కలెక్టర్‌ ఇటీవల డ్రెయిన్స శాఖ అధికారుల సమీక్షలో స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు వర్షాలు కురుస్తున్నా డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క నిర్మూలన పనులకు ఆ శాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నప్పటికీ ప్రయోజనం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. 

Updated Date - 2022-06-29T06:14:43+05:30 IST