గంగానదిలో విసిరేసిన కొవిడ్ మృతుల సంఖ్యపై సమాచారం లేదు: కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-02-07T22:09:12+05:30 IST

కరోనా వైరస్ రెండో ఉద్ధృతి సమయంలో గంగానదిలో తేలిన మృతదేహాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కరోనా బారినపడి..

గంగానదిలో విసిరేసిన కొవిడ్ మృతుల సంఖ్యపై సమాచారం లేదు: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ రెండో ఉద్ధృతి సమయంలో గంగానదిలో తేలిన మృతదేహాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కరోనా బారినపడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా శ్మశానాలు ఖాళీ లేకపోవడంతో కొందరు,  సగం కాలిన మృతదేహాలను మరికొందరు గంగానదిలోకి విసిరేశారు. ఇంకొందరైతే గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాలను పూడ్చిపెట్టారు.


యూపీ నుంచి బీహార్ వరకు గంగా తీరంలో పదుల సంఖ్యలో తేలియాడిన మృతదేహాలను వెలికి తీశారు. అలా ఎన్ని మృతదేహాలు బయటపడ్డాయన్న దానిపై తమ వద్ద కచ్చితమైన సమాచారం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభకు తెలియజేసింది. 


తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు జల్ శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తాడు బదులిస్తూ.. గంగానదిలో పడేసిన ‘కొవిడ్’ మృతదేహాల సంఖ్యపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం లేదని  తెలిపారు. క్లెయిమ్ చేసుకోనివి, గుర్తించనవి, పూర్తిగా కాలినవి, సగం కాలిన మృతదేహాలు నదీ తీరంలో లభ్యమైనట్టు గుర్తించినట్టు చెప్పారు.


ఉత్తరప్రదేశ్, బీహార్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగినట్టు వివరించారు. దీనికి సంబంధించి స్వాధీనం చేసుకున్న మృతదేహాలు, డిస్పోజ్ చేసిన వాటికి సంబంధించిన వివరాల కోసం ఆయా రాష్ట్రాలను సంప్రదించినట్టు చెప్పారు. 

Updated Date - 2022-02-07T22:09:12+05:30 IST