రాజు లేడు.. యువరాజూ లేడు!

Published: Sun, 22 May 2022 01:28:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజు లేడు.. యువరాజూ లేడు!

‘రాష్ర్టానికి పరిశ్రమలు రప్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌, సింగపూర్‌, చైనా, జపాన్‌లకు వెళ్లడం మూర్ఖత్వం!’... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి చేసిన విమర్శ ఇది. ఎవరూ ఆహ్వానించకపోయినా చంద్రబాబు దావోస్‌ వెళ్లి ఏడు కోట్లు ఖర్చు చేశారని కూడా జగన్‌ విమర్శించారు. ఇక మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అయితే ప్రజల సొమ్ముతో చంద్రబాబు విహారయాత్రలకు వెళ్లి రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు. స్విస్‌ బ్యాంకులో లెక్కలు చూసుకోవడానికి చంద్రబాబు దావోస్‌ వెళుతున్నారనీ ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో చంద్రబాబు వంద కోట్లకు పైగా తగలేశారని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఇది గతం! వర్తమానానికి వస్తే... ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో శుక్రవారం దావోస్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన తన వెంట అధికారులను తీసుకువెళ్లలేదు. ముఖ్యమంత్రి ప్రయాణించిన విమానం ముందుగా ఇస్తాంబుల్‌లో దిగి, అక్కడ ఇంధనం నింపుకొని లండన్‌లో ఆగింది. అక్కడ జగన్మోహన్‌ రెడ్డి కుమార్తెలు కూడా అదే విమానం ఎక్కి దావోస్‌ వెళ్లారు. పెట్టుబడుల పేరిట మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చేపట్టిన విదేశీ పర్యటన ఇలా సాగింది. గతంలో చంద్రబాబు దావోస్‌కు ఎన్నిసార్లు వెళ్లినా అధికారుల బృందాన్ని తన వెంట తీసుకెళ్లారు. జగన్మోహన్‌ రెడ్డి మాదిరిగా కుటుంబ సభ్యులతో వెళ్లలేదు.

దావోస్‌ పర్యటనకు ఆయన ప్రత్యేక విమానం కూడా వాడలేదు. అయినా అప్పట్లో చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు. దుబాయిలో పెట్టుబడిదారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారికి బహుమతులు ఇవ్వడానికి భారీగా ఖర్చు చేశారంటూ విచారణ కూడా జరిపించారు. అప్పు చేయందే పూట గడవని స్థితికి రాష్ర్టాన్ని చేర్చిన జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ఇప్పుడు ప్రత్యేక విమానంలో భార్యా పిల్లలతో దావోస్‌ వెళ్లడాన్ని ఏమనాలో ఏలినవారే చెప్పాలి. విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా? అని గతంలో చెప్పిన జగన్‌ ఇప్పుడు ఏమంటారో చూడాలి. జగన్‌ దేశం వదిలి వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కూడా న్యాయస్థానం అనుమతితోనే కుటుంబ సమేతంగా దావోస్‌ వెళ్లారు. జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతించిన న్యాయస్థానం తన ఆదేశాలలో ఆయనను ఏ–1గా పేర్కొనడం గమనార్హం. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను, ఆయన వాడే ఫోన్‌ నంబర్‌ను కూడా న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించారు. ఇదీ జగన్‌ పరిస్థితి! తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్‌ క్రమం తప్పకుండా ప్రతి ఏటా దావోస్‌ వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం విదితమే. జగన్‌ మాత్రం మొదటిసారిగా దావోస్‌ వెళుతున్నారు. అక్కడ ఆయన కుటుంబ సమేతంగా ఏం చేస్తారో చూడాలి. జగన్మోహన్‌ రెడ్డిపై ఆర్థిక నేరాలకు సంబంధించి పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇలాంటి కేసుల విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో బహుళ జాతి సంస్థలు ఆయా ప్రభుత్వాలతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవు.


అంతర్జాతీయంగా అమలులో ఉన్న అవగాహన ఇది. మరి డజనుకు పైగా కేసులలో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలకు బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తాయా? రావా? అన్నది వేచి చూడాలి. పాలకుల విశ్వసనీయత ప్రశ్నార్థకమైనప్పుడు పెట్టుబడులు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రత్యేక విమానంలో జగన్‌ కుటుంబం మాత్రమే దావోస్‌ వెళ్లడాన్ని అధికార పార్టీ నాయకులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. దావోస్‌ సంగతి దేవుడెరుగు.. నేపాల్‌, భూటాన్‌ వెళ్లడానికైనా ముఖ్యమంత్రి జగన్‌కు న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ పరిస్థితి ఐదు కోట్ల ఆంధ్రులకు ఒక రకంగా అవమానమే! ఈ దుస్థితి నుంచి జగన్‌ బయటపడాలంటే ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులలో తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవాలి. పెట్టుబడుల పేరిట కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు బయలుదేరే ముందు జగన్‌ ఈ దిశగా ప్రయత్నాలు చేసివుంటే బాగుండేది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తనను తాను నిర్దోషిగా రుజువు చేసుకునేందుకు వీలుగా కేసుల విచారణను అడ్డుకోకుండా సహకరించడం అవసరం. ఈ పని చేయకుండా ఆయన ఎన్ని పర్యటనలు చేసినా వ్యర్థమే. అంతేకాదు, ఐదు కోట్ల ఆంధ్రులకు కూడా ఒక ముద్దాయి ముఖ్యమంత్రిగా ఉండటం అవమానం! అయినా, రాష్ర్టానికి రాజధాని కూడా లేకుండా చేసి ‘మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’ అని జగన్‌ ఏ ముఖం పెట్టుకొని అడగగలరు? తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ పేరు చెబితే చాలు పెట్టుబడిదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దావోస్‌ సదస్సులో జగన్‌కు ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయో తెలుసుకోవాలని ఉంది. ఏదో ఒకటిలే.. మూడేళ్లకైనా జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ గడప దాటి విదేశాలకు వెళ్లాడని ప్రస్తుతానికి సంతృప్తి పడదాం.


కేసీఆర్‌ దేశ పర్యటన...

‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాష్ర్టాన్ని గాలికొదిలేశారు. ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని చెప్పి నిన్న మొన్నటి వరకు ఆయన ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. రెండు వారాలకు పైగా అక్కడే గడిపిన ఆయన.. రెండు రోజుల క్రితమే ప్రగతి భవన్‌కు వచ్చి ఆ వెంటనే శుక్రవారం సతీసమేతంగానే కాకుండా మరికొంత మంది పరివారాన్ని వెంటబెట్టుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిపోయారు. తెలంగాణలో ఇప్పుడు రాజూ లేడు – యువరాజూ లేడు! అదేమిటో గానీ, కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరే వరకు ఢిల్లీలో ఫలానా ఫలానా వారిని కలుస్తారని ప్రగతి భవన్‌ నుంచి లీకులు వస్తాయి. అయితే ఢిల్లీలో వారం రోజులపాటు ఉన్న సందర్భాలలో కూడా ఆయన ఒక్కరిని కూడా కలవకపోవడాన్ని గతంలో మనం చూశాం. ఇప్పుడు  ఆయన ఢిల్లీలో మకాం వేసి ఐదారు రాష్ర్టాలను చుట్టి వస్తారని ప్రగతి భవన్‌ సమాచారం. ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి మోదీ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడని కేసీఆర్‌. 26వ తేదీన హైదరాబాద్‌లో ఉండకుండా టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారని కూడా ప్రచారంలో ఉంది.


తాజా పర్యటనలో కేసీఆర్‌ ఎవరెవరిని కలుసుకుంటారో చూడాలి. ఈ పర్యటనలో భాగంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలతోపాటు, చైనా సైనికులతో గాల్వన్‌ లోయలో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు కూడా తెలంగాణ రాష్ట్రం తరఫున ఆర్థిక సహాయం చేస్తారని ప్రగతి భవన్ ప్రకటన. రైతులు, సైనిక కుటుంబాలను ఆదుకోవడంలో తప్పులేదు గానీ ‘ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత’గా పరిస్థితి ఉండకూడదుగా! అప్పుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులు వేల కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితులలో ‘మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహరించడం ఆక్షేపణీయంగా ఉంది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలో తెలుగు రైతులు పాల్గొనలేదు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోకుండా ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్‌ ఈ మధ్య తెగ ఉబలాటపడుతున్నారు. ఈ కారణంగానే గాల్వన్‌ లోయలో చనిపోయిన ఇతర రాష్ర్టాల సైనికుల కుటుంబాలకు, ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకొని ఉంటారు. పనిలో పనిగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా అంటే జాతీయ పార్టీగా ప్రకటించాలని కూడా కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదు గానీ, కేసీఆర్‌ జాతీయస్థాయి రాజకీయాలకే పరిమితమైతే మాత్రం రాష్ట్రంలో ఆయనకు పరాభవం ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు అధికారమిస్తే తమ బతుకులు బాగుచేస్తాడన్న నమ్మకంతో... రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఆయన జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని భావించలేం. గత అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి తానే చైర్మన్‌గా జాతీయ రాజకీయాలకు అధిక సమయం కేటాయించే వారు. ఫలితంగా 1989 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఇలాగే ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రాంతీయ నేతలను కలుసుకుంటూ ఉండేవారు. రాష్ట్రం సంగతి చూడకుండా కేంద్రంతో యుద్ధం ఎందుకని భావించిన ప్రజలు 2019లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. వివిధ రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీల నాయకులు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నంత వరకు బలంగానే ఉన్నారు. జయలలిత వంటి నాయకురాలు కూడా జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌నే తీసుకుందాం! ఆయన మూడు పర్యాయాలుగా గెలుస్తున్నారు. స్వరాష్ట్రం గురించి తప్ప మిగతా విషయాలను ఆయన పట్టించుకోరు. కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు గానీ.. ఇప్పుడు తెలంగాణను వదిలేసి ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నారు.


ముఖ్యమంత్రి పదవిపైన మోజు పోయిందో, తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ తగ్గిందో తెలియదు గానీ.. జాతీయ రాజకీయాలలో తగ్గేదేలే అని తొడగొడుతున్నారు. ఉత్తరాది వారికి ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన జాతీయ నాయకుడిని అయిపోతానని కేసీఆర్‌ ఎందుకు భావిస్తున్నారో తెలియదు. అంతా కలిపి 17 లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ర్టానికి నాయకత్వం వహిస్తూ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకోవడం అవివేకమే అవుతుంది. కేంద్రంలో ప్రధాన భూమిక పోషించాలంటే సంఖ్య ముఖ్యం. 1989 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలోనే రెండంటే రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్న ఎన్టీఆర్‌ను ఫ్రంట్‌లో ఉన్న ఇతర నాయకులు లెక్కపెట్టలేదు. ఈ అనుభవాలు కేసీఆర్‌కు తెలియనివి కావు. అప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయినా కేసీఆర్‌ ప్రధాని మోదీతో తలపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోకుండా ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా మార్చినంత మాత్రాన నరేంద్ర మోదీని కదిలించడం సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీని కూడా జాతీయ పార్టీగా మార్చారు. తెలంగాణలో ఆ పార్టీ తన ఉనికినే కోల్పోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్మోహన్‌ రెడ్డి పుణ్యమా అని మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. అయినా రాష్ర్టాల పర్యటనకు వెళతానని ప్రకటించిన కేసీఆర్‌, తన వెంట కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకువెళ్లారో తెలియదు. అందుకే కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఎప్పుడూ మిస్టరీగానే ఉంటుంది. ఆయన ఎందరిని కలుసుకుంటారో, ఆశించినంత మంది ఆయనను కలుస్తారో లేదో వేచిచూద్దాం. అయినా టైం బాగోలేనప్పుడు బ్యాడ్‌ ఆలోచనలే వస్తుంటాయి. కేసీఆర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు.


పెద్దల సభకు ఎవరు?

ఈ విషయం అలా ఉంచితే, ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంపిక చేసిన నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందినవారు కావడం గమనార్హం. అవినీతి కేసులలో తన తరఫున వాదిస్తున్న తెలంగాణకు చెందిన నిరంజన్‌రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడం జగన్‌కే సాధ్యం! నలుగురిలో ఇద్దరు బీసీలేనని, తమ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గొప్పగా ప్రకటించుకున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఆదరణ పథకం కింద బీసీలకు స్వయం ఉపాధి కోసం పనిముట్లు ఇస్తే.. తాము బీసీలను ఉన్నత స్థానంలో కూర్చోబెడుతున్నామని సజ్జల గొప్పగా చెప్పారు. ఒకరిద్దరు వ్యక్తులకు పదవులు కట్టబెట్టగానే బీసీలంతా అభివృద్ధి చెందుతారన్న ఆయన అవగాహనకు జోహార్లు! బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధి పథకాలకు తోడ్పాటు ఇవ్వాలి గానీ తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీసీలు ఎలా బాగుపడిపోతారు? అలా అయితే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు దళితుడైన జీఎంసీ బాలయోగికి లోక్‌సభ స్పీకర్‌ పదవి కట్టబెట్టారు. బాలయోగికి పదవి లభించగానే దళితులందరూ అభివృద్ధి చెందారని సజ్జల అంగీకరిస్తారా? తాజాగా ఎంపిక చేసిన నలుగురినీ కలుపుకొంటే రాజ్యసభలో వైసీపీ బలం 9కి చేరుతుంది.


ఈ తొమ్మిది మందిలో దళితుల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. రాజ్యసభకు మళ్లీ 2024లోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు జగన్‌ అధికారంలో ఉంటారో లేదో తెలియదు. అంటే జగన్‌ హయాంలో దళితులకు ఒక్క చాన్స్‌ కూడా లభించనట్టే కదా? వైసీపీకి చెందిన తొమ్మిది మందిలో నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. తాజాగా ఎంపిక చేసిన ఇద్దరు బీసీలలో ఒకరు ఆర్‌.కృష్ణయ్య కాగా, మరొకరు బీద మస్తాన్‌ రావు. నిన్నమొన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆర్థికంగా బలవంతుడు. కృష్ణయ్య కూడా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. అప్పుడు ఆయనను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆర్‌.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా బీసీలు అందరూ కట్టగట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటువేయలేదు. అదేమిటోగానీ జగన్‌ రెడ్డికి తెలంగాణ పట్ల నిగూఢమైన ప్రేమ ఉంది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందేందుకు తన వంతుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని చంపేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు హైదరాబాద్‌లో లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉండటం వల్లనే వాటి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తుంటారని, తెలంగాణకు చెందిన వారిని సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా నియమించుకుంటారన్న అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది. అధికారాలు లేని పదవులను మాత్రమే బీసీలకు, ఎస్సీలకు కట్టబెడుతూ.. అత్యంత ముఖ్యమైన పదవులను తనవారికీ, తనకు ఉపయోగపడే వారికీ జగన్‌ కట్టబెడుతున్నారు. తెలంగాణకు పరోక్షంగా సహకరిస్తున్న జగన్‌కు ప్రత్యుపకారంగా హెటిరో ఫార్మా అధిపతి పార్థసారథి రెడ్డిని రాజ్యసభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారు. జగన్‌పై నమోదైన కేసుల్లో పార్థసారథి రెడ్డి సహ నిందితుడు. అంతేకాదు, విశాఖపట్నంలో పలు ఆస్తులకు ఆయన జగన్‌ బినామీగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉయభ కుశలోపరిగా ఉంటుందని పార్థసారథి రెడ్డిని రాజ్యసభకు కేసీఆర్‌ ఎంపిక చేశారని అంటున్నారు. తమను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు పార్థసారథి రెడ్డి, బీద మస్తాన్‌ రావు భారీగా ప్రతిఫలం ముట్టజెప్పారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్థసారథి రెడ్డి కార్యాలయంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు చేసినప్పుడు.. 500 కోట్ల రూపాయలకు పైగా నగదు లభించడం తెలిసిందే. ఈ కేసు ఆ తర్వాత ఏమైందో తెలియదు. అంత భారీ మొత్తంలో నగదు లభించినా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గమ్మున ఎందుకుందో తెలియదు.


అందుకే పెద్దవాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అంటారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి నివాసం, కార్యాలయాల్లో జరిపిన తనిఖీల్లో కూడా నగదు లభించింది. నగదు చెల్లింపులకు సంబంధించిన ఆధారాలు లభించినా తదుపరి చర్యలు లేవు. అంతటి సమర్థులు కనుకే పార్థసారథి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి వారిని కేసీఆర్‌, జగన్‌ పెద్దల సభకు పంపారేమో తెలియదు. రాజ్యసభకు ఎంపిక కావడానికి ఇప్పుడు క్రైటీరియా మారిపోయింది. ఉద్యమాలలో పాల్గొనవలసిన అవసరం లేదు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా అవసరం ఉండదు. డబ్బు ఉండి కేసులను మాఫీ చేయించుకోగల సమర్థులు ఎవరైనా ఆయా పార్టీల తరఫున రాజ్యసభ టికెట్‌ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. లోక్‌సభకు పోటీ చేసి గెలవాలంటే 75 కోట్లకు తక్కువ ఖర్చు కాదు. అంతచేసినా పదవీకాలం ఐదేళ్లే. అది కూడా లోక్‌సభ పూర్తికాలం కొనసాగితేనే. మధ్యంతర ఎన్నికలు వస్తే మూణ్నాళ్ల ముచ్చటే అవుతుంది. అదే రాజ్యసభ అయితే పదవీకాలం ఆరేళ్లు ఉంటుంది. అంతేకాదు, ప్రజలను ఓట్ల కోసం బ్రతిమలాడుకొనే అవసరం కూడా ఉండదు. పార్టీ అధినేతలను మచ్చిక చేసుకొని, వంద కోట్లు మనవి కావనుకుంటే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసమే మేమున్నామని ఎవరైనా అంటే నమ్మకండి ప్లీజ్‌!

ఆర్కే

రాజు లేడు.. యువరాజూ లేడు!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.