ల్యాప్‌టాప్‌ ఆశలు గల్లంతు

ABN , First Publish Date - 2022-06-29T05:42:07+05:30 IST

అమ్మ ఒడి పథకంలో ల్యాప్‌ టాప్‌లుకు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎనిమిది తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను ఇవ్వాలని నిర్ణయించింది.

ల్యాప్‌టాప్‌ ఆశలు గల్లంతు

ఉమ్మడి జిల్లాలో 45,784 మంది విద్యార్థులపై ప్రభావం

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

ఇవి ఇస్తే అమ్మ ఒడి ఇస్తారా ? ఎగ్గొడతారా ? 

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 28 : అమ్మ ఒడి పథకంలో ల్యాప్‌ టాప్‌లుకు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎనిమిది తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ల్యాప్‌ టాప్‌ల ఆశలు గల్లంతు కావడంపై విద్యార్థులు తీవ్ర అసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బైజూస్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు ఈ ఏడాది సెప్టెం బరులో 8వ తరగతి చదువుతున్న బాల బాలికలకు ట్యాబ్‌లను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 36,135 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేస్తారు. తరగతి గదుల్లో డిజిటల్‌ స్ర్కీన్లను, టీవీలను ఏర్పాటు చేసి పాఠ్యాంశాలను బోధిస్తారు. ఇవే ట్యాబ్‌లను విద్యార్థులు 9, 10 తరగతుల్లోను డిజిటల్‌ లెర్నింగ్‌కు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఏడాది ట్యాబ్‌లను అందుకునే విద్యా ర్థులకు వచ్చే ఏడాది అమ్మ ఒడి నగదు సాయాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ట్యాబ్‌ ఖరీదు బహిరంగ మార్కెట్‌లో గరిష్టంగా రూ.10 వేల వరకు ఉండవచ్చునని, అదే టోకుగా కొనుగోలు చేస్తే రూ.8 వేలకే లభిస్తాయని చెబుతున్నారు. కాగా అమ్మ ఒడి నగదు సాయం కింద తొలుత రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.రెండు వేలను మినహాయించుకుని, రూ.13 వేలను మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు ట్యాబ్‌ల పేరుతో మొత్తానికే ఎగ నామం పెట్టే అకకాశాలను తోసిపుచ్చలేమని చెబుతున్నారు.

నీరుగారిన ఆశలు 

అమ్మ ఒడి నగదు సాయాన్ని వద్దనుకునే 8, 9, 10, ఇంటర్‌ తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను ఇస్తా మని హామీ ఇచ్చిన ప్రభుత్వం విస్మరించింది. ఉమ్మడి జిల్లాలో 8–10 తరగతులు చదువుతున్న బాలబాలికల్లో 45,784 మంది ల్యాప్‌టాప్‌ల కావా లంటూ తమ అభీష్టాన్ని విద్యా శాఖకు తెలియజేశారు. ఇంటర్‌ తరగతులు చదివే విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల పట్ల ఆసక్తి కనబరిచిన వారి సంఖ్య ఇప్పటికీ జిల్లా అధికారులకు చేరలేదు. కాగా ల్యాప్‌టాప్‌ల భారాన్ని తగ్గించుకునేందుకు సంబంధిత విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.13 వేలను మాత్రం జమ చేసి మాట తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Updated Date - 2022-06-29T05:42:07+05:30 IST