ఇక అందుబాటులో ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-05-07T05:20:36+05:30 IST

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, మే6: ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

ఇక అందుబాటులో ఆక్సిజన్‌

 మంత్రి హరీశ్‌రావు చొరవతో సాకారం

 కరోనా తీవ్రమైన నేపథ్యంలో నిర్ణయం

 డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహణకు సిద్ధం

 ఉమ్మడి జిల్లాలో ఐదు ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు  

 త్వరలోనే స్థలాల ఎంపిక 


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, మే6: ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మెదక్‌ జిల్లాలో అధునాతనమైన ఐదు ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను నెలకొల్పడానికి అనుమతులు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకబృందాలు పర్యటించి ప్లాంట్ల కోసం స్థలాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో కీలకమైన  ఈ నిర్ణయం తీసుకున్నారు.  నిరంతరం ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్లాంట్లను సిద్ధం చేయాలని తలపెట్టారు. 

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా కేంద్రాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ పట్టణాల్లో ఈ ఆక్సిజన్‌ తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నారు. నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అయ్యే విధంగా మూడు జిల్లా కేంద్రాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక గజ్వేల్‌, జోగిపేట పట్టణాల్లోని ప్లాంట్లలో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ తయారయ్యేలా ప్లాంట్ల నిర్వాహణ చేపట్టనున్నారు. ఇక్కడే ఆక్సిజన్‌ను సిలిండర్లలో నింపి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యవసరం ఉన్నచోటుకు తరలించాలని ప్రణాళిక రూపొందించారు. 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నుంచి రోజుకు 200 సిలిండర్లు, 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నుంచి 100 సిలిండర్లను ఉత్పత్తి చేయనున్నారు. 


శరవేగంగా ఏర్పాటుకు చర్యలు

 ‘‘పీఎం కేర్‌ ఫండ్స్‌’’కు సంబంధించిన ఈ నిధులతో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో  ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపించడంతో మెదక్‌ జిల్లాకు ఐదు తయారీ కేంద్రాలు మంజూరైనట్లు తెలిసింది. మంజూరుతోపాటు అనువైన స్థలాలను కూడా గుర్తించాలని ఆయా జిల్లాల అధికారులకు సూచించారు. స్థలాలను పరిశీలించే బృందాలతో సమన్వయం చేసుకుని వెంటనే ప్లాంట్లను నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న పదిరోజుల్లోనే ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి కావాలని అప్రమత్తం చేస్తున్నారు. 


  సిద్దిపేటలో ఫలించిన ముందుచూపు

సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల జనరల్‌ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. అయితే ఇది ఆక్సిజన్‌ తయారీ ప్లాంటు కాదు. వేరేచోట తయారైన ఆక్సిజన్‌ను వాహనాల ద్వారా ఈ ప్లాంటుకు సరఫరా చేస్తున్నారు. దీని వల్ల సిద్దిపేట ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతను పూర్తిగా అధిగమించారు. 13వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటులోని ఆక్సిజన్‌తో 15 రోజుల పాటు పేషెంట్లకు నిరంతరం ఆక్సిజన్‌ అందిస్తున్నారు. దేశమంతా ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతుంటే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. మంత్రి హరీశ్‌రావు ముందుచూపు కారణంగానే రాష్ట్రంలోనే అధునాత ఆక్సిజన్‌ ప్లాంటు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొల్పారు. తాజాగా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఈ జిల్లాలో అందుబాటులోకి వస్తున్నందున.. ఇతర ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ కొరతను అధిగమించే అవకాశం ఉంది.



Updated Date - 2021-05-07T05:20:36+05:30 IST