మాస్క్‌ లేకుంటే జరిమానాలే

ABN , First Publish Date - 2022-06-28T14:07:48+05:30 IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు ధారణ తప్పనిసరి చేసిన ప్రభుత్వం..

మాస్క్‌ లేకుంటే జరిమానాలే

- కరోనా కట్టడికి పోలీసుల కృషి

- శబ్ధకాలుష్యం కలిగిస్తే కఠిన చర్యలు

- నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 27: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు ధారణ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఆ మేరకు బహిరంగ ప్రాంతాల్లో మాస్కు లేకుంటే జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేగాక మాస్క్‌ ధారణపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహనా ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పోలీసులు పలుచోట్ల ప్రచారం చేపట్టారు. కాగా మంగళవారం నుంచి బహిరంగప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగే వారికి జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. 


పెద్ద హారన్లుంటే కేసులు...

శబ్ధకాలుష్యాన్ని అరికట్టే దిశగా చెన్నై ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా శబ్ధకాలుష్యం కలిగించే హారన్లను వాహనాలకు వినియోగించరాదని విజ్ఞప్తి చేసింది. అలా అధికశబ్ధం కలిగించే హారన్లు కలిగివుండే వాహనచోదకులపైనా, వాటిని అమర్చిన మెకానిక్‌లపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు. చెన్నై ట్రాఫిక్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నుంచి జూలై 3వ తేది వరకు జరుగనున్న ‘శబ్ధ కాలుష్యం’పై అవగాహన ప్రచారాన్ని కమిషనర్‌ లాంఛనంగా ప్రారంభించారు. అశోక్‌పిల్లర్‌ జంక్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... నగరంలో శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టామన్నారు. శబ్ధ కాలుష్యంతో కలిగే అనర్ధాలపై విద్యార్థులో అవగాహన కల్పించేలా వ్యాసరచన పోటీలు, సంతకాల సేకరణ, ప్రతిజ్ఞ తదితరాలు చేపట్టనున్నామన్నారు. అలాగే, ముఖ్యమైన రోడ్ల సమీపంలో అవగాహన కల్పించేలా డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుకు చెన్నై కార్పొరేషన్‌ అనుమతి కోరామన్నారు. అధిక శబ్ధం వచ్చే హారన్లు ఏర్పాటుచేస్తే వాటి చోదకులకు, పరికరాలు అమర్చిన మెకానిక్‌లకు జరిమానా విధిస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.



Updated Date - 2022-06-28T14:07:48+05:30 IST