మాస్కు లేకుంటే రూ. 500 జరిమానా

ABN , First Publish Date - 2022-04-23T14:29:56+05:30 IST

నిన్నటి వరకూ మాస్కు తప్పనిసరనే నిబంధన తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ముంచుకొస్తున్న ముప్పును గ్రహించినట్లుంది. అందుకే మళ్లీ మాస్క్‌ ధారణను తప్పనిసరి చేయడంతో

మాస్కు లేకుంటే రూ. 500 జరిమానా

- కరోనా వార్డులు సిద్ధం చేయండి : ఆరోగ్యశాఖ

- ఐఐటీలో 30కి పెరిగిన కొవిడ్‌ కేసులు


పెరంబూర్‌(చెన్నై): నిన్నటి వరకూ మాస్కు తప్పనిసరనే నిబంధన తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ముంచుకొస్తున్న ముప్పును గ్రహించినట్లుంది. అందుకే మళ్లీ మాస్క్‌ ధారణను తప్పనిసరి చేయడంతో పాటు, బహిరంగప్రదేశాల్లో మాస్కు ధరించనివారికి రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ స్పష్టం చేశారు. మాస్కు ధారణ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వస్తున్న తరుణంలో, తాజాగా మద్రాస్‌ ఐఐటీలో 12 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సహా మొత్తం 2 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, మరో 18 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో, ఐఐటీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 30కి పెరిగింది. ఈ నేపధ్యంలో శుక్రవారం మద్రాస్‌ ఐఐటీ ప్రాంగణాన్ని రాధాకృష్ణన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐఐటీలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన 30 మందికి స్వల్ప లక్షణాలుండడంతో అక్కడే క్వారంటైన్‌లో ఉంచామని, అవసరమైతే వారి కి గిండిలోని కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌కు పంపిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని, అయినా ప్రజలు తప్పకుండా మాస్క్‌ ధరించాలన్నారు. జ్వరం,దగ్గు,జలుబు లక్షణాలుంటే సత్వరం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వస్తున్న వారు విధిగా నిబంధనలు పాటించాలన్నారు. పాజిటివ్‌ లక్షణాలున్న వారు ఆస్పత్రులకు వచ్చే అవకాశముండడంతో వైద్య సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1.8 లక్షల పడకలతో కరోనా వార్డులు సిద్ధం చేశామని, కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలోనూ 1.1 లక్షల పడకలున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ స్పత్రుల్లో 18 మంది మాత్రమే చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరు ఐసీయూలో, ఏడుగురు ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్నారన్నారు. అదే సమయంలో ఎలాంటి లక్షణాలు లేకుండా 256 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజూ సరాసరిన 4 వేలుంటుండగా, గురువారం మాత్రం 1.20 లక్షల మంది టీకా వేయించుకున్నారన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు, బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రాధాకృష్ణన్‌ శుక్రవారం కరోనా బాధితుల కోసం జీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఆక్సిన్‌ పరికరాలను పరిశీలించారు. 


8న మెగా వ్యాక్సినేషన్‌ శిబిరం: 

మంత్రి సుబ్రమణ్యం

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు వేగవంతం చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భారత్‌ సహా సింగపూర్‌, మలేసియా, బ్రిటన్‌ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందన్నారు. మద్రాస్‌ ఐఐటీలో పాజిటివ్‌ నిర్ధారణ వారిలో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల వారున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వస్తున్న వారి ద్వారా రాష్ట్రంలో కరోనా మళ్లీ ప్రవేశించిందని తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికమవుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే టీకా సరైన ఆయుధమన్న విషయాన్ని ప్రజలు గుర్తెరగాలని సూచించారు. మే 8వ తేది రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రత్యేక శిబిరాల్లో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని, మొదటి డోస్‌ వేయించుకోని 50 లక్షల మంది, రెండవ డోస్‌ వేయించుకోని 1.46 లక్షల మంది ఈ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.


వైద్య సిబ్బందికి మాస్కు తప్పనిసరి

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా వార్డులు సిద్ధం చేయాలని వైద్య విద్య డైరెక్టర్‌ నారాయణబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఉపకరణాలు, ఆక్సిజన్‌తో పాటు వైద్యులు, నర్సులకు అవసరమైన రక్షణ కవచాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్య కళాశాల ప్రాంగణాల్లో విద్యార్థులు అధికంగా గుమిగూడరాదని, యూజీ, పీజీ, నర్సింగ్‌ విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవడంతో పాటు రెండు మాస్క్‌లు  ధరించాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2022-04-23T14:29:56+05:30 IST