ఎన్నిదారులు వెతికినా అంతంతే ప్రగతి!

ABN , First Publish Date - 2022-09-21T06:08:44+05:30 IST

నవరత్నాల్లోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం పేదలందరికీ ఇళ్లు. అయితే రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా పలుచర్యలు చేపడుతున్నా ప్రయోజనం కనిపించటం లేదు.

ఎన్నిదారులు వెతికినా అంతంతే ప్రగతి!
కొత్తపట్నం మండలం అల్లూరు వద్ద పునాదుల్లోనే ఉన్న ఇళ్లు

జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు నత్తనడక

జగనన్న గృహాలకు బ్యాంకు రుణాలు 

రెడీమేడ్‌ దర్వాజాలు, కిటికీలు

అయినా స్పందన కరువు  

పారంభించినవి ఎక్కడివక్కడే!

నవరత్నాలు - పేదలకు ఇళ్లు పథకం ప్రహసనంగా మారింది. అధికారులకు చుక్కలు చూపెడుతోంది. జిల్లాలోని జగనన్న కాలనీల్లో జరుగుతున్న పక్కాగృహాల నిర్మాణాల్లో వేగాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని దారులు వెతుకుతూనే ఉంది. ఇప్పటివరకు సిమెంట్‌, స్టీల్‌, ఇసుక ఇస్తుండగా ఇప్పుడు నిర్మాణ సామగ్రి, రెడీమేడ్‌ కిటికీలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇలా ఎన్ని చర్యలు చేపట్టినా నిర్మాణాలకు గ్రహణం వీడటం లేదు. చాలీచాలని యూనిట్‌ విలువ.. ఇళ్లు నిర్మించుకోవాలంటే అప్పులు చేయాల్సి రావడం..  కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడం కూడా లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తోంది. రుణాలు ఇస్తామంటూ చేసిన ఆర్భాటం మాటలకే పరిమితమైంది. దీంతో జిల్లాలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు అడుగు ముందుకు వేయడం లేదు. అధికార యంత్రాంగం ఎంత కసరత్తు చేసినా కొంచెం కూడా ఫలితం కనిపించడం లేదు. 

ఒంగోలు నగరం, సెప్టెంబరు 20 : నవరత్నాల్లోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం పేదలందరికీ ఇళ్లు. అయితే రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా పలుచర్యలు చేపడుతున్నా ప్రయోజనం కనిపించటం లేదు. గత ప్రభుత్వం ఒక్కో పక్కాగృహ నిర్మాణానికి రూ.2.50లక్షలు లబ్ధిదారులకు అందజేయగా ప్రస్తుత ప్రభుత్వం రూ.1.80లక్షలే ఇస్తోంది. ఆనాటితో పోల్చి చూస్తే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోగా... అందుకు అనుగుణంగా నేటి ప్రభుత్వం యూనిట్‌ విలువను పెంచాల్సింది పోయి గతం కంటే రూ.70వేలు తగ్గించింది. ప్రస్తుతం ఇస్తున్న యూనిట్‌ విలువ సరిపోక వేలమంది ఇంకా ఇంటి నిర్మాణాలనే చేపట్టలేదు. పనులు ప్రారంభించిన లబ్ధిదారులు అనేకమంది అప్పులు తేలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను ఇప్పించి ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ముందుకు వచ్చే బ్యాంకుల ద్వారా పక్కాగృహాల పేదలకు ఇళ్ల రుణాలను ఇప్పించేందుకు సిద్ధమైంది. ఇటీవల కొత్తపట్నంలోని జగనన్న కాలనీని యూనియన్‌ బ్యాంకు అధికారులు సందర్శించారు. వారు రుణాలను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 


పూర్తయినవి 3,500!

జిల్లాకు రాష్ట్రప్రభుత్వం 69,360 పక్కాగృహాలను మంజూరుచేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు ప్రభుత్వం నుంచి ఇస్తుండగా ఉపాధి హామీ నిధుల నుంచి మరో రూ.30వేలు మంజూరు చేస్తున్నారు. దీంతో యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు అవుతుంది. పెరిగిన సిమెంటు, ఇటుక, స్టీల్‌ ధరలతో ప్రస్తుతం ఇళ్లు కట్టటమంటే గగనమవుతోంది. దీంతో ఏడాది క్రితం జిల్లాలో ప్రారంభించిన  69,360 జగనన్న ఇళ్లలో  కేవలం 3,,572 మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో 4,973 శ్లాబు దశలో ఉన్నాయి, 2,166 రూఫ్‌ దశకు చేరాయి. 7,530 గృహాలకు బేసుమట్టం వేశారు. మిగిలిన 28,687 ఇళ్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభమే కాలేదు. అలాగే కోర్టు కేసుల కారణంగా అసలు ప్రారంభం కానివి 22,427 కాగా, నిర్మాణాలకు ముందుకు రాని వారు 6,695మంది ఉన్నారు. ఇలా నవరత్నాలు-పేదల ఇళ్లు పథకం ప్రారంభమై రెండేళ్లు దాటినా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు అడుగు ముందుకు వేయడం లేదు. దీంతో ఎలాగైనా నిర్మాణాల వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం దొరికిన దారులన్నీ వెతుకుతోంది. 


పొదుపు సంఘాలకు అందని రుణాలు

జిల్లాలో జగనన్న కాలనీల్లో పక్కాగృహాల నిర్మాణాల్లో వేగాన్ని పెంచేందుకు గతంలోనే పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకుల నుంచి కానీ, కమ్యూనిటీ ఇన్వెస్టుమెంటు ఫండ్‌ నుంచి కానీ రూ.30వేల రుణాన్ని అందజేయాలని నిర్ణయించారు. అయితే పూర్తిస్థాయిలో ఈ రుణాలను కూడా ఇళ్లు నిర్మించుకుంటున్న అందరు పొదుపు మహిళలకు అందించలేదు. దీంతో జగనన్న ఇంటి నిర్మాణాలను ప్రారంభించిన పొదుపు సంఘాల మహిళలు కూడా మధ్యలోనే నిలిపివేశారు. రుణాల కోసం బ్యాంకులు, వెలుగు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు.


అల్యూమినియం దర్వాజాలు.. కిటికీలు..

జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు ఇప్పటివరకు గృహ నిర్మాణ శాఖ సిమెంటు, ఇసుక, స్టీల్‌ సరఫరా చేస్తోంది. అయితే ఇవి బేసుమట్టం వరకే సరిపోతోంది. మార్కెట్లో ఉన్న మెటీరియల్‌ రేటుకు, ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ విలువకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఇదే ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి, మధ్యలో నిలిచిపోవడానికి కారణమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం యూనిట్‌ ధరను పెంచకుండా ఇతరత్రా సౌలభ్యం అందిస్తామంటూ లబ్ధిదారులకు అనేక ఇతర మార్గాలు చూపెడుతోంది. అక్కడ కూడా రుణాలు అందకపోవటంతో నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. ఇప్పుడు తాజాగా గృహనిర్మాణశాఖ లబ్ధిదారులకు అల్యూమినియం దర్వాజాలు, కిటికీలు అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మెటీరియల్‌ అంతా జిల్లాకు చేరింది. జిల్లాలోని గృహ నిర్మాణశాఖ గోదాముల్లో అవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అపార్టుమెంట్లకు వినియోగించే రెండు దర్వాజాలు, రెండు కిటికీలు, ఒక చిన్న కిటికీని లబ్ధిదారులకు అందజేయబోతున్నారు. అయితే చెక్కతో చేసిన ధర్వాజాలనే స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తుంటారు.


నేల విడిచి సాము చేసినట్లుగా..

ప్రభుత్వం ఇచ్చే రెడీమేడ్‌ అల్యూమినియం కిటికీలు, దర్వాజాలను తీసుకునేందుకు లబ్ధిదారులు ఇష్టపడతారా అనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. గృహ నిర్మాణశాఖ అధికారులు అందజేయాలనుకుంటున్న రెండు దర్వాజాలకు రూ.5వేలు, రెండు కిటికీలకు రూ.4,800, వంటగది కిటికీ రూ.3,800 లబ్ధిదారుల బిల్లు నుంచి మినహాయించనున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కల్పించలేదు. నేటికీ అనేక లేఅవుట్లలో నీరు, విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము నిర్మాణానికి సరిపోవడం లేదు. వీటన్నింటినీ ప్రభుత్వం పట్టించుకోకుండా నేల విడిచి సాము చేసినట్లుగా లబ్ధిదారులకు పలువిధాలుగా తాయిలాలు ప్రకటిస్తోంది. అవి కూడా సక్రమంగా అందకపోవటంతో జిల్లాలోని జగనన్న కాలనీల్లో నిర్మాణాలు ‘ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్నట్లు ఉంటున్నాయి. 




Updated Date - 2022-09-21T06:08:44+05:30 IST