సీహెచ్‌సీలో అందని వైద్యం!

ABN , First Publish Date - 2021-02-20T03:54:45+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని వసతులతో ఏర్పాటు చేసిన వైద్యశాలలో మందులు, సిరంజ్‌లు లేవు.

సీహెచ్‌సీలో అందని వైద్యం!
బయట స్కానింగ్‌కు వెళుతున్న గర్భిణి

కాన్పునకు వస్తే బయట స్కానింగ్‌కు సిఫార్సు

ఇన్సులిన్‌ సిరంజ్‌లు లేక ఇక్కట్లు


ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 19: 

ఈ చిత్రంలో కనిపించే గర్భిణి పేరు అల్లూరి శాంతమ్మ. సీతారామపురం మండలం బసినేనిపల్లి. శుక్రవారం సీహెచ్‌సీకి కాన్పు కోసం వచ్చింది. గైనకాలజిస్టు లేకపోవడంతో స్కానింగ్‌ తీసే వారు లేరు. బయటకు వెళ్లి స్కానింగ్‌ తీసుకువస్తే పరిశీలించి కాన్పు చేస్తామని సిబ్బంది చెప్పారు. దీంతో ఆ గర్భిణి కాళ్లు ఈడ్చుకుంటూ బయటకు వెళ్లింది. 


ఈ చిత్రంలో కనిపించే ఇన్సులిన్‌ సిరంజ్‌ బయట తెచింది. ఈ చీటీ సీహెచ్‌సీలో రాసిఇచ్చింది. సీహెచ్‌సీకి శుక్రవారం పలువురు కుక్కకాటుకు గురైన బాధితులు వచ్చారు. వైద్యశాలలో ఇంజక్షన్‌ వేయించుకొనేందుకు నర్సు వద్దకు వెళ్లగా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ లేదని, బయటకు వెళ్లి తీసుకురావాలని చీటీ రాసిచ్చింది. దీంతో వారు కిలోమీటర్‌ దూరంలో బస్టాండ్‌ ప్రాంతంలో ఉన్న మెడికల్‌ షాపునకు వెళ్లి ఇంజక్షన్‌ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

 

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని వసతులతో ఏర్పాటు చేసిన వైద్యశాలలో మందులు, సిరంజ్‌లు లేవు. స్కానింగ్‌ యంత్రం ఉన్నా పరీక్షించే వారు లేరు. సిరంజ్‌ దగ్గర నుంచి ఇంజక్షన్‌, స్కానింగ్‌ పరీక్షలు వరకు బయటకు వెళ్ల్లి చేయించుకొని వస్తే పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు అంటున్నారు. దీంతో రోగులు చేసేదేమీ లేక అప్పులు చేసి ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. ఈ దుస్థితి మెట్ట ప్రాంతమైన ఉదయగిరి సీహెచ్‌సీలో నెలకొంది. వైద్యశాలలో కాన్పుల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులు పదేపదే చెపుతున్నా అది క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నెరవేరడంలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టకి పలుమార్లు తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో మెట్ట ప్రాంతంలో ఉన్న ఈ సీహెచ్‌సీలో అన్ని సేవలు అందేలా చూడాలని వేడుకొంటున్నారు.


సిరంజ్‌లు కొనుగోలు చేస్తాం : మాళవిక, వైద్యశాల సూపరింటెండెంట్‌

ఇన్సులిన్‌ సిరంజ్‌లు సెంట్రల్‌ డ్రగ్‌ కేంద్రంలోనే లేవు. వైద్యశాల అభివృద్ధి నిధులతో సిరంజ్‌లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతాం. స్కానింగ్‌ యంత్రం ఉన్నా గైనకాలజిస్టు లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేకపోతున్నాం. గైనకాలజిస్టును నియమించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.



Updated Date - 2021-02-20T03:54:45+05:30 IST