Advertisement

రాజధర్మం ఏదీ.. ఎక్కడ?

Sep 6 2020 @ 00:50AM

సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలనుకొనేవారు ఎంచుకునే మార్గాన్ని బట్టి వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. జగన్‌ రెడ్డి ఎంచుకొన్న మోడల్‌ ఆయన నిర్దేశించుకున్న దీర్ఘకాలిక లక్ష్యసాధనకు ఉపకరిస్తుందా? ఆయన అమలుచేస్తున్న విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయా లేదా? కక్షలూ, కార్పణ్యాలతో కూడిన రాజకీయాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా? వంటి ప్రశ్నలు ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర రాజకీయ రంగస్థలం హాట్‌జోన్‌గా మారడం వాంఛనీయమా? ముఖ్యమంత్రి విశ్వసనీయతతో పాటు రాష్ట్రం పరపతి పెరగడం అవసరమా? కాదా? అనే కీలక అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు కంటే జగన్‌ మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలందరికీ మేలు చేస్తారని జనం విశ్వసించారు. అయితే ఆచరణలో జరుగుతున్నది ఏమిటి?


గరీబీ హటావో అన్న నినాదాన్ని దివంగత ఇందిరాగాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదిమంది ప్రధానమంత్రులయ్యారు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు.. వెళ్లారు. అందరూ పేదల కోసమే బతికినట్టు చెప్పుకున్నారు. అదేంటోగానీ దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పేదరికం పెరిగింది. పేదరిక నిర్మూలన కోసం దశాబ్దాలుగా ఖర్చు చేసిన లక్షలాది కోట్లు ఏమైనట్టు? పేదలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న సంఖ్య అయినా తప్పై ఉండాలి లేదా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలైనా బూటకమై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులు పంచుతున్న జగన్‌మోహన్‌ రెడ్డి తన పదవీ కాలం ముగిసేసరికి రాష్ట్రంలో పేదరికం ఉండదని చెప్పగలరా? లేని పక్షంలో హేతుబద్ధత లేకుండా ప్రజల సొమ్మును పప్పుబెల్లాల్లా పంచిపెట్టి ఓట్లు కొనుగోలు చేసే హక్కు ముఖ్యమంత్రులకు ఎవరిచ్చారు? రాజకీయ నాయకులందరికీ ఈ ప్రశ్నలు సంధించని పక్షంలో దేశంలో పేదరికం అలాగే ఉంటుంది. మధ్య తరగతి వాళ్లు మాత్రం ఎవరికీ పట్టని బిడ్డలుగానే మిగిలిపోతారు!


తెల్లారిలేస్తే అప్పు చేయనిదే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడింది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్త కాదు. కాకపోతే అప్పు చేసి మరీ సంక్షేమ పథకం అంటూ ప్రజలకు డబ్బు పంచిపెట్టే కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో ఊపందుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో పేదల పేరిట సంక్షేమ పథకాలను విచ్చలవిడిగా అమలుచేస్తున్నారు. ఇందుకు కారణం దక్షిణాది రాష్ట్రాల ఆదాయం ఎక్కువగా ఉండటమే. తమిళనాడులో కరుణానిధి, జయలలిత హయాంలో పేదలకు మిక్సీలు, టీవీలు వంటి వాటిని పంచిపెట్టడం చూసి మనం ఆశ్చర్యపోయాం. పారిశ్రామికంగా తమిళనాడు అభివృద్ధి చెందినందున ఆదాయం పెరిగి ఉచిత పథకాలు అమలుచేసే వెసులుబాటు లభించింది. విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి‌ రెవెన్యూ లోటు ఎదుర్కొంటోంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎన్నికలకు ముందు పది వేల కోట్ల రూపాయల వరకూ అప్పు చేసి మరీ పసుపు–కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు పది వేల రూపాయలు వంతున పంచిపెట్టారు. ఇప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేతికి ఎముక లేదన్నట్టుగా ఆయన పేదల పేరిట డబ్బు పంచిపెట్టే కార్యక్రమాలకు తెర తీశారు. దీంతో అభివృద్ధీ– సంక్షేమం మధ్య సమతుల్యం దెబ్బతిని రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. జగన్‌ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచేసరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ దుస్థితి ఏర్పడుతోంది. వివిధ రాజకీయ పార్టీల వైఖరి కారణంగా మధ్య తరగతి ప్రజలు అనాథలవుతున్నారు.


సంక్షేమం పేరిట పేదల బాగోగులను ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. ఇక ధనవంతుల విషయానికి వస్తే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మేలు చేయకుండా ఉండదు కదా! మన దేశంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు సంపద సృష్టించడానికి ప్రాధాన్యమిచ్చేవారు. రాజకీయ పార్టీల విధానాల కారణంగా వారు కూడా వ్యక్తిగతంగా సంపన్నులు కావడానికే ప్రాధాన్యమిస్తున్నారు గానీ సంపద సృష్టి గురించి ఆలోచించడం లేదు. పిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాజకీయాలలో అతి కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. తెలుగునాట చంద్రబాబునాయుడు అతి పిన్న వయసులో, అంటే 45 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు పాతికేళ్ల తర్వాత అటువంటి అవకాశం జగన్‌మోహన్‌ రెడ్డికి లభించింది. 46 ఏళ్లకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పిన్న వయసులో ముఖ్యమంత్రి అయినవారు దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో కొనసాగే అవకాశం ఉంది. అలా జరగాలంటే వాళ్ల విజన్‌ చాలా ముఖ్యం. జగన్‌తో పోలిస్తే చంద్రబాబునాయుడు కొంత సులువుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్‌ కారణంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1995లో చంద్రబాబు చేతికి వచ్చింది. ఈ కారణంగా రాజకీయంగా నిలదొక్కుకోవడానికై ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శ్రమించారు. మొదటిసారిగా అభివృద్ధి మోడల్‌కు ప్రాధాన్యమిచ్చారు. దాని ఫలితమే నేటి సైబరాబాద్‌. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు.


అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ప్రదర్శించిన విజన్‌ కారణంగా రాష్ట్ర విభజన తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు గడిచేసరికి రాజశేఖర్‌ రెడ్డి తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. తండ్రీకొడుకుల చేతిలో ఓడిపోయిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరేమో! తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డిని మించి ఓట్లూ సీట్లూ సాధించి జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావాలన్నది ఆయనలో ఎప్పటి నుంచో ఉన్న కాంక్ష. అయితే ఆ పదవిని అందుకోవడానికి ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. అవినీతి కేసులలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్‌లో రాజసౌధాలను తలపించే లంకంత ఇళ్లు కట్టుకున్నప్పటికీ జగన్‌మోహన్‌ రెడ్డి వాటిలో పట్టుమని పది రోజులు కూడా ప్రశాంతంగా కంటినిండా నిద్రపోలేదు. సంవత్సరాల తరబడి జనంతో మమేకమై తిరిగారు. 2014లో ఓటమి ఎదురైనప్పటికీ కుంగిపోకుండా పాదయాత్ర పేరిట మళ్లీ జనంలో పడ్డారు. ఊహకు కూడా తట్టని వ్యూహాలతో చంద్రబాబును ఊహించని విధంగా దెబ్బకొట్టారు. దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. అది కూడా ఆషామాషీగా కాదు. యాభై శాతం ఓట్లు సాధించడంతో పాటు, 151 సీట్లు గెలుచుకున్నారు. దీంతో అంతులేని అధికారం ఆయన సొంతమైంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనను ప్రశ్నించేవారే లేకుండా పోయారు. వయసు రీత్యా ఉన్న అడ్వాంటేజ్‌ కారణంగా 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉండాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరైనా ఎంత కాలమైనా అధికారంలో ఉండవచ్చు.


అయితే సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలనుకొనేవారు ఎంచుకునే మార్గాన్ని బట్టి వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. జగన్‌ రెడ్డి ఎంచుకొన్న మోడల్‌ ఆయన నిర్దేశించుకున్న దీర్ఘకాలిక లక్ష్యసాధనకు ఉపకరిస్తుందా? ఆయన అమలుచేస్తున్న విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయా లేదా? కక్షలూ, కార్పణ్యాలతో కూడిన రాజకీయాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా? వంటి ప్రశ్నలు ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర రాజకీయ రంగస్థలం హాట్‌జోన్‌గా మారడం వాంఛనీయమా? ముఖ్యమంత్రి విశ్వసనీయతతో పాటు రాష్ట్రం పరపతి పెరగడం అవసరమా? కాదా? అనే కీలక అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇంతకుముందే చెప్పుకొన్నట్టుగా జగన్‌మోహన్‌ రెడ్డికి లభించిన అవకాశం అసాధారణమైనది. ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అన్న జగన్‌ విజ్ఞప్తిని ప్రజలు ఆలకించారు. చంద్రబాబు కంటే మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలందరికీ మేలు చేస్తారని జనం విశ్వసించారు. అయితే ఆచరణలో జరుగుతున్నది ఏమిటి? ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి రాజధర్మాన్ని పాటిస్తున్నారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి కాకముందు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి కూడా కోపం ఎక్కువగా ఉండేది. ఒక సందర్భంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద తనకు అడ్డుగా వచ్చిన ఒక అటెండర్‌ను ఆయన కొట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ సంఘటనను గుర్తుచేయగా ‘‘అధికారంలో లేనప్పుడు తప్పులు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అలా ప్రవర్తిస్తే సహించరు. అన్ని కులాలు, వర్గాలను సమ ధర్మంతో చూడాలి. అందుకే నన్ను నేను మార్చుకున్నాను’’ అని రాజశేఖర్‌ రెడ్డి బదులిచ్చారు. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా మండుటెండలో పాదయాత్ర చేసిన అనంతరమే రాజశేఖర్‌ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యుడు అయ్యారు. ఫలితమే ముఖ్యమంత్రి పదవి. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటించడం వల్లనే ఆయన 2009లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. 


 సంక్షేమ పులిపై స్వారీ!

ఇప్పుడు ఆయన కుమారుడైన జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేస్తున్నారో చూద్దాం! అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కసీ, పగతో రగిలిపోయారు. రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా తనను వ్యతిరేకించిన వారందరినీ టార్గెట్‌గా ఎంచుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబుపై దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన జగన్‌, ఆ విషయం మర్చిపోయి తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కూడా వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండేవారన్న అనుమానంతో వ్యాపార, పారిశ్రామికవేత్తలను కూడా వదలడం లేదు. వారి వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనుగడ ఉండదన్న భయాన్ని ప్రజానీకంలో సృష్టించారు. తన విధానాలను, నిర్ణయాలను విమర్శించే వారిపైకి నీలిబ్యాచ్‌ను ఉసికొల్పుతున్నారు. బూతులు తిట్టిస్తున్నారు. కిరాయి సైనికులతో తన ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయించుకుంటున్నారు. తనను అన్యాయంగా జైలుకు పంపారని బలంగా నమ్ముతున్న జగన్‌మోహన్‌ రెడ్డి ఆ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నాటి సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఉద్రేకానికి గురవుతున్నారట! ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. ఈ ధోరణుల వల్ల కొంత మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు దెబ్బతిన్నాయి. అయినా అవేమీ జనానికి పట్టకుండా ఉండేందుకుగాను సంక్షేమం అనే పదాన్ని జపించడం మొదలుపెట్టారు. సంక్షేమం మాటున ప్రత్యర్థుల వేటను కొనసాగించడంతో పాటు స్వపక్షానికి చెందినవారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి సరికొత్త వ్యూహాన్ని ఆవిష్కరించి అమలు చేస్తున్నారు. ఈ పెడధోరణులను కాసేపు పక్కన పెడితే ప్రభుత్వ విధానాలు అయినా ప్రగతి పథంలో సాగుతున్నాయా? అంటే అదీ కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనైనా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించని పక్షంలో అభివృద్ధి జరగదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందని రాష్ట్రాలు ఆర్థికంగా కుంగిపోతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడంలేదు. పరిస్థితి ఎంత దూరం వచ్చిందంటే, అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు మంజూరు చేస్తే ఆ డబ్బును కూడా సంక్షేమం పేరిట జగన్‌ ప్రభుత్వం పంచిపెడుతుందని ఆర్థిక సంస్థలు భయపడుతున్నాయి. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా విడుదల చేయలేదు. గతంలో కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే వరకు వేచి ఉండకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు సర్దుబాటు చేసేది. ఇప్పుడు ప్రభుత్వ ఖజానా ఒట్టిపోయింది కనుక ఆ పరిస్థితి లేదు. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడానికి వీలుగా జగన్‌ ప్రభుత్వం వివిధ సంస్థలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోంది. అయినా నిధులు ఇస్తే జనానికి పంచుతారన్న భయంతో సంబంధిత ప్రతిపాదనలన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు జమ కాగానే జగన్‌మోహన్‌ రెడ్డి వాటిని నవరత్నాల పేరిట పంచుతారన్న ప్రచారం ఢిల్లీ స్థాయిలో విస్తృతంగా వ్యాపించింది. కేవలం 15 నెలలకే లక్షా పదివేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అమలులో ఉన్న సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత ఉండకపోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరపతి ఎంతగా దెబ్బతిన్నదంటే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హడ్కో వంటి ఆర్థిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే రుణ ప్రతిపాదనలను ఆమోదించే ముందు ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారట. ఉద్యోగుల జీతాలనే విడతలుగా పదవ తేదీ వరకు చెల్లిస్తున్నారు. మితిమీరిన సంక్షేమ భారం రాష్ట్రం పాలిట గుదిబండ అవుతోంది. సంక్షేమం అనే పులిపై జగన్‌ స్వారీ చేస్తున్నారు. ఇది ఎంతకాలం సాగుతుందో చూడాలి! అప్పు చేసి పప్పుకూడు ఎంతకాలం అన్న ప్రశ్నలు ఇప్పుడిప్పుడే ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నాయి.


విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు, మద్యం ధరలు భారీగా పెంచడం పొదుగు కోసి  పాలు తాగాలనుకోవడమే అవుతుంది. ఉత్పాదక రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం వల్ల రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతుంది. ఆ పరిస్థితి ఏర్పడితే జీఎస్‌డీపీ పడిపోయి అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఫైనాన్షియల్‌ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ బాగుపడకపోయినా మరింత దిగజారకుండా ఉండాలంటే పేదలంటే ఎవరు? ఎంతమంది ఉన్నారు? సంక్షేమం అంటే ఏమిటి? సంతర్పణకు, సంక్షేమానికి తేడా ఉండదా? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం కొనసాగడం కోసం అవసరమైన ఓటు బ్యాంకును తీర్చిదిద్దుకోవడానికై ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా పంచిపెట్టవచ్చా? ఈ ధోరణిని సమాజమే ప్రతిఘటించాలి! నిజం చెప్పాలంటే, సంక్షేమంలో కూడా కొన్ని వర్గాలు వంచనకు గురవుతున్నాయి. దళితులు ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు. నవరత్నాల పేరిట డబ్బు పంచుతున్నామని చెప్పి ఎస్సీ సబ్‌ప్లాన్‌ కేటాయింపులు ఎత్తివేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల మంజూరు నిలిచిపోయింది. ఫలితంగా దళితులకు ఉన్నవి కూడా పోయాయి. మరోవైపు ఈ ప్రభుత్వం తమదే అని భావిస్తున్న దళితులకు గ్రామాలలో పెత్తందార్ల నుంచి పరాభవం ఎదురవుతోంది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. తల ఎగరేస్తే వీపులు పగలగొడతామంటున్నారు. విద్యావంతులైన దళితులు ఇప్పుడిప్పుడే వాస్తవాలను గ్రహిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెంపొందించాలన్న సదుద్దేశంతో ఏర్పాటుచేసిన డ్వాక్రా గ్రూపులను కూడా సంక్షేమం పేరిట నిర్వీర్యం చేస్తున్నారు. డ్వాక్రా మహిళలను సొంత కాళ్లపై నిలబడకుండా చేసి ప్రభుత్వ సాయం కోసం అర్రులు చాచేలా చేస్తున్నారు.


నాడు రాజశేఖర్‌ రెడ్డి ఫీజుల చెల్లింపులతో పాటు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయడంతో పాటు పెద్దఎత్తున జలయజ్ఞం చేపట్టి ప్రాజెక్టులను నిర్మించడం వల్లనే ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయని అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు తెరమరుగైంది. ప్రభుత్వ ప్రాధాన్యతలలో లేని ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిన మూడు ముక్కలాట కూడా మూలనపడింది. ఇదే పరిస్థితి కొనసాగితే 30 ఏళ్ల పాటు జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే సంగతి దేవుడెరుగు.. రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేసిందని జగన్‌ అండ్‌ కో విమర్శించారు. ఇప్పుడు ఏడాదికే లక్ష కోట్లు అప్పు చేశారు. ఇదే ఒరవడి కొనసాగితే మరో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయవలసి ఉంటుంది. అదే జరిగితే చేసే అప్పు పాత అప్పుల వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమాజం కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎప్పుడైనా ముప్పు ఏర్పడవచ్చన్న అభిప్రాయంతో జగన్‌ రెడ్డి ప్రస్తుత మోడల్‌ను ఎంచుకొని ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిజంగా కన్నెర్ర చేస్తే రాష్ట్రానికి అప్పు కూడా పుట్టదు. ప్రతిపాదిత నీటి ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. సంక్షేమ పథకాలకు కూడా నిధుల కొరత ఏర్పడుతుంది. అదే జరిగితే జగన్‌ రెడ్డికి ఉభయభ్రష్టత్వం ప్రాప్తిస్తుంది.


ప్రశ్నించాల్సిన సమయమిది!

అయినా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఎవరో అధికారంలోకి రావడం కోసం ప్రభుత్వ ఖజానాను గుల్ల చేసే పథకాలను అనుమతించాలా? అని మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అడ్డగోలు పథకాలతో ఇవాళ జగన్‌, రేపు మరొకరు ముఖ్యమంత్రులు కావొచ్చు. ముఖ్యమంత్రి కావడం వారి కోరిక కావచ్చు. ప్రజలకు ఒరిగేది ఏమిటి? రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టించి ఇవ్వకుండా వారిని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసేవారిని ప్రతిఘటించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. తెలుగునాట ప్రభుత్వ గణాంకాల ప్రకారం పేదల సంఖ్య పెరిగింది. జనాభాతో దాదాపు సమానంగా తెల్ల రేషన్‌కార్డులు ఉండటమే ఇందుకు నిదర్శనం. మరోవైపు ప్రభుత్వాలు చెబుతున్న అభివృద్ధి లెక్కలు చూస్తే స్వర్గం దివి నుంచి భువికి దిగివచ్చినట్టు అనిపిస్తుంటుంది. గత ప్రభుత్వాలు ప్రకటించిన లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు నిర్మించినట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే 30 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నట్టు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు.


భవిష్యత్తులో మరో ప్రభుత్వం ఏర్పడితే వాళ్లు కూడా లక్షల్లోనే స్థలాలు ఇస్తామని లేదా ఇళ్లు నిర్మిస్తామని చెబుతారు. గరీబీ హటావో అన్న నినాదాన్ని దివంగత ఇందిరాగాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పది మంది ప్రధానమంత్రులయ్యారు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు.. వెళ్లారు. అందరూ పేదల కోసమే బతికినట్టు చెప్పుకున్నారు. అదేంటోగానీ దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పేదరికం పెరిగింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులకు కూలీలు కూడా లభించడం లేదు. పేదరిక నిర్మూలన కోసం దశాబ్దాలుగా ఖర్చు చేసిన లక్షలాది కోట్లు ఏమైనట్టు? పేదలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న సంఖ్య అయినా తప్పై ఉండాలి లేదా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలైనా బూటకమై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులు పంచుతున్న జగన్‌మోహన్‌ రెడ్డి తన పదవీ కాలం ముగిసేసరికి రాష్ట్రంలో పేదరికం ఉండదని చెప్పగలరా? లేని పక్షంలో హేతుబద్ధత లేకుండా ప్రజల సొమ్మును పప్పుబెల్లాల్లా పంచిపెట్టి ఓట్లు కొనుగోలు చేసే హక్కు ముఖ్యమంత్రులకు ఎవరిచ్చారు? రాజకీయ నాయకులందరికీ ఈ ప్రశ్నలు సంధించని పక్షంలో దేశంలో పేదరికం అలాగే ఉంటుంది. మధ్య తరగతి వాళ్లు మాత్రం ఎవరికీ పట్టని బిడ్డలుగానే మిగిలిపోతారు!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.