పారిశుధ్య పనులకు పైసల్లేవ్‌!

ABN , First Publish Date - 2021-12-01T07:07:00+05:30 IST

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఊరూవాడా చిత్తడిగా మారాయి. పల్లెల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది.

పారిశుధ్య పనులకు పైసల్లేవ్‌!
ముండ్లమూరు మండలం ఈదరలో మురుగు మయంగా ఉన్న రోడ్డు

80శాతం పంచాయతీలకు ఆర్థిక వనరులు కరువు

15వ ఆర్థిక సంఘం నిధులనూ లాగేసుకున్న ప్రభుత్వం

తాజా వర్షాలతో పల్లెల్లో పరిస్థితి అధ్వానం

కనీసం బ్లీచింగ్‌ కూడా  చల్లలేని దుస్థితి

ఒంగోలు (కలెక్టరేట్‌), నవంబరు 30 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఊరూవాడా చిత్తడిగా మారాయి. పల్లెల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. వీధులు మురుగుమయమయ్యాయి. దీంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం పొంచి ఉంది. పారిశుధ్యం మెరుగునకు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉండగా పంచాయతీలకు నిధుల కొరత ప్రతిబంధకంగా మారింది. ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం లాగేసుకోవడంతో 80శాతం పంచాయతీల ఖాతాల్లో పైసా లేకుండాపోయింది.  సీజనల్‌ వ్యాధులు పొంచిన ఉన్న నేపథ్యంలో నెలకొన్న ఈ పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 


రూ.60కోట్లు లాగేసుకున్న ప్రభుత్వం 

జిల్లాకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.100 కోట్లు కేటాయించింది. అందులో సుమారు రూ.40 కోట్ల వరకూ వినియోగించారు. మిగిలిన రూ.60 కోట్లు  గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉండగా పది రోజుల క్రితం ప్రభుత్వం ఆ మొత్తాన్ని లాగేసుకుంది. దీంతో పంచాయతీల ఖాతాల్లో ఆ పద్దుకింద జీరో బ్యాలెన్స్‌ చూపిస్తోంది. నిరసన గా కొద్దిరోజుల నుంచి సర్పంచ్‌లు ఆందోళనలు చేస్తున్నారు. అయినా నిధుల విషయంలో స్పష్టత కరువైంది.


80శాతం పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులే ఆధారం

జిల్లాలో 1052 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 80శాతం పంచాయతీలకు ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. కేవలం ఆర్థిక సంఘం నిధులే ఆధారంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఇతర అవసరాలకు తీసుకోవడంతో ఆ గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది.  కనీసం పారిశుధ్య పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది.  15 రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పల్లెల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. అనేకచోట్ల చెత్త, మురుగు కలిసి దుర్గంధం వెదజ ల్లుతోంది. ఈ నేపథ్యంలో పారిశుధ్యం మెరుగుపర్చడం అటుంచి కనీసం బ్లీచింగ్‌ కొనుగోలుకు కూడా పంచా యతీల్లో పైసా లేకుండా పోయిం ది. దీంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు అప్పులు తెచ్చి పనులు చేయించారు. వాటికి బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఇప్పు డు మరలా పనులు చేయించడం తలకు మించిన భారం అవుతుందని వారు  వాపోతున్నారు. 





Updated Date - 2021-12-01T07:07:00+05:30 IST