భర్త ముగ్గురు పెళ్లాలను తేవాలని ఏ ముస్లిం మహిళ కోరుకోవడం లేదు: అసోం సీఎం

ABN , First Publish Date - 2022-05-01T22:34:21+05:30 IST

కట్టుకున్న భర్త ముగ్గురు పెళ్లాలను ఇంటికి తీసుకురావాలని ఏ ముస్లిం మహిళ..

భర్త ముగ్గురు పెళ్లాలను తేవాలని ఏ ముస్లిం మహిళ కోరుకోవడం లేదు: అసోం సీఎం

న్యూఢిల్లీ: కట్టుకున్న భర్త ముగ్గురు పెళ్లాలను ఇంటికి తీసుకురావాలని ఏ ముస్లిం మహిళ కోరుకోవడం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని ప్రతి ముస్లిం మహిళ కోరుకుంటోందని చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్‌‌కు అనుకూలంగా శర్మ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యూసీసీని కోరుకుంటున్నారని అన్నారు. తమ భర్తలు ఇళ్లకు ముగ్గురు భార్యాలను తేవాలని ఏ ఒక్క ముస్లిం మహిళ కోరుకోవడం లేదని, ముస్లిం మహిళలను మీరు అడిగితే ఇదే విషయం చెబుతారని అన్నారు. యూసీసీ అనేది తన సొంత విషయం కాదని, ఇది అందరి ముస్లిం మహిళలకు చెందిన అంశమని అన్నారు. ''త్రిపుల్ తలాఖ్ రద్దు తర్వాత వారికి న్యాయం జరగాలంటే యూసీసీని కేంద్రం ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది'' అని ఆయన స్పష్టం చేశారు.


అసోం జనాభాలో 30 శాతానికి పైగా ముస్లిం వర్గానికి చెందిన వారు ఉండగా, శర్మ ప్రకటనతో పాటు, యూసీసీని తీసుకురావాలని బీజేపీ నేతల ప్రయత్నాలను ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్‌గా మరికొందరు చూస్తున్నారు. మతం, లింగ బేధం, వివాహాలు, దత్తత, విడాకులు...ఇలా అన్ని అంశాల్లోనూ దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం యూసీసీ లక్ష్యంగా ఉంది. కోర్టుల్లో బహుభార్యత్వాన్ని సవాలు చేయలేని ముస్లిం మహిళలకు యూసీసీ వల్ల సాధికారికత లభిస్తుందని హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఈ  వాదనను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొట్టివేశారు. యూసీసీకి తాము వ్యతిరేకమని, యూసీసీపై ఆందోళనకు  బదులు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై తక్షణం దృష్టి సారించాలని, ఇండియాకు యూసీసీ అవసరం లేదని 'లా కమిషన్' కూడా చెప్పిందని అన్నారు.

Updated Date - 2022-05-01T22:34:21+05:30 IST