
ముంబై: మహారాష్ట్ర సంక్షోభానికి కేంద్ర బిందువైన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ట్రాక్ మారి యూటర్న్ తీసుకున్నారు. ‘శక్తిమంతమైన జాతీయ పార్టీ’ మద్దతు తమకు ఉందంటూ నిన్న పరోక్షంగా బీజేపీ (BJP) పేరు చెప్పిన షిండే.. ఒక్క రోజైనా గడవకముందే మాటమార్చారు. జాతీయ పార్టీ ఏదీ తమను సంప్రదించలేదని తాజాగా స్పష్టం చేశారు. ‘శివసేన రెబల్ గ్రూపునకు బీజేపీ మద్దతు ఉందా?’ అన్న ప్రశ్నకు షిండే మాట్లాడుతూ.. ‘‘శక్తిమంతమైన పార్టీ మా వెనక ఉందని చెప్పిన మాట వాస్తవమే. అంటే దానర్థం బాలాసాహెబ్ థాకరే (Balasaheb Thackeray), ఆనంద్ దిఘే (Anand Dighe) శక్తి మాకుందని’’ అని వివరణ ఇచ్చారు.
మరోవైపు, ముంబై సహా మహారాష్ట్ర (Maharashtra) వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. శివసైనికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగబోతున్నారన్న సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. కాగా, కుర్లాలోని రెబల్ ఎమ్మెల్యే మంగేష్ కుదాల్కర్ (Mangesh Kudalkar) కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ తదితరులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసమైన మాతోశ్రీ (Matoshree)కి చేరుకుని చర్చలు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి