రివ్యూ పిటిషన్‌లో పాత వాదనలు వద్దు

ABN , First Publish Date - 2022-08-19T06:30:13+05:30 IST

రివ్యూ పిటిషన్లు సమర్పించే సమయంలో పాతవి, తిరస్కరించిన వాదనలను తిరిగి ప్రస్తావించకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రివ్యూ పిటిషన్‌లో పాత వాదనలు వద్దు

55 ఏళ్ల నాటి భూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య


న్యూఢిల్లీ, ఆగస్టు 18: రివ్యూ పిటిషన్లు సమర్పించే సమయంలో పాతవి,  తిరస్కరించిన వాదనలను తిరిగి ప్రస్తావించకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పులో ఏవైనా తప్పులు ఉంటే చూపించాలే తప్ప, ఇతరత్రా కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 55 ఏళ్ల నాటి భూవివాదాన్ని పరిష్కరిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. భూ వివాదం విషయంలో రెండో రివ్యూ పిటిషన్‌ ఆధారంగా హైకోర్టు 2022లో ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామంలో భూమి యజమానుల వారసులు, రక్షిత కౌలుదార్ల వారసుల మధ్య 1967లో వివాదం మొదలయింది. రక్షత కౌలు హక్కులను వదులుకుంటున్నట్టు కౌలుదార్లు చేసిన వినతిని ఆమోదిస్తూ 1967లో షాద్‌నగర్‌ తహసీల్దారు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై కోర్టులో కేసులు నడిచాయి. అయితే కౌలు హక్కులను వారు వదులుకోలేదంటూ 2013లో హైకోర్టు తీర్పు ఇచ్చింది.


మొదటి రివ్యూ పిటిషన్‌లోనూ ఆ తీర్పునే ఖరారు చేసింది. అయితే అదనపు పత్రాలు ఉన్నాయంటూ రెండో రివ్యూ పిటిషన్‌ వేయడంతో భూ యజమానుల వారసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే వారు గతంలో సమర్పించిన పత్రాలనే మళ్లీ ఇచ్చారని, అయినా అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ ప్రత్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం రెండో రివ్యూ పిటిషన్‌ ఆధారంగా ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించింది.

Updated Date - 2022-08-19T06:30:13+05:30 IST