పార్కింగ్‌ ఏదీ..?

ABN , First Publish Date - 2022-07-06T06:40:41+05:30 IST

నగరంలో వాహనాలకు పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది.

పార్కింగ్‌ ఏదీ..?
అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌లో రోడ్డుపై నిలిపిన వాహనాలు

అక్రమంగా బహుళ అంతస్తు, వ్యాపార సముదాయాల నిర్మాణం
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు

కర్నూలు(న్యూసిటీ), జూలై 5: నగరంలో వాహనాలకు పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది. బహుళ అంతస్తు భవనాలు, వ్యాపార సముదాయాల వద్ద పార్కింగ్‌ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతు న్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం అవుతోంది. కొన్నిచోట్ల పార్కింగ్‌ స్థలాల్లో వ్యాపార దుకాణాలు నిర్మించుకోవడం వల్ల పార్కింగ్‌ సమస్య తీవ్రమైంది. నగరంలోని పార్కింగ్‌ స్థలాల్లో నిర్మాణం చేపట్టిన దుకాణాలు, భవనాలను తొలగించాలని సిటీ ప్లానింగ్‌ అధికారులు ఆరు నెలల కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. నోటీసులు అందుకున్న కొందరు దుకాణ, వ్యాపార సముదాయ యజమానులు స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ఎమ్మెల్యేతోపాటు స్థానిక కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.  ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నాలు చేస్తున్న అధికారులకు ప్రజాప్రతినిధులు అడ్డుతగిలితే ఎలా? అని  కొందరు ప్రశ్నిస్తున్నారు.

నగరంలో ప్రతి రోజు సుమారు 2 లక్షలకు పైగా వాహనాలు రోడ్ల మీద తిరుగుతుంటాయి. ద్విచక్ర వాహనాలు 70 వేలకు పైగా   తిరుగుతుంటాయి. ఈ వాహనదారులందరూ తమ బండ్లను రోడ్డపైనే నిలుపుతున్నాయి. నిబంధనల ప్రకారం దుకాణ సముదాయాల్లోని సెల్లార్లలో తప్పకుండా వాహనాల పార్కింగ్‌కు చర్యలు తీసుకోవాలి. ఈవిషయంపై సంబంధిత సిటీ ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నగర పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా అపార్టుమెంట్లు నిర్మించాలంటే సిటీప్లానింగ్‌ విభాగం, అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి తప్పకుండా అనుమతి తీసుకోవాలి. నగరంలో అబ్దుల్లా ఖాన్‌ ఎస్టేట్‌, గాయత్రిఎస్టేట్‌, పాతబస్టాండు, మించిన్‌బజార్‌, కంట్రోల్‌ రూమ్‌, అశోక్‌నగర్‌, సంతో్‌షనగర్‌ తదితరప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాలు ఉన్నాయి. చాలా చోట్ల వాహనాల పార్కింగ్‌ కోసం స్థలాన్ని కేటాయించలేదు. ప్రధానంగా అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌లో పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది. 


 పార్కింగ్‌ సదుపాయం కల్పించకుంటే చర్యలు

నగరంలోని పలుచోట్ల వ్యాపార సముదాయాల యజమానులు పార్కింగ్‌కు స్థలం కేటాయించకుండా నిర్మాణాలు చేపట్టారు. అలాంటి వాటిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
- ప్రదీ్‌పకుమార్‌, సిటీప్లానర్‌

చాలా ఇబ్బందిగా ఉంది

కుటుంబంతో షాపింగ్‌ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దుకా ణం ఎదుట వాహనం పార్కింగ్‌ చేయాలంటే భయంగా ఉంది. గతం లో దుకాణం బయట వాహనం పార్కింగ్‌ చేసి లోపలికి వెళ్లి వచ్చేసరికి వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. 
- రాజశేఖర్‌, ప్రైవేట్‌ ఉద్యోగి


Updated Date - 2022-07-06T06:40:41+05:30 IST