హైదరాబాద్‌లో బస్సులు ఖాళీ.. భారీగా పడిపోయిన ఆదాయం

ABN , First Publish Date - 2021-05-07T18:11:39+05:30 IST

నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీని కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరింత నష్టాల్లోకి

హైదరాబాద్‌లో బస్సులు ఖాళీ.. భారీగా పడిపోయిన ఆదాయం

  • తగ్గిన ప్రయాణికులు 
  • రోడ్లపైకి 40 శాతమే
  • రూ. 2.5 కోట్ల నుంచి రూ.70-80 లక్షలకు పడిపోయిన ఆదాయం

హైదరాబాద్‌ సిటీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీని కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరింత నష్టాల్లోకి నెట్టింది. రెండు వారాలుగా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో అధికారులు పలు రూట్లలో బస్సులను తగ్గించేశారు. గ్రేటర్‌జోన్‌లో మొత్తం 2,800 బస్సులుండగా, వాటిలో 40 శాతం బస్సులు మాత్రమే ప్రస్తుతం రోడ్లపైకి వస్తున్నాయి. వాటిలో కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కాస్త ప్రయాణికులు ఉంటున్నారని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.


జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో రోజూ సుమారు 20 లక్షల మంది ప్రయాణం సాగించారు. ప్రస్తుతం 7 నుంచి 8 లక్షల మంది మాత్రమే  వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకే బస్సులు డిపోలకు వెళ్లిపోవడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని ఓ డిపో మేనేజర్‌ తెలిపారు.


పడిపోయిన ఆదాయం

గ్రేటర్‌జోన్‌లో కొవిడ్‌ ముందు టికెట్‌ ద్వారా రోజుకు రూ. 3.5 కోట్ల వరకు ఉండేది. డిసెంబర్‌ నుంచి గ్రేటర్‌లో కేసుల సంఖ్య తగ్గడంతో పాటు షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు ప్రారంభం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో జనవరి, ఫిబ్రవరిలో రోజువారి ఆదాయం రూ. 2.5 కోట్ల వరకు చేరింది. ఒక్కసారిగా కొవిడ్‌ కేసులు పెరగడం, నగరంలో రాత్రి కర్య్ఫూ పెట్టడంతో గ్రేటర్‌ ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ. 70 లక్షల నుంచి 80 లక్షలకు పడిపోయింది. కరోనా ఉధృతి నేపథ్యంలో అత్యధిక మంది సొంత వాహనాల్లో ప్రయాణానికే ఇష్టపడుతున్నారు.


డిపోల వారీగా కొవిడ్‌ గ్రూప్‌లు

గ్రేటర్‌జోన్‌లో 29 బస్‌ డిపోలు ఉన్నాయి. ప్రయాణికుల మధ్యలో తిరుగుతూ కొవిడ్‌ బారిన పడుతున్న ఆర్టీసీ సిబ్బందిని రక్షించేందుకు ఆయా డిపోల పరిధిలో సిబ్బందితో కొవిడ్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ బారిన పడిన సిబ్బందికి అండగా నిలుస్తూ, వారికి చేయూతనందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన సుమారు 9 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్‌ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించినట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మిగిలిన సిబ్బందికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-07T18:11:39+05:30 IST