GHMC పోలీ‌స్‌స్టేషన్‌ ఏదీ.. నాలుగేళ్ల క్రితం తెరపైకి.. ఇంతవరకూ ఊసేలేదేం..!?

ABN , First Publish Date - 2022-05-15T14:07:13+05:30 IST

జీహెచ్‌ఎంసీలో (GHMC) ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకున్న పోలీ‌స్‌స్టేషన్‌

GHMC పోలీ‌స్‌స్టేషన్‌ ఏదీ.. నాలుగేళ్ల క్రితం తెరపైకి.. ఇంతవరకూ ఊసేలేదేం..!?

  • ప్రభుత్వానికీ ప్రతిపాదనలు
  • పడని ముందడుగు
  • అక్రమ నిర్మాణాల నియంత్రణ
  • ఆక్రమణల తొలగింపు లక్ష్యం
  • ఈవీడీఎంకు బాధ్యతలప్పగిస్తూ గతంలో కమిషనర్‌ ఉత్తర్వులు
  • అయినా ఆచరణకు నోచుకోని వైనం

అక్రమ నిర్మాణాల నియంత్రణ, అవాంతరాలు లేకుండా ఆక్రమణల కూల్చివేత లక్ష్యంగా జీహెచ్‌ఎంసీలో (GHMC) ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకున్న పోలీ‌స్‌స్టేషన్‌ (Police Station) ప్రతిపాదనలకే పరిమితమైంది. నాలుగేళ్లయినా ముందడుగు పడలేదు. దీంతో నగరంలో ఎప్పటిలానే అక్రమ నిర్మాణాల పరంపర కొనసాగుతోంది.


హైదరాబాద్‌ సిటీ : ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగా అనుమతి లేని నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటనలు గుప్పిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలు గుర్తించేందుకు డివిజన్ల వారీగా నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమితులైన ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. అ యినా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. ఇందుకు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, ఉద్యోగుల సహకారం, నిర్లక్ష్యమూ కారణం. పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడో, సామాజిక మాధ్యమాల ద్వారా పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు (Minister KTR) దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినప్పుడు మాత్రమే జీహెచ్‌ఎంసీ చర్యలకు ఉపక్రమిస్తోంది. అది కూడా స్వల్పంగా కూల్చివేసి వదిలేస్తున్నారు.


సీసీఎస్‌ తరహాలో..

ప్రస్తుతం జోనల్‌, సర్కిల్‌ స్థాయి అధికారులు అనుమతి లేని నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. మళ్లీ నిర్మాణాలు చేపడితే స్థానిక పోలీస్‌ స్టేషన్లలో రాజకీయ, ఒత్తిళ్లు, ఇతర కారణాలతో కేసు నమోదు చేయించడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టే వారి పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు భావించారు. పోలీస్‌ (Police) యాక్షన్‌ ద్వారా అక్రమ నిర్మాణాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం సీసీఎస్‌ (సైబర్‌ క్రైం స్టేషన్‌) తరహాలో జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఆక్రమణల తొలగింపు, అక్రమ నిర్మాణాల కూల్చివేత బాధ్యతలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి అప్పగిస్తూ 2018లో కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


జోన్ల వారీగా ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (Enforcement) బృందాలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తాయి. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు వారి దృష్టికి వస్తే... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆమోదంతో చర్యలకు శ్రీకారం చుడతాయి. యాక్ట్‌ ప్రకారం ముందు నోటీసులు ఇచ్చి అనంతరం కూల్చి వేయాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణదారులు, ఆక్రమణదారులపై కేసు మాత్రమే నమోదు చేసి.. దర్యాప్తు బాధ్యతలు స్థానిక పోలీ‌స్‌స్టేషన్లకు బదలాయించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక పోలీ‌స్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తే నిబంధనల కఠినంగా  అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనను గతంలోనే ప్రభుత్వానికి పంపారు. సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. డీజీపీ ఆమోదంతో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని భావించగా, ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. వాటర్‌బోర్డులో విజిలెన్స్‌ విభాగానికి ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఉంది.

Updated Date - 2022-05-15T14:07:13+05:30 IST