‘ధరణి’తో తీరే సమస్యలు కావు!

ABN , First Publish Date - 2022-06-28T06:13:27+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల విషయంలో ఎన్నో వాగ్దానాలు చేసింది. అసెంబ్లీలో చాలా ప్రకటనలు చేసింది. కానీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు....

‘ధరణి’తో తీరే సమస్యలు కావు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల విషయంలో ఎన్నో వాగ్దానాలు చేసింది. అసెంబ్లీలో చాలా ప్రకటనలు చేసింది. కానీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. ‘ధరణి’ వల్ల బాధితులందరికి ఉపశమనం దొరుకుంతుందని భావించారు. కానీ 2019లో చేర్చబడియున్న రికార్డుల ఆధారంగా ప్రతి రైతు తన భూమిని అమ్ముకోవచ్చు లేదా కొనుగోలు చేసుకోవచ్చు. రికార్డులో నమోదు కాబడిన విస్తీర్ణాలను యథావిధిగా కొనసాగించటం వలన ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికినీ, అలాగే కొనసాగుతూ వస్తున్నందున రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. అయినప్పటికినీ మ్యుట్యేషన్స్‌, వారసత్వ హక్కులు, దాన పత్రాలు, విల్‌డీడ్‌ల పనులకు ఎకరా ఒక్కంటికి రెవెన్యూ శాఖకు సర్వీసు ఫీజుగా రూ.2,750, పోస్టల్‌ చార్జీలు రూ.300, మార్కెటు విలువ ఆధారంగా 7.5 శాతం స్థానిక సబ్‌ రిజిష్ట్రారు కార్యాలయం వసూలు చేస్తుంది. ఈ రెండు శాఖల వసూళ్ళకు ఏ నిరసన లేకుండా చెల్లించటం ప్రజలకు అలవాటుగా మారింది. వ్యవసాయ పొలాలు జాయింట్‌ రిజిష్ట్రారు, తహశీల్దారు వద్ద; ప్లాట్లు, వ్యవసాయేతర భూముల కొనుగోళ్ల లావాదేవీలు సబ్‌ రిజిష్ట్రారు వద్ద జరుగుతున్నాయి. గతంలో జరిగే పనుల కంటే ఇప్పుడు బాగా జరిగిపోతున్నాయనే భ్రమలో జనం ఉన్నారు. ఇదివరకు ఉన్న అవకతవకలు లేవనుకుంటున్నారు. ప్రభుత్వం అంతా సక్రమంగానే జరుగుతున్నాయని చెప్పుకుంటుంది. వీఅర్‌వోలను, మధ్యలోని ఆర్డివోలను, జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేసారు. ప్రస్తుతం భూమి యాజమాన్య పద్ధతులు లావాదేవీల వ్యవహారాలు మారిపోయాయి. అంటే కొనుగోలు చేసిన వ్యక్తికి గంటలో ప్రొసీడింగ్స్, వారం రోజుల్లో పాస్‌ బుక్‌ చేతికందుతుంది.


ఏది ఏమైనా ఈ పనులు బాగానే జరిగిపోతున్నట్లుగా భావిస్తున్నాం. అమ్మిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తికి అన్ని కాగితాలు అందించినట్లుగా చెప్తారు. వచ్చిన చిక్కల్లా కొనుగోలు చేసిన వ్యక్తికి అన్ని తెలియపరచడు. ఏ లోసుగులున్నా వివరించడు. కొనుగోలు చేసిన వ్యక్తి భూమి దగ్గరకు వెళ్ళగానే అందులో కొంత ప్రభుత్వ భూమి, కొంత అటవీ భూమి, సీలింగ్‌ భూమి, కొన్ని ప్రక్క సర్వే నెంబరు పట్టాగా నమోదు అవుతుంది. ఇలాంటి మోసాలు కోకొల్లలుగా ఉన్నాయి. 2019కి ముందు ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఆర్‌.డి.ఓ లేదా సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేటు లేదా జాయింట్‌ కలెక్టర్ల వద్ద లభించేవి. ఇప్పుడు మీ సమస్యకు మీరే బాధ్యులు కాబట్టి మీకు దగ్గరలోని సివిల్‌ కోర్టుకు వెళ్ళమంటూ ఓ దబాయింపుతో కూడుకున్న ఉచిత సలహాను కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ‘ధరణి’కి ముందు ఆర్‌.వో.ఆర్‌, టెనెన్సీ కేసులు, ఇనాం కేసులు, కొన్ని సర్వే సంబంధింత కేసులు మొత్తం కలిపి 16,500 కేసులు తహశీల్దారు, ఆర్‌.డి.ఓ, జాయింట్‌ కలెక్టర్ల వద్ద పెండింగులో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి తాత్కాలిక ప్రాతిపదికన ఒక ట్రిబ్యునలుని అయితే వేసారు. అన్ని అధికారాలు కలెక్టర్‌గారికి ఇచ్చారు. ఆ కేసులన్ని పరిష్కరించడానికి నెల రోజుల గడువు ఇచ్చారు. కలెక్టర్‌గారు ట్రిబ్యునల్‌ అధికారి స్థాయిలో వారి పరిధిలోని మండల తహశీల్దారులకు ఇస్తూ ఈ కేసులను ఒక నెల రోజుల గడువు లోపల ఎదోఒకటి రాసి పంపమని ఆదేశించారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఒక్కో తహశీల్దారు వారికి పరిచయమున్న లాయర్లను, మాజీ రెవెన్యూ అధికారులను సంప్రదిందించి తీర్పులు రాసి కలెక్టరుకు పంపారు. ఇచ్చిన తీర్పులలో– కొన్ని సరైన రికార్డులు దాఖలు చేయలేదు కావున తిరస్కరిస్తున్నామంటూ, మరికొన్ని ఇందులో సంక్లిష్టమయిన అంశాలున్నాయి కాబట్టి మీరు సివిల్‌ కోర్టుకు వెళ్ళమంటూ ట్రిబ్యునల్‌ అర్డర్లను ఫైనల్‌గా నిర్ణయించారు. అన్నీ ఏకపక్ష తీర్పులే. చట్టాలు, కోర్టుల పద్ధతులను పాటించకుండా ఇదే ఫైనల్‌ అంటే ఇదెక్కడి న్యాయం. ట్రిబ్యుల్‌ ఆర్డరు కాపీలు చేతికందగానే అసంతృప్తిగా ఉన్న రైతులు కొందరు పైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆర్డర్లను చూసిన హైకోర్టు ధర్మాసనం ఇవేం ఆర్డర్లు మీరు కలెక్టర్లేనా? ఇరు పక్షాలకు నోటీసులు ఇవ్వకుండా నిర్ణయించడానికి మీరెవరు? అంటూ అసహనాన్ని వ్యక్తపరిచింది.


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని భూములన్నీ ఒక్క ఇంచు కూడా వదలకుండా సర్వే చేపడతాం, భూమి లెక్కలు తేల్చి రైతుబిడ్డలందరికీ వారి పాస్‌ పుస్తకం ప్రకారంగా లెక్క అప్పజెపుతాం అని హామీ ఇచ్చింది. కానీ అది ఇప్పటి పరిస్థితిలో జరిగేటట్లు కనపడటం లేదు. ‘ధరణి’లోని తప్పులను సరిదిద్దాలంటే 2019 నాటి పహాణీ కాపీని ప్రింట్‌ తీసి గ్రామాలకు వెళ్ళి గతంలో రెవెన్యూ సదస్సుల మాదిరి గ్రామ చావిడీ వద్ద కూర్చొని కచ్చా పహాణీని గ్రామస్థుల ముందు చదివి, వినిపించి సరిచేసినట్లయితే ఎనబై అయిదు శాతం పేర్లు, విస్తీర్ణాల సమస్యలు సరిచేయబడేవి. కాని ఇప్పుడు వీఆర్‌వోలు లేరు. మండల సర్వేయర్లు లేరు. ఇక ఈ పని కూడా జరగదని తేలిపోయింది. ప్రభుత్వం చాలా రోజులుగా ఊరిస్తున్నది, త్వరలో ధరణిలో కొన్ని మాడ్యూల్స్‌, ఆప్షన్స్‌ రాబోతున్నాయి అని చెపుతూనే ఉంది. తక్షణ సమస్యల వెసులుబాటుకు మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటైంది. పరిష్కార మార్గాలకు ధరణి ద్వారా మార్గం సుగమమైనట్లు సిఫారసులు వచ్చేసాయి అంటూ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి, ఆచరణలో ఇంత వరకు ఎలాంటి పనులు ముందుకు వెల్లడం లేదు. కానీ పరిష్కార మార్గాలు వచ్చేట్టుగా కూడా లేదు.


బిహారు రాష్ట్రం తన రాష్ట్ర ప్రజానీకానికి ఒక మంచి కానుక ఇచ్చింది. అది ‘బిహారు ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ చట్టం’. ఇవి అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటైనాయి, ప్రధాన కార్యాలయం పాట్నాలో ఉంటుంది. భూ సమస్యల పరిష్కారాలన్నిటికీ అక్కడ నిర్దిష్టమైన సమయం కేటాయించబడి ఉంది. అంటే కిందిస్థాయి అధికారి (తహశీల్దార్‌)గారి ఆర్డరుపై ఫిర్యాదులకు తొంబై రోజుల గడువు లోపల జిల్లా స్థాయిలోని ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ను సంప్రదించవచ్చు. ఈ ట్రిబ్యునల్స్‌ కూడా తొంభై రోజుల వ్యవధిలో సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి. అక్కడ పరిష్కారం కాని పక్షంలో రాష్ట్ర స్థాయికి వెళ్ళవచ్చు. నిజానికి బిహారు అనగానే ఇష్టారాజ్యంగా పాలన ఉంటుందనే అవగాహన మాత్రమే ఉంది కానీ, ఈ రాష్ట్రంలోని ట్రిబ్యునల్‌ వ్యవస్థ విజయవంతంగా నడుస్తుంది. బిహారులో ప్రజల సమస్యలు సులువుగా పరిష్కారమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా బిహారు తరహాలో శాశ్వత ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రైతుల భూ సమస్యలకు దారి చూపేందుకు ఇప్పుడు ఇలాంటి ఒక విస్తృత స్థాయి వేదిక అత్యవసరం. అన్ని పాత జిల్లాల కలెక్టరు కార్యాలయాలన్నీ జిల్లాలుగా విడిపోవడంతో బోసిపోతున్నాయి. వీటిని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి బిహారు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక చైర్మన్‌ను, ఒక మెంబరును, ఇద్దరు ముగ్గురు దిగువ స్థాయి సిబ్బందిని ఇస్తే చాలు, చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 


ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం, సంకల్పసిద్ధి ఇంకా ముఖ్యం. ‘ధరణి’తో ఒకటీ అరా మంచి జరుగుతున్నా, చాలా సమస్యలున్నాయి. ముందు ముందు ఇవి అసంఖ్యాకంగా పెరిగే ప్రమాదం ఉంది. భూమి ఉన్నంత వరకు సమస్యల కొలిమి రాజుకుంటూనే ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇద్దరు పై అధికారులను తొలగించడం బాధ్యతలను విస్మరించడమే అవుతుంది. అందుకే తక్షణ కర్తవ్యంగా తెలంగాణకు శాశ్వత ప్రాతిపాదికన తెలంగాణ ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు అవసరం ఉంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆర్డిఓ జాయింట్‌ కలెక్టరు వ్యవస్థను పునరుద్ధరించాలి. ఈ రెండూ విస్మరించిన పక్షంలో ఇటు రైతులు నష్టపోతారు, అటు ప్రభుత్వానికీ మంచిదికాదు. అందుకే తెలంగాణ ల్యాండ్‌ ట్రిబ్యునళ్ళను శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాటు చేయండి. దీనివల్ల రైతుకు, ప్రతి పట్టాదారుకు న్యాయం జరుగుతుంది. బిహారు మోడల్‌ పరిశీలన కోసం తెలంగాణ నుంచి ఒక బృందం వెళ్ళి కొంత పరిశీలన చేసి వచ్చిన తర్వాతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుంది.

వి. బాలరాజు

రిటైర్డు తహశీల్దారు

Updated Date - 2022-06-28T06:13:27+05:30 IST