పురం పనుల్లో పురోగతి ఏదీ..!

ABN , First Publish Date - 2022-06-22T06:21:41+05:30 IST

ప్రథమశ్రేణి పురపాకల సంఘంగా రాష్ట్రంలోనే పేరిన్నికగన్న ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు అటకెక్కాయి.

పురం పనుల్లో పురోగతి ఏదీ..!
మైనార్టీకాలనీలో సీసీరోడ్డుకు నోచుకొని రహదారి

  1. మూలుగుతున్న ఆర్థిక సంఘం నిధులు 
  2. ముందుకురాని కాంట్రాక్టర్లు 
  3. శివారు కాలనీల్లో మట్టి రోడ్లే గతి 

ఎమ్మిగనూరు, జూన 21: ప్రథమశ్రేణి పురపాకల సంఘంగా రాష్ట్రంలోనే పేరిన్నికగన్న ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు అటకెక్కాయి. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా పట్టణాభివృద్ధి మారింది. నిధులున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పురంలో ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది.


14వ ఆర్థిక సంఘం నిధులు ఇలా..

ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి 2015-16 నుంచి 2019-20 వరకు 14వ ఆర్థిక సంఘం కింద 136 పనులు రోడ్లు, డ్రైనేజీలు, నీటి పైపులైన్లు, ప్రహరీలతోపాటు మరికొన్ని పనులు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు గాను ప్రభుత్వం రూ.21 కోట్లు విడుదల చేసింది. నేటికి 85పనులు పూర్తికాగా ఐదు పనులు జరుగుతున్నాయి. రూ.13 కోట్లు విలువ చేసే పనులు ఇంకా మొదలే కాలేదు.


15వ ఆర్థిక సంఘం నిధులు ఇలా..

15వ ఆర్థిక సంఘం మొదటి విడత కింద 9 పనులకు (రోడ్లు, డ్రైనేజీలు)రూ.1.28 కోట్ల మంజూరుకాగా నాలుగు పనులకు జరుగుతున్నాయి. మిగతా ఐదు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అలాగే సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద రూ. 1.40 కోట్లతో పట్టణంలోని రెండు చోట్ల గార్బెజ్‌ స్టేషనలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఆ పనులు అలాగే ఉండిపోయాయి. రూ. 45 లక్షలతో మూడు రకాల బిన్స (చెత్తడబ్బాలు)మాత్రం పంపిణీ చేశారు. అలాగే పట్టణ శివారులోని బాబుజగ్జీవన రామ్‌ కాలనీలో పార్కు ప్రహరీ వాల్‌ నిర్మించేందుకు రూ. 29లక్షలు మంజూరు కాగా ఏడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు లేదు. అలాగే పట్టణంలోని గోనేగండ్ల రోడ్డులో ఉన్న హిందూ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించేందుకు రూ. 26లక్షలు మంజూరు కాగా ఈ పనులు చేసేందుకు ఓ కాంట్రాక్టరు ముందుకు వచ్చాడు. అలాగే 15వ ఆర్థిక సంఘం రెండో దశ (సెకండ్‌ ఫేస్‌) కింద 24 పనులు చేసేందుకు రూ.2.73కోట్లతో ఈఈ ప్రతిపాదనలు పంపారు. నిధులు ఎప్పుడు మంజూరవుతాయో.. ఎప్పుడు టెండర్లు పిలుస్తారో అర్థం కావడం లేదు.

జనరల్‌ ఫండ్‌ కింద

పట్టణంలో ఆయా ప్రాంతాల్లో జనరల్‌ ఫండ్‌ కింద ఆరు డ్రైనేజీలు నిర్మించేందుకు రూ.54 లక్షలు మంజూరు కాగా రెండు రోడ్లు పూర్తయ్యాయి. మిగతావి అలాగే ఉండిపోయాయి. అలాగే 12ీ ససీ రోడ్లు నిర్మించేందుకు రూ.1.52కోట్లు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు టెండర్లు ప్రారంభం కాలేదు. 


శివారు కాలనీల్లో మట్టిరోడ్లే గతి

శివారు కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం లేక ఆయా కాలనీల వాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మిలటరీ కాలనీ, తిరుమలనగర్‌, శివన్న నగర్‌, మైనార్టీ కాలనీ, లక్ష్మన టాకీస్‌ ప్రాంతాలతోపాటు ఆయా ప్రాంతాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

- కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌, ఎమ్మిగనూరు 

మున్సిపాలిటీలోని ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు టెండర్లు పిలుస్తున్నాం. జీడీపీ స్కీం పనులు, అర్బన హెల్త్‌సెంటర్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయి.  



Updated Date - 2022-06-22T06:21:41+05:30 IST