హైదరాబాద్‌లో కళ తప్పిన రంజాన్‌

ABN , First Publish Date - 2021-05-07T18:38:05+05:30 IST

రెండేళ్ల క్రితం వరకు రంజాన్‌ పండగ వస్తోందంటే

హైదరాబాద్‌లో కళ తప్పిన రంజాన్‌

హైదరాబాద్‌ సిటీ : రెండేళ్ల క్రితం వరకు రంజాన్‌ పండగ వస్తోందంటే నగరం కళకళలాడుతుండేది. కానీ, కరోనా కారణంగా గతేడాది, ప్రస్తుతం కళ తప్పింది. మరో వారం రోజుల్లో పండగ ఉండగా, అతి తక్కువ మంది మాత్రమే ఏర్పాట్లలో నిమగ్నం అవుతున్నారు. ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలను మాత్రం ముస్లింలు కచ్చితంగా పాటిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా పండగ ఉత్సాహం తగ్గిపోగా, ఈ ఏడాది రాత్రి కర్ఫ్యూతో పండగ శోభ తగ్గింది.


వ్యాపారాలు అంతంత మాత్రమే..

చార్మినార్‌, మదీనా, పత్తర్‌గట్టి, పటేల్‌మార్కెట్‌, గుల్జార్‌ హౌజ్‌, ఉస్మానియా బజార్‌, ఘాన్సీబజార్‌ ప్రాంతాల్లో మాత్రం ఈ ఏడాది కూడా సందడి కనిపిస్తోంది. అయితే రెండేళ్ల క్రితం వరకు రంజాన్‌ వేళ నెల రోజుల పాటు (రంజాన్‌ మాసం) ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించేవారు. వాహనాలను కూడా దారి మళ్లించేవారు. కేవలం పాదచారులను మాత్రమే అనుమతించేవారు. షాపులు, షోరూములతో పాటు రోడ్డు పక్కనే ఉండే చిన్న చిన్న షాపులు, తోపుడు బండ్ల వ్యాపారం కూడా రూ. కోట్లలో జరిగేది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వ్యాపారం లేదని అహ్మద్‌ అనే వ్యాపారి తెలిపారు. రెండేళ్ల క్రితం రంజాన్‌ మాసం తొలి 20 రోజుల్లో సుమారు రూ. 10 లక్షలకు పైగా వ్యాపారం చేసేవాడినని, ఈ ఏడాది 22 రోజులు గడిచినప్పటికీ రూ. 2 లక్షల వ్యాపారం కూడా కాలేదన్నారు.


సందర్శకులే అధికం

గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్లు తెరుచుకోలేదు. ఈ ఏడాది మార్కెట్‌లు తెరుచుకున్నప్పటికీ రాత్రి 8 గంటలకే షాపులు బంద్‌ చేయాలి. దీంతో ఇఫ్తార్‌ తర్వాత అధికంగా వచ్చే పాతబస్తీ వాసులు, మెహిదీపట్నం, టోలీచౌకీ, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌ వాసులు ఈ ఏడాది రావడం లేదని అక్బర్‌ చెప్పారు. కొద్దిగా జనం వస్తున్నప్పటికీ చూసేందుకే తప్పా కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిపారు. 


ఆ డబ్బుతో కొవిడ్‌ బాధితులకు అండగా..

పాతబస్తీ వాసులు ఈ ఏడాది షాపింగ్‌పై ఆసక్తి చూపకపోవడానికి ఎన్నో కారణాలున్నాయని ఓ మతపెద్ద వివరించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం ఏదో ఓ రకంగా కరోనాతో ప్రభావితమైంది. చాలా కుటుంబాల్లో పాజిటివ్‌లు రావడంతో వారి బంధువులు, సన్నిహితులు వారిని ఓదార్చడంలోనూ, స్వీయ జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాకుండా కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య కూడా అధికమే. అలాంటి కుటుంబాలు కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. దీంతో షాపింగ్‌ను పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా మసీదుల్లో, మతపెద్దల ద్వారా జరుగుతున్న ప్రచారంతో కూడా చాలామంది షాపింగ్‌లకు వెచ్చించాల్సిన డబ్బును పేద బాధితులు, కొవిడ్‌ రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు.

Updated Date - 2021-05-07T18:38:05+05:30 IST