ఎడారి దేశాల్లో అత్యాచారాలు అసంభవం

Sep 22 2021 @ 08:00AM

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విలాస జీవనానికి అందరూ ఆరాటపడుతున్న కాలమిది. అందులో భాగంగా మత్తుపదార్ధాల వినియోగం పెరిగిపోతోంది. మద్యం విక్రయాలు మరింతగా వర్థిల్లుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటున్న అశ్లీలంపై సమాజం మౌనం వహిస్తోంది. ప్రత్యేకించి యువతను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న మత్తుపదార్ధాల విక్రయంలో విద్యార్థులే విక్రేతలుగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అధికార, రాజకీయ ప్రముఖల అండతో పెరిగిపోతున్న పబ్‌ల సంస్కృతి సహజంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడిదారులకు మౌలిక సదుపాయాల వసతి, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు నగరంలో ఏ రుచులకు అనుగుణంగా ఏ పబ్‌లు ఉన్నాయో కూడ పెద్దలు చెబుతారని వినికిడి. 


సుదీర్ఘ సమయం పాటు ఇంటర్నెట్‌లో అశ్లీలవీక్షణ వల్ల ఉత్పన్నమయ్యే మానసిక, భావోద్వేగ పరిస్థితుల మధ్య క్షణికావేశంలో కొన్నిసార్లు యువత చేస్తున్న దుశ్చర్యలు సమాజానికి మచ్చ కలిగిస్తున్నాయి. బడాబాబుల పిల్లలు చదివే ప్రైవేటు విద్యా సంస్థ లలో గుట్టుగా జరిగే మత్తు వినియోగంపై మౌనంగా ఉండే సమాజం నగరశివార్లలో రిసార్ట్‌లలో నడమంత్రపు సిరివంత యువత చేసే విచ్చలవిడి రాసలీలలను కూడ ఫ్యాషన్‌గా భావిస్తోంది. విద్యార్థులు తమ తమ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలలో క్లబ్ డ్యాన్సుల తరహాలో చేస్తున్న నృత్యాలను, టీవీలలో ద్వంద్వార్థాలతో చేస్తున్న ప్రసారాలను వీక్షించి ఆనందించే ప్రజలు ఈ రకమైన వాతవారణంతో ప్రభావితమై మనిషి పశువుగా మారి ఒక అబలపై హత్యాచారం చేస్తే ఒక్కసారిగా అగ్రహావేశానికి లోనవుతోంది! సైదాబాద్‌లో చిన్నారి దుర్ఘటన సందర్భంగా కూడా ఇలాగే జరిగింది. ఎన్‌కౌంటర్ చేయాలని కోరింది. జొల్లు శివ, రాజు మొదలైన పేద నేరస్థులపై సమాజం కోపం ప్రదర్శిస్తోంది. 


గల్ఫ్‌లో పని చేసే వారి చిన్నారులపై స్వయాన బంధువులు పైశాచిక చర్యలకు పాల్పడితే కుటుంబ వ్యవహారమని విస్మరించిన ఇదే సమాజం, తాగిన మైకంలో ఔటర్ రోడ్డు ప్రమాదాలలో బడాబాబుల పిల్లలు మరణిస్తే పరామర్శకు పోటీపడుతోంది! ఈ నేపథ్యంలో సైదాబాద్ చిన్నారి దుర్ఘటన దేశంలోనే కాదు విదేశాలలోని భారతీయుల హృదయాలను కలచివేసింది. స్త్రీ సాధికారిత విషయంలో అరబ్ దేశాల పురోగతి ఏ రకంగా ఉన్నా మహిళల మాన ప్రాణ రక్షణ విషయంలో మాత్రం ప్రపంచంలో అగ్రభాగాన ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు లేదా లైంగికదాడులు ఇతర దేశాలతో పోల్చితే గల్ఫ్ దేశాలలో దాదాపు శూన్యమని చెప్పడంలో అతియోశక్తి లేదు. దుబాయి నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుంది. పరస్పర ఆమోదంతో దొంగచాటు శృంగారం సాధారణమే కానీ ఒక మహిళ అభీష్టానికి వ్యతిరేకంగా లేదా ఆమెపై బలవంతంగా లైంగిక ఆత్యాచారం జరపడం అనేది మాత్రం అతి అరుదైన విషయం. గల్ఫ్ అంతటా క్షణికావేశంలో హత్యలు జరగడం మామూలే కానీ అత్యాచారం జరగడం అనేది మాత్రం దాదాపుగా అసంభవం. చట్టాల పదును సంగతిని పక్కన పెడితే, శీఘ్రగతిన నిష్పాక్షికంగా కేసుల విచారణ జరిపే వ్యవస్థల సామర్థ్యం వల్ల నిందితులు తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడం నేరాల నియంత్రణకు ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. పైగా బూటకపు లేదా అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేస్తే కూడ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కారణాలు ఏమైనప్పటికీ ఈ రకమైన పరిస్థితులు భారత్‌తో సహా అనేక ఇతర దేశాలలో లేవు.


సౌదీ అరేబియాలో ఎలాంటి షీ టీంలు లేకున్నా ఒక మహిళ రాత్రిపూట తన విధులు ముగించుకుని ఒంటరిగా ఎటువంటి భయం లేకుండా ఇంటికి వెళ్ళగలుగుతుంది. ఖతర్లో సురక్షితంగా తన బిడ్డతో తిరిగినట్లుగా హైదరాబాద్‌లో తిరగడానికి ఒకింత వెనుకంజ వేస్తానని ఒక మిత్రురాలు చెప్పారు. దుబాయిలో పని చేసే ఒక మిత్రుడి కుమారుడు, బహ్రెయిన్‌లో ఇద్దరు మిత్రుల కుమార్తెలు పన్నెండవ తరగతి పూర్తి చేసుకున్నారు. ఈ ముగ్గురు కూడ పట్టభద్ర విద్యకై తమ పిల్లలను హైదరాబాద్‌కు పంపించాలని ఆరాటపడ్డారు. అయితే ఆ తర్వాత విరమించుకున్నారు. ఒకరు అయిష్టంగానైనా సరే, దుబాయిలోనే ఇంజినీరింగ్ చదివించడానికి మొగ్గు చూపగా మిగిలిన ఇద్దరు గత్యంతరం లేని పరిస్థితులలో తమ బిడ్డలను పాశ్చాత్యదేశాలకు పంపించారు. గల్ఫ్ దేశాలలో ఉన్నత విద్యావకాశాలకు పరిమిత అవకాశాలు ఉండడంతో ప్రతి సంవత్సరం అనేక మంది తమ పిల్లలను మాతృభూమికి పంపించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు! 


ప్రభుత్వాల పుణ్యమా అంటూ విరివిగా లభించే మద్యానికి తోడుగా చౌక వైటర్ నుంచి ఖరీదైన మాదకద్రవ్యాల వినియోగం గూర్చి మాట్లాడానికి మన తెలుగు సమాజం ఇంకా సమాయత్తం కాలేదు. సంస్కృతి, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే పంజాబ్ మాదకద్రవ్యాల గురించి మేల్కొనేసరికి చాలా ఆలస్యమయింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి మార్పు వెనుక మాదకద్రవ్యాల సమస్య కూడా ఉందంటే నమ్మవలసిన నిజం. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అంతమొందిస్తానని వాగ్దానం చేశారు. అయితే తరువాత ఆ దిశగా సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి పెరిగిపోయింది. ఆ అసంతృప్తి అంతిమంగా అమరీందర్ సింగ్ పదవీచ్యుతికి దారితీసింది.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.