Supreme Court : తీస్తా సెతల్వాద్‌కు బెయిలు తిరస్కరించడానికి కారణం లేదు : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-09-02T02:16:53+05:30 IST

యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ (Teesta Setalvad)కు బెయిలు తిరస్కరించడానికి

Supreme Court : తీస్తా సెతల్వాద్‌కు బెయిలు తిరస్కరించడానికి కారణం లేదు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ (Teesta Setalvad)కు బెయిలు తిరస్కరించడానికి తగిన కారణం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం పేర్కొంది. రెండు నెలల నుంచి ఆమెను గుజరాత్‌లో కస్టడీలో ఉంచడాన్ని తీవ్రంగా పరిగణించింది. గుజరాత్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాల సమయం ఎలా ఇచ్చిందని ప్రశ్నించింది. 


భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తుపై గురువారం విచారణ జరిపింది. బెయిలు మంజూరు చేయడానికి వీలు కానటువంటి నేరం ఈ కేసులో లేదని తెలిపింది. అది కూడా ఆమె ఓ మహిళ అని, రెండు నెలలకు పైగా జైలులో గడుపుతున్నారని, అయినప్పటికీ ఛార్జిషీటును ఇంకా దాఖలు చేయలేదని వ్యాఖ్యానించింది. 


సెతల్వాద్ బెయిలు దరఖాస్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇస్తూ, సమాధానం దాఖలు చేయడానికి సుదీర్ఘ గడువు ఇచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చెప్పినదానికన్నా ఎక్కువ ఏమీ ఎఫ్ఐఆర్‌లో లేదని పేర్కొంది. ఆమెను కస్టడీలో నిర్బంధించడంపై అనేక ప్రశ్నలను సంధించింది. ఆమె ఓ మహిళ అని, ఆమె బెయిలు పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇస్తూ, సమాధానం చెప్పడానికి ఆరు వారాల గడువు ఏ విధంగా ఇచ్చిందని ప్రశ్నించింది. ఓ మహిళ ఇలాంటి కేసులో ఉన్నట్లు, ఆరు వారాల గడువు ఇస్తూ హైకోర్టు నోటీసు ఇచ్చినట్లు ఉదాహరణ ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. 


జస్టిస్ లలిత్ మాట్లాడుతూ, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్‌లో బెయిలు మంజూరు చేయడానికి వీల్లేనటువంటి నేరం ఏదీ లేదని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం వంటివాటి క్రింద ఆరోపణలు నమోదు కాలేదన్నారు. ఇవన్నీ సాధారణ నేరాలని, తన పట్ల సానుకూలతను పొందేందుకు ఆమెకు ఓ మహిళగా అర్హత ఉందని తెలిపారు.


2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో బూటకపు పత్రాలను సృష్టించినట్లు తీస్తా సెతల్వాద్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె జూన్ 25 నుంచి కస్టడీలో ఉన్నారు. ఆమె బెయిలు దరఖాస్తుపై శుక్రవారం తదుపరి విచారణ జరుగుతుంది.


Updated Date - 2022-09-02T02:16:53+05:30 IST