NRIలకు షాక్.. NEETలో ఆ కోటాపై దుమారం?

ABN , First Publish Date - 2021-09-03T01:19:29+05:30 IST

ఎన్‌ఈఈటీ(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) విషయంలో తాజాగా ఓ వివాదం రాజుకుంటోంది. ఎన్నారైల కోటా విషయంలో కోర్టుల వరకు ఈ వివాదం..

NRIలకు షాక్.. NEETలో ఆ కోటాపై దుమారం?

న్యూఢిల్లీ: నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) విషయంలో తాజాగా ఓ వివాదం రాజుకుంటోంది. ఎన్నారైల కోటా విషయంలో కోర్టుల వరకు ఈ వివాదం చేరుకుంది. ఎన్ఈఈటీ పరీక్షకు ఎన్నారై కోటాలో దరఖాస్తు చేసుకున్న వారు ఇతర కోటాలకు అప్లై చేయకుండా తాజాగా ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ), కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులో మార్పులు జరిగాయి. ఈ మార్పుల నేపథ్యంలో ఎన్నారై కోటాలో నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర కోటాల్లో అప్లై చేసుకునేందుకు అనుమతి లేదు. అలాగే పై కోటాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్నారై కోటాలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి లేదు. ఈ నిర్ణయంపై అనేకమంది ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నారై కోటా అనేది కేవలం ఓ నియమం మాత్రమేనని, రిజర్వేషన్ కోటాలకు సంబంధం లేదని, ఆ రెండింటికీ ఎలా ముడిపెడతారని వారు ప్రశ్నిస్తున్నారు.


ఈ విషయంపైనే తాజాగా కేరళకు చెందిన రోహిత్ వినోద్ అనే విద్యార్థి కోర్టును కూడా ఆశ్రయించాడు. కువైత్‌లో నివశిస్తున్న రోహిత్ అక్కడి పౌరసత్వం కలిగి ఉన్నాడు. దీంతో అతడు ఎన్నారై కోటాలో దరఖాస్తు చేసుకోగా.. ఓబీసీ కోటా కనిపించకుండా పోయింది. కేవలం జనరల్ కోటా మాత్రమే కనిపిస్తోంది. దీంతో కోర్టును ఆశ్రయించాడు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, తనకు ఎన్నారై కోటాలో ఓబీసీ కోటా అప్లై చేసుకునేందుకు అనుమతివ్వాలని తన పిటీషన్‌లో కోరాడు. అయితే ఈ కేసులో ఎన్‌టీఏ కూడా తన తరపు వాదనలను బలపరుస్తూ అఫిడవిట్ సమర్పించింది. అందులో ఎంబీబీఎస్ విద్యకు సంబంధించి ఎన్నారైలకు ఓబీసీ కేటగిరీ వంటివి కల్పించడం సరికాదని పేర్కొంది. ఎన్నారైలకు వేరుగా కోటా ఉందని, అది ఉండగా వేరే కోటా అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఒక కోటాలో అప్లై చేస్తుండాగా, మరో కోటాలో అప్లై చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం కుదరదని పేర్కొంది.


అయితే ఈ కేసులో ఎన్నారై విద్యార్థి రోహిత్‌కు అనుకూలంగానే హైకోర్టు తీర్పునిచ్చింది. ఆగస్టు 13న వెలువరించిన తీర్పులో వెంటనే దరఖాస్తును మార్చాలని, రోహిత్‌కు రెండు కోటాల్లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్‌టీఏ, ఆరోగ్య శాఖలను ఆదేశించింది. కానీ సెప్టెంబరు 12న పరీక్ష జరగబోతున్నా ఇప్పటికీ కోర్టు తీర్పును ఎన్‌టీఏ అమలు చేయలేదని రోహిత్ తండ్రి కార్తికేయన్ ఆవేదన వ్యక్తం చేశారు.


కాగా.. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఎన్నారై విద్యార్థులు కూడా ఓబీసీ, ఇతర రిజర్వేషన్లు పొందేందుకు అనుమతివ్వాలని అన్నారు. అయితే ఈ విధంగా రెండు ఆప్షన్లు ఎంచుకున్న వారికి ఎన్నారై కేటగిరీలో లభించే ప్రయోజనాలు లభించవని పేర్కొన్నారు.

Updated Date - 2021-09-03T01:19:29+05:30 IST