YS Jagan Ongole Tour : స్పష్టత లేదు.. స్పందన లేదు.. Minister Balineni సిఫార్సుకి గ్రీన్ సిగ్నల్.. మిగిలిన నేతల సంగతేంటి సారూ..!?

ABN , First Publish Date - 2021-10-08T05:20:15+05:30 IST

ఒకటి అరా మినహా జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందన కరువైంది. ఒంగోలుకి సంబంధించి మంత్రి బాలినేని సిఫార్సుకి ఓకే చెప్పిన సీఎం మిగిలిన ప్రజాప్రతినిధుల వినతులను వినలేదు.. స్పందించనూ లేదు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం జిల్లాకు రావటం మూడో పర్యాయం. ఆరంభంలో నాడు-నేడు కార్యక్రమ ప్రారంభానికి ఒంగోలు వచ్చిన ఆయన అనంతరం ఒకసారి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల సందర్శనకు వచ్చారు. మూడవ సారిగా గురువారం ఒంగోలులో ఆసరా పథకం రెండవ విడత నిధుల చెల్లింపు కార్యక్రమ ప్రారంభానికి వచ్చారు. మంత్రి బాలినేని అలాగే జిల్లా యంత్రాంగం సభ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ స్వాగత ఏర్పాట్లులో మంత్రి సక్సెస్‌ అయ్యారు. యంత్రాంగం పొదుపు గ్రూపుల మహిళలను సమీకరించటంలోనూ సఫలమైంది. అయితే జిల్లాపరంగా చూస్తే కార్యక్రమం జిల్లావాసులను నిరాశకు గురిచేసిందని చెప్పవచ్చు.

YS Jagan Ongole Tour : స్పష్టత లేదు.. స్పందన లేదు.. Minister Balineni సిఫార్సుకి గ్రీన్ సిగ్నల్.. మిగిలిన నేతల సంగతేంటి సారూ..!?

  •  వెలిగొండ నికరజలాలపై ఊసేలేదు
  • బాలినేని సిఫార్సుకి ఓకే
  • మిగిలిన నేతలతో మాటకే అవకాశం లేదు 
  • మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం..స్పందించని మహిళలు 
  • దారి పొడవునా ఘనమైన స్వాగతం 
  • ముందస్తు అదుపులో విద్యార్థి నేతలు - మాదిగ దండోరా నేత అరెస్టు 
  • మా ప్రాంత ప్రజల గోడు వినలేదంటూ వైసీపీ నేతల గుసగుసలు 
  • చివరకు వచ్చాడు.. వెళ్లాడు అన్నట్లుందని విమర్శలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

రాకరాక జిల్లాకు వచ్చిన సీఎం జిల్లా సమస్యల విషయంలో ఇటు ప్రజలను, అటు అధికారపార్టీ ప్రజాప్రతినిధులను నిరాశకు గురిచేశారు. ఆయా ప్రాంతాల వారీ సమస్యలను వివరించి ఒకటో రెండో హామీలు పొందాలని ఉత్సాహంగా నివేదికలతో వచ్చిన నేతలకు ఆశాభంగం తప్పలేదు. ఇంకోవైపు వెలిగొండ టన్నెల్‌ పనుల పూర్తికి హామీ ఇచ్చినా, ప్రాజెక్టుని కేంద్రం గెజిట్‌లో చేర్చకపోవటంపై కానీ, సీమ ఎత్తిపోతల పథకాల ద్వారా సమస్య ఎదురవుతుందన్న అనుమానాలపై కానీ ఊసే ఎత్తలేదు. ఇతర సాగునీటి ప్రాజెక్టులు, పోర్టు అంశాన్ని మాట వరుసకు కూడా ప్రస్తావించ లేదు. అరగంటకుపైగా మాట్లాడిన ముఖ్యమంత్రి మహిళల పక్షపాతినని చెప్పుకునేందుకు, వారికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వల్లెవేసేందుకే పరిమితమయ్యారు. అయినా సభ చుట్టూ ఉన్న వైసీపీ క్యాడర్‌ కేరింతలు తప్ప సభలో కూర్చున్న మహిళలు ఏ ఒక్క సందర్భంలో కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇదే విషయం అధికారపార్టీ నేతల్లోను చర్చనీయాంశమైంది. మరోవైపు సమస్యలు వివరించే ప్రయత్నం చేస్తారనుకున్న విద్యార్థి సంఘ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సభ వద్దకు వచ్చి సమస్యల పత్రం ఇవ్వాలనుకున్న మాదిగ దండోరా నేతను గుర్తించి స్టేషన్‌కి తరలించారు. ఇతరత్రా వారి సమస్యలను వివరించేందుకు వచ్చిన ప్రజలను దూరంగానే కట్టడి చేశారు. ఇదీ గురువారం ఒంగోలులో సీఎం జగన్‌ పాల్గొన్న కార్యక్రమం తీరూతెన్నూ.


ఒకటి అరా మినహా జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందన కరువైంది. ఒంగోలుకి సంబంధించి మంత్రి బాలినేని సిఫార్సుకి ఓకే చెప్పిన సీఎం మిగిలిన ప్రజాప్రతినిధుల వినతులను వినలేదు.. స్పందించనూ లేదు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం జిల్లాకు రావటం మూడో పర్యాయం. ఆరంభంలో నాడు-నేడు కార్యక్రమ ప్రారంభానికి ఒంగోలు వచ్చిన ఆయన అనంతరం ఒకసారి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల సందర్శనకు వచ్చారు. మూడవ సారిగా గురువారం ఒంగోలులో ఆసరా పథకం రెండవ విడత నిధుల చెల్లింపు కార్యక్రమ ప్రారంభానికి వచ్చారు. మంత్రి బాలినేని అలాగే జిల్లా యంత్రాంగం సభ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ స్వాగత ఏర్పాట్లులో మంత్రి సక్సెస్‌ అయ్యారు. యంత్రాంగం పొదుపు గ్రూపుల మహిళలను సమీకరించటంలోనూ సఫలమైంది. అయితే జిల్లాపరంగా చూస్తే కార్యక్రమం జిల్లావాసులను నిరాశకు గురిచేసిందని చెప్పవచ్చు. తమ గోడు వినలేదన్న ఆవేదన అధికారపార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ వ్యక్తమైంది. వెలిగొండ అంశం బాలినేని ఒంగోలు నీటిసమస్య పరిష్కారానికి అడిగిన నిధులపై మాట్లాడటం తప్ప ఇతర త్రా జిల్లాలోని జరగాల్సిన, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. వేదికపై ముగ్గురు మంత్రులకు మినహా మాట్లాడే అవకాశం మరెవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాక ఆయనను కలిసి వినతిపత్రాలు ఇచ్చే అవకాశం ఇవ్వాలని కోరిన సంఘాల విజ్ఞాపనలనూ యంత్రాంగం తోసిపుచ్చింది. పైగా సభవద్ద హడావుడి చేస్తారని భావించిన ఆయా సంఘాల వారిని ముందస్తు అరెస్టులు, నిర్భంధాలతో కట్టడి చేశారు.


ఘన ఏర్పాట్లు.. బలవంతపు సమీకరణ

ఇలాఉండగా స్వాగత ఏర్పాట్లు, సభా నిర్వహణకు సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేయగలిగారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నుంచి వేదిక వరకు సీఎం కాన్వాయ్‌ సాగిన రెండువైపులా మహిళలు నిలబడి మహిళలు ఘనస్వాగతం పలికే ఏర్పాట్లు జరిగాయి. దీనిపై సీఎం అభినందించినట్లు చెప్తున్నారు. అయితే సభావేదిక చిన్నదిగా ఉండటం, సమీకరణకు మహిళలపై అధికారులు బలవంతపు ఆంక్షలు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. అయితే కార్యక్రమ నిర్వహణ  నిర్ణీత సమయంలోనే కార్యక్రమం ముగియటం పట్ల అధికారులు, సభకు వచ్చిన మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. 



వెలిగొండకు నికర జలాల అంశాన్ని ప్రస్తావించని సీఎం 

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది ఆగస్టుకి మొదటి టన్నెల్‌ని, 2023 ఫిబ్రవరికి రెండవ టన్నెల్‌ని పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ కేంద్రం వెలిగొండ ప్రాజెక్టుని గెజిట్‌లో చేర్చని అంశాన్ని కానీ రాయలసీమకు సంబంధించి కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకి నీటి సమస్య ఎదురవుతుందన్న అనుమానాలపై కూడా మాట్లాడలేదు. ఈ రెండు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి లేఖలు రాయటమే గాక ఢిల్లీ వరకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రాక సందర్భంగా మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంతో పాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ మరో లేఖ కూడా రాశారు. సభలో తొలుత మాట్లాడిన మంత్రి బాలినేని ఆ లేఖలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలపైన విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో, ఇప్పుడు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ కూడా చేశారు. అయితే సీఎం టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను ప్రస్తావించకపోవటం ప్రజలను నిరాశకు గురిచేసిందని చెప్పవచ్చు. అంతేగాక ఇక జిల్లాలోని ఇతర ఏ ప్రధాన సమస్యను కూడా ఆయన ప్రస్తావించలేదు. ఉదాహరణకు సాగర్‌ జలాల వినియోగం సమస్యను కానీ చివరికి రామాయపట్నం పోర్టు నిర్మాణ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదు. పైపెచ్చు ప్రసంగంలో మహిళా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను, పదవుల పంపిణీలో వారికి ఇచ్చిన అవకాశాలను వివరించేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన, చేయూత లాంటి పథకాలను ప్రధానంగా వివరించారు. దశలవారీ మద్యనిషేధం అంశాన్ని ప్రస్తావించారే తప్ప దానిపై వివరంగా మాట్లాడలేదు. అయితే ఈ అన్ని సందర్భాలలో సభలో ఉన్న మహిళల నుంచి పెద్ద సానుకూల స్పందన రాకపోవటం విశేషం. వేదిక చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు అడపాదడపా ఆయన ప్రసంగానికి స్పందిస్తూ కేరింతలు కొట్టారే తప్ప మహిళలు ఏ సందర్భంలోను చప్పట్లు కొట్టిన దాఖలాలు లేవు. అయితే నామినేటెడ్‌ పదవులు, స్థానిక సంస్థల పదవులలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చి 50శాతంపైగా పదవులను కట్టబెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ మహిళలపట్ల జగన్‌కున్న అభిమానాన్ని గుర్తించాలని పదేపదే కోరడం గమనార్హం. 

  వినతులపై స్పందన కరవు 

కాగా మంత్రి బాలినేని తన ప్రసంగంలో ఒంగోలులో రోజువారీ మంచినీళ్లు ఇచ్చేందుకు శాశ్వత పరిష్కారంగా రూపొందించిన పథకం అమలుకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని సీఎంను కోరారు. తన ప్రసంగం చివర్లో సీఎం వాసన్న కోరిన నీటిసమస్య పరిష్కారం కోసం రూ.400కోట్లను ఇస్తానని హామీఇచ్చారు. అయితే అంతకు ముందు జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా వారి ప్రాంత సమస్యలు చెప్పేందుకు విఫల యత్నం చేశారు. కొందరు హెలిప్యాడ్‌ వద్దే వినతిపత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే మరికొందరు వేదికపై వారి సమస్యల నివేదిక పత్రాలను ఇచ్చేందుకు చూశారు. వాటన్నింటినీ తీసుకోండంటూ పక్కనున్న తన సిబ్బందిని ఆదేశించారు. మంత్రి సురేష్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, అలాగే పలువురు ఎమ్మెల్యేలు సమస్యల పత్రాలను ఇచ్చే ప్రయత్నం చేశారు. అద్దంకి, కొండపి ఇన్‌చార్జ్‌లు కృష్ణచైతన్య, డాక్టరు వెంకయ్యలైతే పెద్ద నివేదికలనే ఆయన ముందుంచగా సిబ్బంది తీసుకున్నారు. వేదికపై ఎంపీ మాగుంట సత్కరించి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మాజీ మంత్రి శిద్దా, ఇతర కొంతమంది నాయకులు ఆయన దగ్గరకెళ్లి చెప్పే ప్రయత్నం చేసినా నవ్వుతూ పలకరించి పంపించారు. ఇక వేదికపై మంత్రులు బాలినేని, సురేష్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు మినహా ఎవరికీ మాట్లాడే అవకాశం రాలేదు. ఆ ముగ్గురిని కూడా నిర్ణీత సమయం ప్రకారమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు కనిపించింది. దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా రోజువారీ ఓ గంట సమయం తన వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కలిసేందుకు అవకాశం ఇచ్చేవారు. ప్రస్తుతం జగన్‌ని కలిసేందుకు అలాంటి అవకాశం లేదు. దీంతో ఈ సందర్భాన్ని వినియోగించుకుని తమప్రాంత సమస్యల గోడు వినిపించుకోవాలనుకున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిరాశకు గురయ్యారు.


ముందస్తు అరెస్టులు - వేదిక వద్ద కట్టడి 

ముఖ్యమంత్రికి ఏదో రూపంలో ఆయా వర్గాల వారి సమస్యలు వివరించాలన్న ఆలోచనతో ముందుకొచ్చిన పలు సంఘాల నేతలను ముందుగానే పోలీసులు కట్టడి చేశారు. విద్యారంగ సమస్యలకు సంబంధించి సీఎంకు వినతిపత్రం ఇస్తామని ముందుగా ప్రకటించిన ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల నాయకులనైతే రాత్రికి రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20మంది ఆ సంఘాల నాయకులు బుధవారం రాత్రి నుంచి గురువారం సీఎం సభ అయిపోయే వరకు అదుపులో ఉన్నారు. సభావేదిక వద్దకు వచ్చి దళితుల సమస్యలు వివరించే ప్రయత్నం చేసిన మాదిగ దండోరా నాయకులు సృజన్‌ మాదిగను పోలీసులు గుర్తించి హడావుడిగా పోలీసుస్టేషన్‌కి తరలించారు. ఇక వివిధ ప్రజాసంఘాల వారు ముందస్తు అనుమతులు కోరినా ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. సభావేదిక వద్ద ఒక పక్కకు వచ్చి వినతిపత్రాలు ఇవ్వాలంటూ చేతులూపిన వారిని పోలీసులు చెయ్యెత్తకుండా నోరు విప్పకుండా చేయగలిగారు.

Updated Date - 2021-10-08T05:20:15+05:30 IST