విరాట్ కోహ్లీ- రోహిత్‌శర్మ మధ్య విభేదాలపై స్పందించిన చేతన్ శర్మ

ABN , First Publish Date - 2022-01-02T00:19:28+05:30 IST

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ రోహిత్‌శర్మ మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై

విరాట్ కోహ్లీ- రోహిత్‌శర్మ మధ్య విభేదాలపై స్పందించిన చేతన్ శర్మ

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ రోహిత్‌శర్మ మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై చీఫ్ సెలక్టర్ చేతన్‌శర్మ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం జట్టును ప్రకటించిన అనంతరం వర్చువల్ సమావేశంలో మీడియాతో మాట్లాడిన చేతన్‌శర్మ.. కోహ్లీ, రోహిత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తలను కొట్టిపడేశాడు. ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో వారిద్దరిని కూర్చోబెట్టి పరిస్థితులను చక్కదిద్దేందుకు బీసీసీఐ వద్ద ఏమైనా ప్రణాళిక ఉందా? అన్న ప్రశ్నకు చేతన్ శర్మ బదులిస్తూ.. ‘‘అలా చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ఎదురు ప్రశ్నించాడు. అంతా సవ్యంగానే ఉందని, అందుకనే తాను రూమర్లను నమ్మొద్దని చెబుతానని అన్నాడు. వారి మధ్య ఏమీ లేదని పేర్కొన్న చేతన్‌శర్మ.. తామంతా తొలుత క్రికెటర్లమేనని, ఆ తర్వాత సెలక్టర్లమయ్యామని గుర్తు చేశాడు.

 

‘‘వారిద్దరి గురించి వచ్చిన వార్తలను చూసినప్పుడు కొన్నిసార్లు నవ్వొస్తుంది. వారి మధ్య మంచి ప్లానింగ్ ఉంది. సంబంధాలు చక్కగా ఉన్నాయి. మీరు కనుక నా స్థానంలో ఉండి ఉంటే జట్టుగా వారు ఎంత చక్కగా కలిసి పనిచేస్తున్నారో చూసి ఆనందించేవారు. ఓ జట్టుగా, కుటుంబంగా, బృందంగా కలిసిపోయారు. అలాంటి వారిపై ఇలాంటి ఊహాగానాలు రావడం బాధాకరం. కాబట్టి దయచేసి 2021 వివాదాలను వదిలేయండి. వారిని అత్యుత్తమ జట్టుగా ఎలా తయారుచేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం’’ అని చేతన్‌శర్మ పేర్కొన్నాడు. 


వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి ముందు మాటమాత్రమైనా చెప్పలేదన్న కోహ్లీ వ్యాఖ్యలపై చేతన్‌శర్మ స్పందిస్తూ.. కోహ్లీ మాటల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదన్నాడు. బీసీసీఐలోని సెలక్టర్లు సహా ఆఫీస్ బేరర్లు, ఇతర సిబ్బంది కోహ్లీని కలిసి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరినట్టు చెప్పాడు. అంతేకాదు, టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు రిటైర్మెంట్ విషయాన్ని బయటపెట్టవద్దని కోరినట్టు తెలిపారు. అయితే, అదేమీ పట్టించుకోని కోహ్లీ ప్రపంచకప్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడని గుర్తు చేశాడు.


ఈ నిర్ణయంపై పునరాలోచించమని చెప్పామని పేర్కొన్న చేతన్ శర్మ.. టీ20 పగ్గాలు వదిలేస్తే వన్డే జట్టు సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని అప్పుడు కోహ్లీతో చెప్పాలనుకోలేదని, దీంతో కోహ్లీ అపార్థం చేసుకున్నాడని వివరించాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించినట్టు చెప్పాడు. కెప్టెన్‌గా ఎవరు ఉన్నా జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు. వన్డే జట్టు కెప్టెన్సీపై కోహ్లీకి, బీసీసీఐకి మధ్య ఎలాంటి వివాదమూ లేదని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరాడు.  

Updated Date - 2022-01-02T00:19:28+05:30 IST