రబ్బరూ కాదు... స్టాంపూ కాదు!

ABN , First Publish Date - 2022-06-29T05:58:26+05:30 IST

స్వాతంత్ర్య దిన అమృతోత్సవాల వేళ మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా ఉండటం – మహిళా సాధికారతతో పాటు సామాజిక న్యాయసాధన దిశలో...

రబ్బరూ కాదు... స్టాంపూ కాదు!

స్వాతంత్ర్య దిన అమృతోత్సవాల వేళ మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా ఉండటం – మహిళా సాధికారతతో పాటు సామాజిక న్యాయసాధన దిశలో భారత్‌ సాధించిన, సాధిస్తున్న గొప్ప విజయానికి తార్కాణంగా నిలిచిపోనున్నది. విపక్షాలు కిందుమీదులై యశ్వంత్‌సిన్హాను రంగంలోకి దించినప్పటికీ, అది ఉనికి చాటుకొనే ప్రయాసే తప్ప మరేమీ కాదు.


బీజేపీ పక్కా వ్యూహంతోనే గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికి తన అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల రాజకీయాలకు సంబంధించినంత వరకు ఇది మాస్టర్‌ స్ర్టోక్‌! 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8.6 శాతం గిరిజనులు ఉన్నారు. పట్టణ ప్రాంతాలకన్నా గ్రామసీమలే గిరిజనుల పట్టుగొమ్మలు. ఈశాన్యంలోని మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో దాదాపు 40 నుంచి 90 శాతం దాకా ఆదివాసీలు ఉన్నారు. క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేజారిన ఛత్తీస్‌గఢ్‌లో 30.6 శాతం వరకు ఉన్న గిరిజనులు ఈసారి కమలం పార్టీకి జైకొట్టవచ్చు. 26.2 శాతం దాకా ఆదివాసీలు ఉన్న జార్ఖండ్‌ రాష్ట్రం కూడా బీజేపీకి ముఖ్యమే. 22.8 శాతం గిరిజనులను కలిగి ఉన్న ఒడిశాలోనూ బీజేపీ బలపడే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లోని 21.1 శాతం, రాజస్థాన్‌లోని 13.5 శాతం గిరిజనులూ బీజేపీ వైపే మొగ్గుచూపవచ్చు. అన్నింటికీ మించి రానున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి గొప్ప ప్రయోజనం చేకూరే సూచనలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని 14.8 శాతం గిరిజనులు ఈసారి పూర్తిగా బీజేపీకి అండగా నిలబడవచ్చు.


ఇది సిద్ధాంతపరమైన పోరాటమని అంటున్న యశ్వంత్‌సిన్హా, ఆయనకు వంతపాడుతున్న కాంగ్రెస్‌, మమత గుంపు పార్టీల నాయకులు రబ్బరు స్టాంపు రాష్ట్రపతి మనకు అవసరం లేదంటున్నారు. బీజేపీ మాజీ నాయకుడిని వెతికిపట్టడం తప్ప, సొంత అభ్యర్థిని సైతం పోటీకి నిలబెట్టలేకపోయిన ఆ పార్టీలు ఏ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాయన్నది అంతుపట్టని విషయం.


నేరుగా ద్రౌపది ముర్ము దక్షత మీదే సందేహాలు లేవదీస్తున్నారు విపక్షీయులు. వారికి ఇటీవలి చరిత్ర కూడా అంతగా తెలియదనిపిస్తోంది. 2017 నాటి మాట ద్రౌపది ముర్ము జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్నప్పటి సంగతి. ఛోటా నాగ్‌పూర్‌ కౌలుదారీ (సీఎన్‌టీ), సంథాల్‌ పరగణ కౌలుదారీ (ఎస్‌పీటీ) చట్టాలను సవరించాలని రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. కానీ, జార్ఖండ్‌లోని గిరిజనుల్లో దానిపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారి మనోభావాల్ని గుర్తించిన ఆమె, ఆ ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిప్పికొట్టారు. ఆమె పరిపాలన సామర్థ్యమేమిటో ఆనాడే స్పష్టమైపోయింది.


రాష్ట్రపతి పదవి కేవలం రబ్బరు స్టాంపు వంటిదే అన్నది– పూర్తిగా సమర్థించలేని మరో వాదన. భారత రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలు ఉండవు. జర్మనీ, ఇజ్రాయెల్‌ దేశాల అధ్యక్షులలాగే భారతదేశ రాష్ట్రపతీ సొంతంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితీ లేదు. మంత్రిమండలి సలహా ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుంది. అలాగని రాష్ట్రపతిది కేవలం మౌనప్రేక్షక పాత్ర కానేకాదు. అవసరమైనప్పుడు రాష్ట్రపతి ఛర్నాకోలా విసరగలరు, కొరడా ఝుళిపించగలరనడానికి చరిత్రలో బోలెడు సాక్ష్యాధారాలు పోగుబడి ఉన్నాయి.


భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ తరచుగా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ అభిప్రాయాలతో విభేదించేవారు బహిరంగంగానే ప్రభుత్వ విధానాలను విమర్శించేవారు. 1996లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్‌ రెండు కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసినప్పుడు, ఇది పద్ధతి కాదంటూ అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ తిప్పికొట్టారు. రాష్ట్రపతిగా కెఆర్‌ నారాయణన్‌ మరింత గట్టిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర పాలనకు ప్రభుత్వం ప్రతిపాదన పంపినప్పుడు– నేనేమీ రబ్బరుస్టాంపును కానంటూ దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ సైతం దూకుడు ప్రదర్శించారు. మరణశిక్ష పడిన ఖైదీలకు సంబంధించి ఏకంగా 28 క్షమాభిక్ష అర్జీలను చెత్తబుట్టలో పడేశారు. అంతేకాదు, ప్రభుత్వ సలహాను తోసిరాజని, నలుగురి మరణశిక్షలను యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చారు. 1975లో ఎమెర్జెన్సీ విధింపునకు సంబంధించి ప్రధాని ఇందిరాగాంధీ పంపిన ఫైలు మీద అర్ధరాత్రి కళ్లుమూసుకుని సంతకం చేయడం ద్వారా దేశాన్ని అంధయుగంలోకి నడిపిన హీనచరిత్ర ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ది కాగా, రాష్ట్రపతి పదవికి ఉన్న పవర్‌ ఇదీ అంటూ లోకానికి చాటిచెప్పిన విశిష్ట వ్యక్తిత్వం జ్ఞానీ జైల్‌సింగ్‌ది. ఇందిరాగాంధీ (1982–84), రాజీవ్‌గాంధీ (1984–87) ప్రధానమంత్రులుగా ఉండగా– రాష్ట్రపతిగా జ్ఞానీ జైల్‌సింగ్‌ పోషించిన పాత్ర అద్వితీయం, సంచలనాత్మకం. 1984లో ఎన్టీఆర్‌ సర్కారును ఇందిరాగాంధీ అన్యాయంగా బర్తరఫ్‌ చేసినప్పుడు ప్రజాస్వామ్య రక్షకుడిగా వ్యవహరించారాయన. ఇందిర అసమ్మతిని సైతం బేఖాతరు చేసి, ఎన్టీఆర్‌ను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను రాష్ట్రపతి భవన్‌లోకి అనుమతించి, సావధానంగా వారి మొర ఆలకించిన ఘనత ఆయనది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడైతే– ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వివాదాస్పద ఇండియన్‌ పోస్టాఫీసు (సవరణ) బిల్లుపై సంతకం చేయడానికి ఆయన నిరాకరించడంతో, చివరకు ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకోవలసి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషీకి ఘాటైన లేఖ రాసి బాధ్యతను గుర్తు చేశారు జ్ఞానీజీ. ఒక దశలో ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీని బర్తరఫ్‌ చేసేందుకూ ఆయన సిద్ధపడ్డారన్న వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి పదవన్నది ఎంతమాత్రం రబ్బరు స్టాంపు కాదనేందుకు ఇలాంటి నిదర్శనలు ఎన్నో! కీలక సమయాల్లో క్రియాశీల పాత్రకు అవకాశం ఉన్నందువల్లే ఇప్పుడు ఆ పదవి కోసం ఇంతటి పోటీ, పోరాటం, ఆరాటం!

పి. దత్తారాం ఖత్రీ

(సీనియర్‌ జర్నలిస్టు)

Updated Date - 2022-06-29T05:58:26+05:30 IST