PRC షాక్‌ నుంచి తేరుకోని ఉద్యోగులపై Jagan Sarkar దెబ్బమీద దెబ్బ!

ABN , First Publish Date - 2022-01-10T07:50:26+05:30 IST

PRC షాక్‌ నుంచి తేరుకోని ఉద్యోగులపై Jagan Sarkar దెబ్బమీద దెబ్బ!

PRC షాక్‌ నుంచి తేరుకోని ఉద్యోగులపై Jagan Sarkar దెబ్బమీద దెబ్బ!

  • పదొచ్చినా.. జీతాలేవీ?
  • 30% వేతనాలు.. 50% పింఛన్లు రాలేదు
  • 6,500 కోట్ల సొమ్ము ఏమైనట్లు?..
  • డిసెంబరు 28న 2,250 కోట్ల అప్పు
  • ఈ నెల 4న మరో 2,500 కోట్లు..
  • రెవెన్యూ లోటు భర్తీ కింద 1,438 కోట్లు
  • ఇవన్నీ ఏమయ్యాయి?..
  • అప్పు కోసం మళ్లీ ఢిల్లీకి బుగ్గన


అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి అప్పుడే పది రోజులు.. పదో తారీఖొచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పదవీవిరమణ చేసినవారికి పింఛన్లు అందలేదు. దాదాపు 30 శాతానికిపైగా ఉద్యోగులకు, సగం మంది పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం. దీనిపై పింఛనుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూటపూటకూ.. గంటగంటకూ బ్యాంకు ఖాతాలు చెక్‌ చేసుకుని ఉసూరుమంటున్నారు. జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్‌సీ ఝలక్‌ నుంచి తేరుకోని ఉద్యోగులు.. దెబ్బ మీద దెబ్బలా ఈ నెల జీతాలు ఇంకా అందకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా జీతాలు, పెన్షన్ల కింద రూ5,500 కోట్లు అవసరం. ఇందులో పెన్షన్ల రూపంలో రూ.1,500 కోట్లు, మిగిలినవి వేతనాలకు ఇస్తారు. ఈ నెల పెన్షన్ల కింద ఇంకా రూ.750 కోట్ల వరకు చెల్లించాలి. డబ్బుల్లేక ఇప్పటికే ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసుకుంది. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోగా అప్పు కూడా పుట్టకపోవడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జనవరి 10న అమలు చేస్తానంటూ ప్రకటించిన ఈ పథకాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఇష్టం వచ్చినట్లు చేసిన అప్పులు, వాటి చెల్లింపులతో ఆర్థిక వ్యవస్థ దివాలాబారిన పడింది. ఈ రెండున్నరేళ్ల ఆర్థిక అక్రమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని మీడియా సహా, ఆర్థిక నిపుణులు, రిటైర్డ్‌ ఉద్యోగులు హెచ్చరిస్తున్నా జగన్‌ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.


అవ్వాతాతల పెన్షన్లకూ కటకట!

ప్రతి నెల 1న అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్ల కోసం ఈ నెల డబ్బులు వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. ఒకటో తేదీకి రెండురోజుల ముందే పంచాయతీ అధికారులు డబ్బులు డ్రా చేసి వలంటీర్లకు ఇచ్చి ఒకటో తేదీ కల్లా పంచడానికి సిద్ధంగా ఉంచేవారు. ఈ నెల డబ్బుల్లేకపోవడం, అప్పు ఆలస్యంగా అందడంతో 1న పంచాయతీ అధికారులు బ్యాంకుల వద్ద పడిగాపులు పడి.. ఆ రోజు సాయంత్రానికి గాని పెన్షన్ల డబ్బు డ్రా చేయలేకపోయారు. 2, 3 తేదీల్లో దానిని పంచారు. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల వంతు. పదో తేదీ వచ్చినా దాదాపు 30శాతం మంది ఉద్యోగులకు వేతనాలు, 50 శాతం పెన్షనర్లకు పింఛన్లు అందలేదు. కొత్త అప్పులకు కేంద్ర అనుమతి కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఢిల్లీ బాటపట్టారు. సోమవారం ఎలాగైనా కేంద్ర ఆర్థికశాఖ అధికారులను ఒప్పించి అప్పులకు అనుమతి తీసుకుని మంగళవారం ఆర్‌బీఐ వద్ద రాష్ట్రాల సెక్యూరిటీ వేలంలో పాల్గొన్ని అప్పులు తేవాలనేది వారి పర్యటన అజెండా.


ఆర్థిక అరాచకాలు చుట్టుముట్టి..

ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తుంటే.. ఏపీని మాత్రం జగన్‌ ప్రభుత్వ ఆర్థిక అరాచకాలు చుట్టుముడుతున్నాయి. ప్రతి ఖర్చుకూ అప్పులపైనే ఆధారపడుతున్నారు. లక్ష రూపాయలకు కూడా వెతుక్కునే పరిస్థితికి ఆర్థిక స్థితి దిగజారింది. కేంద్రం కొత్త అప్పులకు అనుమతివ్వకపోతే పరిస్థితేమిటని ఉద్యోగుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అప్పు రాకపోతే ఈ నెల వేతనాలు, పెన్షన్లు అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు 28న రూ.2,250కోట్లు, ఈ నెల 4న రూ.2,500కోట్లు ప్రభుత్వం అప్పుతెచ్చింది. 6న కేంద్రం నుంచి రెవెన్యూ లోటు నిధులు రూ.1,438కోట్లు వచ్చాయి. పన్నుల రూపంలో, వివిధ రూపాల్లో ఖజానాకు రెగ్యులర్‌గా వచ్చే ఆదాయం.. అన్నీ కలిపితే గత 14రోజుల్లో రూ.6,500కోట్లకు పైగా వచ్చాయి. వేతనాలు, పెన్షన్ల పూర్తిస్థాయి చెల్లింపులకు అవసరమైన వాటికంటే ఇది ఎక్కువే. అవన్నీ ఎటు పోయా యో తెలీదు. దివాలా ముంగిట్లో ఉన్న జెన్కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను ఆదుకోవడానికి గానీ, ఉద్యోగులకు, జీతాలు, పెన్షన్లుకు గానీ వాడలేదు. కనీసం ప్రభుత్వ పథకం ఈబీసీ నేస్తం కోసమూ మిగల్చలేదు. మరి ఏమైనట్లు?



Updated Date - 2022-01-10T07:50:26+05:30 IST